పాత రోతను భోగినాడు కాల్చి
చలి కాచుకుందాం
రైతులకు సిరులు తెచ్చే
పెద్ద పండుగ నాడు
సంక్రాంతి లక్ష్మి మన ఇంట చేరి
సకల శుభాలను కలిగించాలని
కనుమనాడు గోమాత దీవెనలు
మనకు లభించాలని
అంతటా సశ్య శ్యామలమై
ఆనందం వెల్లి విరియాలని
అందరూ సుఖ శాంతులతో
ఆరోగ్య మహా భాగ్యంతో
సంతృప్తిగా బ్రతకాలని
మనసారా కోరుకుందాం.
రుతువులోని జడత్వం తగ్గి
నవ చైతన్యం పెరిగే కాలం
రోగ కారకాలు నశించి
ఆరోగ్యం వికసించే కాలం
ఆనందంగా పండగ చేసుకునే
ఉత్తరాయణ పుణ్య కాలం.
పాత బాదరబందీలను వదిలించుకుని
వసంతాగమనానికి ఎదురుచూసే కాలం
కొత్త ఆశలతో మనసుని నింపే కాలం
నలుగురితో కలిసి ఆనందించే కాలం
చురుకుదనం పెరిగే కాలం
జగతిని క్రాంతి నింపే కాలం.
గోగణమే సంపద ఒకనాడు
గృహప్రవేశం నాడే అవసరం ఆవు నేడు
ఇంటింటా ఆవులు ఆనాడు
వంటింట్లో పాల పొట్లాలు నేడు
ప్రకృతితో మమేకం నాడు
వికృత కరోనాతో సహజీవనం నేడు
వన భోజనాలు, నదీ విహారాలు నాడు
నోటికి చిక్కంతో గృహ బందీలుగా నేడు
పచ్చటి పల్లె జీవితం నాడు
పంచభూతాల కాలుష్యంతో
పట్టణ జీవితం నేడు
నాటికి నేటికీ తారతమ్యం తలపోస్తూ
చేయగలిగిందేదో చూద్దాం
మన జీవితాలను బాగు చేసుకుందాం.
Also read: “వివాహం”
Also read: గీత