Saturday, November 23, 2024

నల్ల చట్టాలపై నిరసన ప్రదర్శనకు రైతుల సన్నాహాలు

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేపట్టి 6 నెలలు పూర్తవుతున్న సందర్భంగా, ఈ నెల 26వ తేదీన ‘బ్లాక్ డే’ పాటించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి హరియాణా, పంజాబ్ మొదలైన రాష్ట్రాల నుంచి దిల్లీ చేరడానికి భారీగా రైతులు బయలుదేరారు. భారత్ కిసాన్ యూనియన్ నేత గుర్నామ్ సింగ్ నాయకత్వంలో వందలాది వాహనాల్లో వేలాదిమంది రైతులు దేశ రాజధాని బాటపట్టారు.

Also read: గాజాలో శాంతి ఎంతకాలం నిలుస్తుంది?

కరోనాను ఖాతరు చేయకుండా…

ఒక వైపు కరోనా వ్యాప్తి ఉధృతంగా సాగుతోంది, దిల్లీలో లాక్ డౌన్ కూడా అమలులో వుంది. ఇటువంటి వాతావరణంలోనూ రైతు సంఘాలు ‘బ్లాక్ డే ‘ నిర్వహించి తీరాల్సిందే అనే పట్టుదలతో ఉన్నాయి. ఈ తీరుపై వచ్చిన విమర్శలను రైతునేతలు తిప్పి కొడుతున్నారు. ఎన్నికల  సమయంలో సభలు, సమావేశాలు భారీగా నిర్వహించిన ప్రభుత్వ పెద్దలకు ఒక న్యాయం – మాకొక న్యాయమా? అంటూ రైతు సంఘాల నేతలు ప్రతివిమర్శలు చేస్తున్నారు. ఉద్యమ బాట పట్టి, ఆరు నెలలు పూర్తవుతున్నా, కేంద్రం కరుణించడం లేదని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికీ ప్రభుత్వంతో చర్చలు జరుపడానికి తాము సిద్ధంగా ఉన్నామని 40 రైతు సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మొన్న శుక్రవారం నాడు లేఖ రాసింది. దానికి ఇంకా జవాబు రావాల్సి వుంది.

Also read: కరోణా కట్టడికి విశ్వప్రయత్నం

మార్పులేని ప్రభుత్వ వైఖరి

రాకేశ్ టికాయిత్ నాయకత్వంలో రైతు సంఘాల ఉద్యమం ఆరంభమై ఆరు నెలలు పూర్తవుతున్నా, కేంద్ర వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదు. ప్రభుత్వం – రైతు సంఘాల మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. కానీ  ఏ ఒక్కటీ ఫలించలేదు. ప్రధానంగా ఒకరినొకరు నమ్మడం లేదు. వీళ్ళు రైతులే కారు, ఇవి రైతు సంఘాలే కావు, మార్కెటింగ్ ఏజెంట్ల పెట్టుబడితో తలపెట్టిన నకిలీ ఉద్యమం అంటూ బిజెపి నేతలు కొందరు అభివర్ణిస్తున్నారు. దేశ వ్యవసాయ రంగం మొత్తాన్ని అదానీ,అంబానీలకు అప్పచెప్పడానికి బిజెపి ప్రభుత్వం చేస్తున్న పెద్ద కుట్రగా రైతు సంఘాలు మండిపడుతున్నాయి. దిల్లీ సరిహద్దుల్లో భీభత్సంగా ఉద్యమాన్ని నడిపించడమే కాక  మొన్న ఎన్నికలు జరిగిన రాష్ట్రాలకు రైతు సంఘాల నాయకులు వెళ్లి బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేసి వచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న కార్మిక సంఘాలకు మద్దతు ప్రకటించడమే కాక, రైతు సంఘాల ఐక్య వేదిక ప్రధాన నేత రాకేశ్ టికాయిత్ విశాఖపట్నం వెళ్లి మరీ ఉద్యమంలో పాల్గొన్నారు. వారిని దిల్లీ వచ్చి  ఉద్యమం నిర్వహించమని స్వాగతించారు.

Also read: బెంగాల్ లో కేంద్రం పక్షపాత వైఖరి

మూడు చట్టాలూ రద్దు చేయవలసిందే

ఘోరమైన చలికి, మండుటెండలకు, కరోనాకు, ప్రాణాలకు, కేంద్ర ప్రభుత్వానికి… దేనికీ వెరవకుండా రైతులు నిరాఘాటంగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. కేంద్రం తలఒగ్గడం లేదు, రైతులు మడమ తిప్పడం లేదు. రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకువచ్చిన మూడు చట్టాలను రద్దు చేయడం తప్ప వేరే ప్రత్యామ్నాయం ఏమీ లేదని రైతు సంఘాలు తెగేసి చెబుతున్నాయి. వివాదాస్పదంగా ఉన్న బిల్లులను కొంతకాలం పెండింగ్ లో పెట్టి చర్చల తర్వాత  ఆచరణలో పెట్టమని సీనియర్ జర్నలిస్ట్ పాలగుమ్మి సాయినాథ్ ( మాజీ రాష్ట్రపతి వివి గిరి మనవడు కూడా) సూచించారు. కొంతకాలం పాటు పెండింగ్ లో పెట్టడానికి సుముఖంగా ఉన్నట్లు  రైతులతో చర్చల సందర్భంగా  ఒక దశలో కేంద్ర ప్రతినిధులు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వాలని రైతు సంఘాలు కోరాయి. ప్రభుత్వం ఆ పని చెయ్యలేదు. మళ్ళీ సమస్య మొదటికి వచ్చింది. ఉద్యమం సాగుతూనే ఉంది. సుప్రీం కోర్టు కూడా కలుగజేసుకొని ఒక కమిటీని ఏర్పాటుచేసింది. అందులో ఉన్న సభ్యులపై రైతు నేతలు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. వారు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పక్షపాతులుగా అనుమానించారు. ఆ తర్వాత ప్రభుత్వ పెద్దలు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో నిమగ్నమైపోయారు. మొత్తం మీద రైతుల ఆందోళనకు తెరపడలేదు. కేంద్రం  నిర్ణయాన్ని ఉపసంహరించుకోలేదు. ఈ బిల్లుల వల్ల రైతులకు జరిగే ప్రయోజనాలను ప్రచారం చెయ్యాలనే బిజెపి ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా  బిజెపి నేతలు కొంతదూరం ముందుకు వెళ్లారు.

Also read: బెంగాల్ లో కేంద్రం పక్షపాత వైఖరి

కరోనా కాటేస్తున్నా దీక్ష సడలని రైతన్న

దేశమంతా కరోనా అంశంతో కుతకుతలాడుతున్నా  రైతు సంఘాలు మాత్రం ఒకే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. చట్టాలను రద్దు చేయడమే వారి ఏకైక ఎజెండా. రైతులకు గిట్టుబాటు ధర లభించడం, మార్కెట్ యార్డులు అందుబాటులో ఉండడం, విద్యుత్ వ్యవస్థ అనుకూలంగా ఉండడం, వ్యవసాయంపై, వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలపై సర్వ స్వేచ్ఛలు రైతులు కలిగిఉండడానికి కేంద్రం తెచ్చిన చట్టాలు అడ్డుగోడలుగా నిలుస్తాయని రైతు సంఘాలు వాదిస్తున్నాయి. కాంట్రాక్టు ఫార్మింగ్ పేరుతో పలు కంపెనీలు రైతుల భూములపై కన్నువేశాయని టికాయిత్ పదే పదే ఆరోపిస్తున్నారు.’గ్రీన్ రెవల్యూషన్ ‘ పితామహుడు స్వామినాథన్ చేసిన సూచనలను కూడా కేంద్రం పెడ చెవిన పెట్టిందని రైతు సంఘాలు అంటున్నాయి. స్వామినాథన్ నివేదికలను పరిగణలోకి తీసుకొని, వ్యవసాయ రంగంలో సంస్కరణల దిశగా ముందుకు వెళ్తున్నామని కేంద్ర పెద్దలు బదులు చెబుతున్నారు.నూతన వ్యవసాయ చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ  రూపొందించిన నివేదిక మార్చి 19వ తేదీన సుప్రీంకోర్టుకు అందింది.దీనిపై తదుపరి పరిణామాలు ఇంకా తెలియాల్సి వుంది. దిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న ఈ మహోద్యమంలో పిల్లలు, వృద్ధులు కూడా పాల్గొంటున్నారు. కరోనా  దృష్ట్యా, సుప్రీంకోర్టు కూడా రైతు సంఘాలకు పలుసూచనలు చేసింది. పిల్లలు, వృద్ధులు, మహిళలను వెనక్కి పంపడమే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కానీ, రైతు సంఘాలు వెనక్కు తగ్గడం లేదు. పట్టుదలగానే ఉన్నాయి.ఈ ఆరు నెలల కాలంలో చాలామంది మరణించారు కూడా.

Also read: వ్యాపార ప్రయోజనాలకు వాట్సప్ పెద్దపీట

మోదీ వాగ్దానంలో డొల్లదనం

నిరసనలకు స్వస్తి పలికి చర్చలకు రమ్మనమని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గతంలో స్పష్టం చేశారు. 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, 2016లో గుజరాత్ లో జరిగిన సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతులకు మాట ఇచ్చారు. రైతు కుటుంబం సగటు నెలసరి ఆదాయం 2013లో 6,426 ఉంది. 2016-17లో రూ. 8,931 ఉంది. మోదీ చెప్పినట్లుగా చూస్తే ఇప్పుడు సుమారు రూ. 18,000  ఉండాలి. కానీ సుమారు 10,000 రూపాయలకు అటుఇటుగా మాత్రమే ఉంది. నాయకుల మాటలు చేతల్లో ఫలించడం లేదని రైతు సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగస్తుల పే కమిషన్ నివేదికల ప్రకారం చూస్తే, అతి చిన్న ఉద్యోగి జీతం కంటే కూడా, రైతుల ఆదాయం చాలా తక్కువగా ఉంది. భారతదేశం వ్యవసాయ దేశం. వ్యవసాయం దండగమారి అని భావించి, అన్నదాత కాడి పడేస్తే, అందరూ ఆకలితో చావాల్సిందే. పల్లెలు, రైతులు పచ్చగా ఉంటేనే  దేశం సుభిక్షంగా ఉంటుంది. ఇప్పటికైనా  ఇరువర్గాలు శాంతియుతంగా చర్చలు జరిపి, ఈ ఆందోళనకు చరమగీతం పాడాలి. రైతుపక్షపాతిగా ముద్ర వేసుకున్న నాయకులు చరిత్రలో మిగులుతారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ, ఎన్ని ప్రభుత్వాలు మారినా, రైతులకు ఒరిగింది ఏమీ లేదన్నది చేదునిజం.  వ్యవసాయం లాభసాటి అవ్వాలి, రైతు బాగుండాలి. ఆ రోజులు రావాలని బలంగా కోరుకుందాం.

Also read: కాంగ్రెస్ కు కాయకల్ప చికిత్స ఎప్పుడు?

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles