- కేంద్రమంత్రి కుమారుడిని అరెస్టు చేయని యూపీ పోలీసులు
- ప్రభుత్వం, రైతాంగం పరస్పర నిందలు
- ఒకరినొకరు బదనాం చేసే ప్రయత్నం
- పట్టు వీడని ప్రభుత్వం, రైతన్నలు
ఆది నుంచీ రైతుల ఉద్యమం ఆందోళనకరమైన వాతావరణంలోనే నడుస్తోంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ స్థాయిలో, ఈ రీతిలో, ఈ తీరులో ఉద్యమం సాగలేదని చరిత్రకారులు చెబుతున్నారు. జరుగుతున్న హింస, ప్రాణ నష్టం చూస్తుంటే గుండెలు బరువెక్కిపోతున్నాయి. ముందు ముందు పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయో కూడా చెప్పలేనంత సంధిగ్ధం కనిపిస్తోంది. అటు ప్రభుత్వం -ఇటు రైతు సంఘాలు పట్టువీడడం లేదు. ఈ లోపు జరగాల్సిన నష్టం జరుగుతూనే ఉంది. తమ ఆలోచనలు, వాదనలు న్యాయబద్ధమని ఇరువర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి. ఒకరిపై మరియొకరు చేసుకుంటున్న నిందాపర్వం విజయవంతంగా కొనసాగుతూనే వుంది.
Also read: వక్రబుద్ధి చైనా
పెరుగుతున్న హింసాకాండ
రైతు సమస్యలకు పరిష్కారం లభించకపోగా, హింస మహోగ్రరూపం దాల్చడం అత్యంత విషాదభరితం. తాజా లఖింపూర్ ఘటన హృదయాలను కలచివేస్తోంది. ఈ హింసకు కారకులు, ప్రేరకులైనవారికి తగిన శిక్ష పడుతుందా? ఈ ఘోరకలికి ముగింపు లేదా? రైతు సమస్యలకు పరిష్కారం లభించదా? అనేవి ప్రశ్నలుగానే మిగిలిపోతాయేమో.. అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ క్షేత్రంగా జరిగిన ఈ ఘటన క్రైమ్ సినిమా దృశ్యాలను తలపింపచేస్తోంది. ఈ భీభత్సానికి ప్రధానకారకుడుగా భావిస్తున్న కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాను ఇంతవరకూ అదుపులోకి తీసుకోకపోవడంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ హింసాత్మాక ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ కు చెందిన కొందరు న్యాయవాదులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు తాజాగా లేఖ రాశారు. రైతులపై దూసుకొచ్చిన వాహనం కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ దేనని, ఆ సమయంలో అతను కూడా అందులోనే ఉన్నాడని రైతులు ఆరోపిస్తూనే ఉన్నారు. ఈ ఘటనతో అనేకమంది మంత్రులకూ సంబంధం ఉందనీ, వారందరికీ శిక్షపడాలని రైతు సంఘాలు కోరుకుంటున్నాయి. నిజానిజాలు ఎలా ఉన్నా ఈ ఘటన ప్రభుత్వాలకు పెద్దమచ్చనే తెచ్చింది. మనుషులపై కారును ఎక్కించి చంపించడం అమానుషం. మరికొన్ని నెలల్లోనే ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఘటనలు ఎన్నికలపై ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది.
Also read: ‘మా’ ఎన్నికలలో బాహాబాహీ
పరస్పర ఆరోపణలు
ఈ దాడి అనంతరం రైతులు చేసిన ప్రతిదాడి వల్ల కూడా ప్రాణనష్టం జరిగింది. ప్రజల ముందు ప్రభుత్వాలకు చెడ్డపేరు తేవాలని రైతు సంఘాలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాయని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. రైతులను దోషులుగా చూపించడానికి ప్రభుత్వ పెద్దలు కుట్రపన్నుతున్నారని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇరువర్గాల తీరు మొదటి నుంచీ ఇలాగే ఉంది. నాడు దిల్లీలో జరిగిన ఆందోళనలు, నేడు ఉత్తరప్రదేశ్ లో సంభవించిన దుర్ఘటనలు చరిత్రలో చీకటి రోజులుగా మిగిలిపోతాయి. కేంద్రం తీసుకొచ్చిన మూడు చట్టాలు రైతులోకానికి తీవ్ర నష్టాన్ని కలిగించేవని, కార్పొరేట్ పెద్దలకు పెద్దలాభాలను చేకూర్చేవేనని దేశవ్యాప్తంగా మెజారిటీ రైతులోకం, వ్యవసాయరంగ నిపుణులు భావిస్తున్నారు. ఇవి గొప్ప సంస్కరణలని కేంద్రం గొప్పగా చెప్పుకుంటోంది. ఇరువర్గాల మధ్య అనేకసార్లు చర్చలు జరిగాయి. కానీ ఒక్కటీ ఫలించలేదు. దీనికి ప్రధాన కారణం ఒకరిపై మరొకరికి అస్సలు నమ్మకం లేకపోవడం. ఉగ్రవాద మూక, మార్కెట్ ఏజెంట్లు నడిపిస్తున్న ప్రాయోజిత కార్యక్రమం (స్పాన్సర్డ్ ఈవెంట్) గా అధికార బిజెపి భావిస్తోంది. చట్టాలను రద్దు చేయడం తప్ప ప్రత్యామ్నాయ మార్గాలను ఒప్పుకొనే ప్రశ్నే లేదని రైతు సంఘాల నేతలు భీషణ ప్రతిజ్ఞలో ఉన్నారు. రద్దు చేయడం ఆత్మగౌరవానికి భంగంగా ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారని కొందరి పరిశీలకుల అభిప్రాయం. కార్పొరేట్ వర్గాలకు మేలుచేయడం కోసమే ఈ తంతు అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
Also read: కాంగ్రెస్ లో కార్చిచ్చు
ఉత్తరాదికే పరిమితమైన ఉద్యమం
ఈ ఉద్యమ తాకిడి ఇప్పటి వరకూ ఉత్తరభారతానికే ఎక్కువగా పరిమితమై ఉంది. దక్షిణాదిలో ఇంకా ప్రకంపనలు ఊపందుకోలేదు. రైతు సంఘాల నేతలు కొందరు మాత్రం తమ వాణిని వినిపిస్తూ, సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ రైతు ఉద్యమం మిగిలిన అన్ని రాష్ట్రాలకు విస్తరించకుండానే శుభం పలకడం కేంద్ర పెద్దల తక్షణ కర్తవ్యం. లఖింపూర్ వంటి దుర్ఘటనలు పునరావృతం కావడం దేశానికి, ప్రభుత్వాలకు క్షేమదాయకం కాదు. కొత్త చట్టాల విషయంలో ఇరుపక్షాలు పంతాలు వీడి, ఉభయతారకమైన రీతిలో సత్వర పరిష్కారాలను పొందడమే వివేకం. రైతుకంట కన్నీరు శుభదాయకం కాదు. వ్యవసాయం దండగమారి కాదు. సర్వ లాభదాయకమనే భరోసాన్ని కలిగించడమే పాలకుల సుపరిపాలనకు తార్కాణం. ఇంతవరకూ ఏ పాలకుడూ రైతుల పక్షాన పూర్తిగా నిలబడలేదు. ఆ వెలితిని తీర్చి, వెతలకు ముగింపు పలికితే, రైతుల ఆశీస్సులు ఆ పాలకులకు దక్కుతాయి.
Also read: జపాన్ లో కరోనాకు ప్రధాని పదవి బలి