ఏమున్నది చరిత్ర మొత్తము
అది నెత్తుటి రాతల పొత్తము.
కాల పథం అడుగడుగునా
కాలుని పద ముద్రలు.
రెప రెప లాడే ఆస్థి పతాకాలు.
మైలు రాళ్లు.
ఒక్క రాజు కోసం ఆహవాగ్ని లోనికి
తథ్య మరణం వైపు పరుగులు లెత్తే
అక్షౌహిణీ ల సైన్యం…
ఒక్క కుటిల నాయకుని నమ్మి
తమను తాము తగలబెట్టుకొనే
అమాయకపు ప్రజానీకం.
తల్లి ధరణీ శరీరం
యుగ యుగాలుగా ఎంత రక్త తప్తమైనదో కదా?
ఎన్ని మాంసపు ముద్దలు
కుళ్ళి, కరిగి ఆమెలో కలసి పోయినవో కదా?
ఎన్ని ఎముకల విరిగి ముక్కలై
చిక్కుకున్నవో కదా.
మిత్తి శివమెత్తి ఆడిన ఈ ధరిత్రి పైన
మృత్తికా శేషమెంత
విగత జీవుల మజ్జా మాంస అవశిష్టం ఎంత?
ఆగు మిత్రమా ఆగు…
నీ అరచేతిలోని అర్ఘ్యం
అధరాలను తాక నివ్వకు…
అది మధుర జలం కాదు సుమా.
నీ ముందటి తరాల
వేల వేల తాత ముత్తాతల
వెచ్చటి రుధిరం.
Also read: భాష్పాంజలి
Also read: చందమామ
Also read: పగటి కలలు
Also read: భాష
Also read: సన్మానం