ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖ ఇటీవల వెలువరుస్తున్న విభిన్న ప్రకటనల సారం ఒకటే సూచిస్తున్నది. పాఠశాల విద్యకు, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు మధ్య వారధిగా నిలిచిన ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థకు అతి త్వరలో మంగళం పాడనున్నట్టుగా కనపడుతోంది. ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రభుత్వ రంగానికి సంబంధించి జూనియర్ కళాశాలల్లో, సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో, గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలల్లో, ఆదర్శ పాఠశాలల్లో, కొన్ని కెజిబివి పాఠశాలల్లోనూ, ప్రైవేటు రంగానికి సంబంధించి ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో, వామనుడి పాదాల వంటి కార్పోరేట్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థ నడుస్తోంది. ఇది కాక వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన ట్రిపుల్‌ఐటిల్లో దేశంలో ప్రస్తుతం ఎక్కడా కనిపించని పియుసి (ప్రి యూనివర్శిటీ సర్టిఫికేట్) కోర్సులో కూడా దాదాపు ఆరు వేల మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. అయితే వారు బోర్డు ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ పరిధిలోకి రావడం లేదు. వారిని మినహాయిస్తే, ఇంటర్ మొదటి సంవత్సరంలో దాదాపు ఆరు లక్షల మంది, రెండవ సంవత్సరంలో సుమారుగా ఐదు లక్షల మంది విద్యార్థులు ఈ విద్యాసంవత్సరంలో ఇంటర్ విద్యను కొనసాగిస్తున్నారు. ఈ పదకొండు లక్షల మంది విద్యార్థులు ఈ ఏడాది పరీక్షలు రాస్తారో లేదో తెలియని సందిగ్ధంలో ఉన్నారు. ఇందులో సుమారు ఐదు లక్షల మంది రెండవ సంవత్సరం విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు కూడా హాజరయ్యారు.
Also read: పలుకే బంగారమాయే!
బోర్డు తెరమరుగు కానుందా!
కిందటేడాది ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలు వెలువరించినప్పుడు ఇంటర్ బోర్డు కమిషనర్ ఒక్కమాట చెప్పి పక్కకు తప్పుకున్నారు. పేపర్లలో గానీ, టీవీల్లో గాని ఫలితాల ప్రకటనలు చేయకూడదని హెచ్చరించారు. ఈ ఏకవాక్య తీర్మానంతో గత కొన్నేళ్లుగా చెవుల్లో మోత మోగించిన “ఒకటి.. ఒకటి.. రెండు.. రెండు..” ప్రకటనలు ఆగిపోయాయి. పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటలను కనిపించడం మానేశాయి. ఆ రోజు టీవీల ముందు బోర్డు కార్యదర్శికంటే పాఠశాల విద్యాశాఖ కమిషనర్ బి. రాజ శేఖర్ ఎక్కువ సేపు మాట్లాడడం విశేషం. అక్కడికి సరిగ్గా ఎనిమిది నెలలకు ప్రభుత్వం రాష్ట్రంలో అమలుచేయ తలపెట్టిన నూతన జాతీయ విద్యా విధానం వివరాలను వెల్లడించారు. ఈ విధానంలో ఐదేళ్ల ఫౌండేషన్ విద్య రెండో తరగతి వరకు నడుస్తుంది. తరువాత ఐదో తరగతి వరకు మూడేళ్ల ప్రాథమిక విద్య, మరో మూడేళ్ల జానియర్ హైస్కూల్ విద్య ఎనిమిదో తరగతి వరకు, అనంతరం నాలుగేళ్ల సీనియర్ హైస్కూల్ విద్య పన్నెండో తరగతి వరకు ఉంటుంది. అక్కడితో పాఠశాల విద్య పూర్తవతుంది. అలా పదిహేనేళ్ల పాఠశాల విద్య పూర్తయ్యేనాటికి విద్యార్థులందరినీ యూనివర్శిటీలు అందించే వివిధ రకాల కోర్సులకు సన్నద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ విధంగా ఇంటర్ బోర్డును పాఠశాల విద్యలో విలీనం చేస్తారేమో చూడాలి.
Also read: రైట్.. రైట్.. ప్రైవేట్..
ఇది మన బోటి రాష్ట్రాలకు కొత్తగాని, ఇప్పటికే ఒడిశా, తమిళనాడు, కర్ణాటక తదితర పద్దెనిమిది రాష్ట్రాలకు పైగా ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో కలిపేశారు. పది తరువాత పదకొండో తరగతి, పన్నెండో తరగతి గానే చదువుకుంటున్నారు. ఇలా అందరికీ తెలుసనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఏవీ తెలియజేయడం లేదు. ప్రభుత్వ రంగంలో మాత్రం దాదాపు అన్ని మండల కేంద్రాలలో లభ్యమయ్యే వసతులను బట్టి ఉన్నత పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా ప్రమోట్ చేయనున్నట్లు సూచిస్తున్నారు. దానికి సంబంధించిన విధివిధానాలు అటు పాఠశాల విద్యాశాఖ గాని, ఇటు ఇంటర్మీడియట్ బోర్డుగాని తయారు చేసిన దాఖలాలు లేవు.
Also read: వన్ సైడెడ్ లవ్!
అన్ని విషయాల్లోనూ సందిగ్ధం
గడిచిన ఏడాది విద్యాసంవత్సరం ఎలా ప్రారంభించాలన్న దానిమీద జరిపిన కసరత్తు కూడా గొప్ప సస్పెన్స్ సినిమాను తలపించింది. ఒకవైపు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్ లైన్ పద్ధతి లోనే ఇంటర్మీడియట్ ప్రవేశాల ప్రక్రియ చేపడతామని మొండిపట్టు పట్టింది. పదో తరగతి పరీక్షలను నిర్వహించని నేపథ్యంలో ఆన్ లైన్ ప్రవేశాలకు వీలుండదని తెలిసినా, ప్రభుత్వానికి కోర్టులో అక్షింతలు వేయించాలని కోరుకునే బ్యూరోక్రాట్లు చివరి నిమషం వరకూ ఆరు లక్షల మంది విద్యార్థులను, పన్నెండు లక్షల మంది తల్లిదండ్రులను ఉత్కంఠలో ముంచారు. పదవ తరగతి శతశాతం ఉత్తీర్ణత నేపథ్యంలో ప్రభుత్వ కళాశాలలకు సీట్ల విషయంలో మినహాయింపు లేకపోవడం, ప్రైవేట్ కళాశాలల్లో మాత్రం పరిమితి విధించడం ఎవరికీ మింగుడు పడని విషయం. కాని, కోర్టు మాత్రం ఈ విషయంలో సరిపడినంతగా ప్రచారం ఇవ్వలేదన్న సాకు చూపించి ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియను నిలుపుదల చేసింది. ఈ ఏడాది కూడా అదే తంతు నడవనున్నట్లుగా మన బోర్డు అధికారుల ప్రవర్తనను బట్టి తెలుస్తోంది.
Also read: తెలుగు కథా దీపధారి అస్తమయం
గడచిన విద్యాసంవత్సరంలో ప్రవేశాల తతంగంలో మొదలైన సందిగ్ధత ఇప్పటికీ పరీక్షల నిర్వహణ విషయంలో కొనసాగుతోంది. తెలంగాణతో సహా మిగిలిన రాష్ట్రాలలో కూడా కరోనా నేపథ్యంలో తరగతుల నిర్వహణ కష్టమైనా, ఆయా రాష్ట్రాలలో ముందస్తుగానే విద్యార్థులకు పరీక్షలకు సంబంధించిన ఇదమిద్ధమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఈ ఉత్కంఠ నుంచి ఆయా ప్రభుత్వాలు మినహాయింపు నిచ్చాయి. మన ప్రభుత్వం మాత్రం చాలా విషయాలలో ముందురోజే నిర్ణయాలు తీసుకుంటోది. లేదా పలు సందర్భాలలో కోర్టులు తీసుకున్న నిర్ణయాలను అమలు పరుస్తోంది. అవి ఎన్నికలయినా, ఎన్నికల కౌంటింగ్ అయినా, పరీక్షలయినా… అదే తంతు. ప్రభుత్వ యంత్రాంగంలో కీలక నిర్ణయాలు తీసుకోవలసిన ఉన్నత స్థానాలలో పనిచేసే అధికారుల బాధ్యతారాహిత్యం , నిర్లక్ష్యం, విశృంఖలత్వం లక్షలాది మంది విద్యార్థులను గందరగోళంలో పడేస్తోంది.
Also read: అతనికెందుకు పగ!
విద్యార్థులకు స్పష్టతనివ్వాలి
దేశవ్యాప్తంగా సిబిఎస్ఇ బోర్డు పన్నెండో తరగతి పరీక్షలను రద్దు చేసినప్పటికీ మరో వెసులుబాటు కల్పించింది. కరోనా రెండో తరంగపు అలజడి సద్దుమణిగిన నేపథ్యంలో ఆసక్తిగల విద్యార్థులు ఐచ్ఛికంగా పరీక్షలు రాయవచ్చని ఒక అవకాశాన్ని విద్యార్థులకు అందించింది. ఈ ఐచ్ఛిక పరీక్షలు రాయనప్పటికీ విద్యార్థులలో సర్టిఫికేట్లలో మార్కులు ఉండబోతున్నాయి. దానికి కారణం, ఏడాది పొడువునా పలు దఫాలుగా, రకరకాల రూపాలలో వారికి లఘు అంతర్గత పరీక్షలు నిర్వహించడమే. ఈ వెసులుబాటు మన రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థలో లేదు. అంతర్గత పరీక్షల నిర్వహణ క్రమబద్ధంగా లేకపోవడమే దీనికి కారణం. నూటికి డెబ్బై మార్కులకు థియరీ పరీక్షలు, ముప్పై మార్కులకు ప్రాక్టికల్ పరీక్షలు విద్యార్థులు తప్పనిసరిగా రాయవలసిందే. పదవ తరగతి వరకు విద్యార్థులకు ఉన్నట్టుగా అధ్యయన పురోగతిలో మదింపు కోసం ఫార్మాటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్ వంటి పరీక్షలు ఇంటర్మీడియట్ లో లేకపోవడం గొప్ప వెలితి.
Also read: హ్యాష్ టాగ్ మోదీ
ఇదిలావుండగా ఒకవైపు త్వరలో ప్రారంభం కానున్న విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ప్రవేశాలు రాష్ట్రవ్యాప్తంగా ఏకరూప ఆన్లైన్ పద్ధతిలో జరుగుతాయని ప్రభుత్వం చెప్తుంటే, దానికి పూర్తి వ్యతిరేక దశలో మొదట ఆదర్శ పాఠశాలలకు, తరువాత సంక్షేమ గురుకుల కళాశాలలకు అడ్మిషన్లకు విడివిడి నోటిఫికేషన్లు అధికారులు వెలువరించారు. కార్పొరేట్ కళాశాలల అడ్డుగోలు అడ్మిషన్ల విధానాలను నియంత్రణ చేయడానికి ఆన్లైన్ అడ్మిషన్లు ఎంతగానో సహకరిస్తాయని అందరికీ తెలిసిందే. కాని, కార్పొరేట్ల సేవలో తరించే కొందరు అధికారులు ప్రభుత్వ పథకాలను నీరుగార్చడానికి, ప్రభుత్వ స్ఫూర్తిని తూట్లు పొడవడానికి ఈ విధమైన ప్రయత్నాలు చేయడం శోచనీయం. పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్ణయంలో, ప్రవేశాల విషయంలో ఉన్న సందిగ్ధతను పటాపంచలు చేస్తూ ప్రభుత్వం ఒక నిర్ణయం వెంటనే తీసుకోవాలి.
Also read: మేలుకో జగన్!