- గుజరాత్ లో కాంగ్రెస్ ను నమిలేసిన ఆప్, అసదుద్దీన్
- కాంగ్రెస్ అధిష్ఠానం నిరాసక్తతకు తోడు మోదీ, అమిత్ షాల విజృంభన
- జాతీయ పార్టీగా గుర్తింపు పొందేందుకు ఆప్ కు అర్హత
గుజరాత్ లో బీజేపీ దిగ్విజయం వెనుక బీజేపీ కృషి, కాంగ్రెస్ బేలతనం, ఆప్ చొరవ ఉన్నాయి. ఆప్ విజృంభించి ప్రచారం చేయకపోతే కాంగ్రెస్ కు ఇరవై కంటే తక్కువ స్థానాలు దక్కేవి కాదు. బీజేపీకి 150కి మించి స్థానాలు వచ్చేవి కావు. ఆప్ ఎన్ని స్థానాలు గెలుచుకున్నదనే విషయం కంటే ఎన్ని స్థానాలలో కాంగ్రెస్ ని ఓడించిందో చెప్పుకోవడం మంచిది. కానీ బీజేపీ ఘనవిజయం వెనుక ఆప్ రంగప్రవేశం ప్రభావం కచ్చింతంగా ఉంది. రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీలు గుజరాత్ పైన ఈ సారి శీతకన్ను వేశారు. అంతా స్థానిక నాయకులకు విడిచిపెట్టారు. కారణం ఏదైనా ఈ సారి బీజేపీ ఘనవిజయం సాదించింది. 1985తో అత్యధిక స్థానాలు గెలుచుకొని కాంగ్రెస్ నెలకొల్పిన రికార్డును బీజేపీ ఈ సారి బద్దలు కొట్టింది. కొత్త బీజేపీ ప్రభుత్వం సోమవారంనాడు గుజరాత్ లో ప్రమాణస్వీకారం చేస్తుంది.
కాంగ్రెస్ వైఖరికి భిన్నంగా బీజేపీ, ఆప్ లు వ్యవహరించాయి. ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాతనే ముప్పయ్ సభలలో ప్రసంగించారు. రోడ్ షో లు నిర్వహించారు. రోజుకు రెండు, మూడు సభలలో ప్రసంగించారు. ఓటింగ్ రోజున ఓటేయడానికి కూడా రోడ్ షో నిర్వహించిన మోదీ తన శక్తియుక్తులన్నింటినీ పూర్తిగా వినియోగించారు. అమిత్ షా చాలా రోజులపాటు గుజరాత్ లోనే తిష్ఠ వేశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాల స్వరాష్ట్రం కావడం, ఎన్నికల ప్రకటనకు బాగా ముందు నుంచీ రకరకాల పెట్టుబడులు గుజరాత్ లోకి రావడం, ప్రధాని అదే పనిగా గుజరాత్ సందర్శించడం, ప్రారంభోత్సవాలు చేయడం, శంకుస్థాపనలు చేయడం వంటి పనులు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రధానికి వెసులుబాటు కల్పించే ఉద్దేశంతోనే ఎన్నికల సంఘం కూడా హిమాచల్ ప్రదేశ్ తో పాటు కాకుండా గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ను ఆ తర్వాత నింపాదిగా ప్రకటించారు.
అది ప్రధాని, హోమంత్రి సొంత రాష్ట్రం, వారికి అదికారం దండిగా ఉంది. ఎక్కడి పరిశ్రమలనైనా, పెట్టుబడులనైనా గుజరాత్ కు తరలించే చొరవ, తెగువ వారికి ఉన్నాయి. నిధుల కొరతలేదు. ఎన్నికల బాండ్ల ధర్మమా అని కార్పొరేట్ సంస్థలు ఇబ్బడిముబ్బడిగా బీజేపీకి నిధులు గుమ్మరిస్తున్నాయి. ఎన్నికల సంఘం కూడా మోదీ అభీష్టం ప్రకారం నడుచుకుంటుంది. కాంగ్రెస్ కు గుజరాత్ లో కానీ కేంద్రంలో కానీ అధికారం లేదు. నిధుల కొరత పార్టీని వేధిస్తోంది. ఏఐసీసీ కార్యాలయాన్ని నడిపించడమే కష్టంగా ఉందంటున్నారు. గుజరాత్ మోదీ కర్మభూమి. 2002 నుంచి ఆయన కత్తికి ఎదురు లేదు. అటువంటి చోట పోటీ పడి భంగపడటం ఎందుకు అనే ఆలోచన గాంధీ కుటుంబంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఎంత కష్టపడినా, ఎంత డబ్బు అప్పు చేసి ఖర్చు చేసినా మోదీ, అమిత్ షా ల పై గెలుపు అసాధ్యమనే నిర్ణయానికి వచ్చి ఉంటారు. నెల రోజుల కిందట మోర్బీ ప్రాంతంలో ఒక పాత హాంగింగ్ బ్రిడ్జ్ కూలి 130మంది దాకా దుర్మరణం చెందారు. ఆ ఘోరానికి బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహించాలనీ, స్థానిక సంస్థలు వాచ్ మరమ్మతు చేసే కంపెనీకి రోప్ వే మరమ్మత్తు పని కాంట్రాక్టు కు ఇచ్చాయనీ, ఇది అవినీతికి పరాకాష్ఠ అనీ పత్రికలూ,చానళ్ళూ కోడై కూశాయి. కానీ మోదీ-షా ప్రభావంతో అక్కడ కూడా బీజేపీ అభ్యర్థి గెలవడం శోచనీయం.
అధికార భారతీయ జనతా పార్టీకి 53 శాతానికి పైగా ఓట్లు లభించాయి. కాంగ్రెస్ పార్టీ 21శాతానికి మించి ఎదగలేకపోతోంది. బీజేపీ 2017లో 49.1 శాతం ఓట్లు సాధించగా ఈ సారి 53శాతానికి పెరిగింది. అదే కాంగ్రెస్ లో లోగడ 41.4 శాతం ఓట్లు సాధించిదల్లా ఈ సారి 27 శాతానికి మించడం లేదు. పోయినసారి కాంగ్రెస్ 77స్థానాలు గెలుచుకున్నది.
2019నాటి లోక్ సభ ఎన్నికలలో బీజేపీకి 62.21 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ 32.11 శాతం ఓట్లు వచ్చినా ఒక్క స్థానం సైతం గెలుచుకోలేదు. 2017లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసింది నామ్ కే వాస్తేగా. ఒక్క సీటు కూడా రాలేదు. ఒక్కచోట కూడా డిపాజిట్ సైతం దక్కలేదు. 0.1 శాతం ఓట్లు వచ్చాయి. ఈ సారి సుమారు 13 శాతం ఓట్లు కేజ్రీవాల్ పార్టీ సాధించింది. ఇది విశేషం. గుజరాత్ లో రెండుసీట్లూ, ఆరు శాతం ఓట్లూ గెలుచుకోగలిగితే ఆప్ జాతీయ పార్టీగా గుర్తింపు పొందగలుగుతుంది. ఇప్పటికే ఆ అర్హతను ఆప్ సాధించింది.
కాంగ్రెస్ నిరాసక్తతకు తోడు అసదుద్దీన్ ఒవైసీ, ఆప్ పార్టీలు ముస్లింల సంఖ్యాధిక్యం ఉన్న నియోజకవర్గాలలో దెబ్బతీశాయి. అసద్ 13 నియోజకవర్గాలలో అభ్యర్థులను నిలిపాడు. వారిలో ఇద్దరు ముస్లిమేతరులు. ఆమ్ ఆద్మీ పార్టీ 16 ముస్లిం ఆధిక్యం కలిగిన నియోజకవర్గాలలో అభ్యర్థులను నిలబెట్టింది. ఎక్కడా విజయం సాధించలేదు. ఒక్క ముస్లిం అభ్యర్థిని బీజేపీ నిలబెట్టకపోయినప్పటికీ ఆ పార్టీకి ముస్లింల ఆధిక్యం కలిగిన నియోజకవర్గాలలో గెలుపు సాధ్యమైంది. చాలా ఎన్నికలలో కాంగ్రెస్ గెలుస్తూ వచ్చిన స్థానాలను ఈ సారి బీజేపీ కైవసం చేసుకున్నది. గుజరాత్ లో ముస్లింల సంఖ్యాధిక్యం కలిగిన నియోజకవర్గాలు 17వరకూ ఉన్నాయి. వాటిలో 12 స్థానాలు ఈ సారి బీజేపీ అభ్యర్థులు గెలుపొందడం విశేషం.
హిమాచల్ ప్రదేశ్ లో ఆనవాయితీ ప్రకారం కాంగ్రెస్
బీజేపీ గుజరాత్ లో ఘనవిజయం సాధిస్తున్నదని ఓట్ల లెక్కింపు ప్రారంభించిన తర్వాత రెండు గంటలలోనే ఆధిక్యాలు చూస్తే స్పష్టమైపోయింది. కానీ హిమాచల్ ప్రదేశ్ మాత్రం అటూ ఇటూ ఊగిసలాట మధ్యాహ్నం వరకూ కొనసాగించింది. మొదట బీజేపీ ఆధిక్యంలో ఉన్నది. రెండు గంటల అనంతరం కాంగ్రెస్ కాస్త ముందుకు జరిగింది. మధ్యాహ్న దాటిన తర్వాత కాంగ్రెస్ పూర్తిగా ముందుకు చొచ్చుకొని పోయింది. నాలుగు దశాబ్దాలుగా ఈ కొండల రాష్ట్రం ఒక సారి కాంగ్రెస్ కు అధికారం ఇస్తే మరొకసారి బీజేపీని గెలిపిస్తూ వచ్చింది. అదే ఆనవాయితీ ఈ సారీ కొనసాగింది.
బీజేపీకి గుజరాత్ లో ఉన్న సౌలభ్యం హిమాచల్ ప్రదేశ్ లో లేదు. అది మోదీకి కానీ అమిత్ షా కి కానీ సొంత రాష్ట్రం కాదు. పైగా ఆ రాష్ట్రానికి ఒక చరిత్ర ఉంది. అధికారంలో ఉన్న పార్టీని ఓడించే సంప్రదాయం ఉంది. ఆ ‘రివాజు (పద్ధతి) బదలేగా (మారుతుంది)’ అంటూ బీజేపీ ప్రచారం చేసింది. కానీ రివాజు కొనసాగింది. కాంగ్రెస్ సునాయాసంగానే గెలిచింది. రాహుల్ పాదయాత్రలో ఉన్నప్పుడు చెల్లి ప్రియాంక హిమాచల్ లో ప్రచారం చేశారు. అక్కడ పార్టీలో కలహాలు అంతగా లేవు. కలహాల పార్టీ బీజేపీ. ఆ పార్టీ చాలామంది శాసనసభ్యులకు టిక్కెట్లు ఇవ్వలేదు. వారంతా తిరుగుబాటు చేశారు. కొందరు ప్రధాని స్వయంగా ఫోన్ చేసినప్పటికీ ఖాతరు చేయలేదు. అందువల్ల హిమాచల్ లో కాంగ్రెస్ 40 స్థానాలు గెలుచుకొని బీజేపీని 25 స్థానాలకు పరిమితం చేసింది. ఈ రాష్ట్రంలో ఆప్ ఖాతా తెరిచినట్టు లేదు.
దిల్లీ చిత్రాలు
దిల్లీ విచిత్రమైన నగరం. పౌరులు ఆచితూచి ఓటు వేస్తారు. మొన్న జరిగిన మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ దిల్లీ (ఎమ్ సీడీ) ఎన్నికలలో ఆమ్ ఆద్మీపార్టీని గెలిపించారు కానీ పంజాబ్ లో గెలిచినట్టు పెద్ద మెజారిటీతో గెలవలేకపోయింది. బీజేపీ, ఆప్ ల మధ్య దిల్లీ పౌరుల వైఖరి చిత్రంగా మారుతూ వచ్చింది. దిల్లీ పౌరులు 2019లో మొత్తం ఏడు లోక్ సభ స్థానాలను బీజేపీకి కట్టబెట్టారు. అంతకు రెండు సంవత్సరాల ముందు దిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో బీజేపీ ఘనవిజయం అందించారు. అప్పుడు ఆప్ గెలుచుకున్న స్థానాల (వార్డుల) సంఖ్య 48. అంతకు రెండేళ్ళ ముందు 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ ను గెలిపించారు. అంతకు ఒకే ఒక సంవత్సరం ముందు 2014లో జరిగిన లోక్ సభ ఎన్నికలలో మొత్తం ఏడు స్థానాలనూ బీజేపీకి అప్పజెప్పారు. 2017లో బీజేపీని మునిసిపల్ ఎన్నికలలోనూ, 2019లో అదే పార్టీని లోక్ సభ ఎన్నికలలోనూ ఘనాతిఘనంగా గెలిపించిన దిల్లీ ఓటర్లు 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ కు పట్టంకట్టారు. మొత్తం 70 స్థానాలకు గానూ 67స్థానాలు గెలుచుకున్నది. అన్ని ఎన్నికలలో ఓట్లు వేస్తున్నది అదే ఓటర్లు. అసెంబ్లీ ఎన్నికలకు కేజ్రీవాల్ నూ, లోక్ సభ ఎన్నికలలో నరేంద్రమోదీనీ ఆదరిస్తున్నారు. మునిసిపల్ ఎన్నికల విషయానికి వచ్చే సరికి 15 సంవత్సరాలు బీజేపీని మోశారు. మొన్న జరిగిన ఎన్నికలలో బీజేపీని కిందికి దించారు కానీ నేలకేసి కొట్టలేదు. 104 వార్డులలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. లోక్ సభ, అసెంబ్లీ, ఎంసీడీ ఎన్నికలలో బీజేపీ ఓట్ల శాతం క్రమంగా ఎన్నికలకు ఎన్నికలకూ పెరుగుతూనే వచ్చింది. 2015 ఎన్నికలలో బీజేపీకి 32శాతం ఓట్లు పడ్డాయి. 2017 మునిసిపల్ ఎన్నికలనాటికి ఆ శాతం 36 శాతానికి పెరిగింది. 2019 నాటికి 38 శాతానికి చేరుకున్నది. మొన్నటి మునిసిపల్ ఎన్నికలలో 39 శాతం ఓట్లు బీజేపీ సంపాదించుకున్నది. కాంగ్రెస్ పూర్తిగా అడుగంటడం వల్ల ఆప్ ఆబోరు దక్కింది.
ఇక కాంగ్రెస్ ఎట్లా నష్టబోయిందో చూద్దాం. 2017 మునిసిపల్ఎన్నికలలో కాంగ్రెస్ కు 21.03 శాతం ఓట్లూ, 31 సీట్లూ దక్కాయి. అది 2022 మునిసిపల్ ఎన్నికల నాటికి 11.93 శాతానికి పడిపోయింది. అదే 2019 లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ నిలదొక్కుకుంది. 22 శాతం ఓట్లు సంపాదించింది. అప్పుడు ఆప్ 18 శాతం ఓట్లతో మూడో స్థానానికి వెళ్ళిపోయింది. లోక్ సభ ఎన్నికలు వచ్చే సరికి దిల్లీ పౌరులు ఆప్ కంటే కాంగ్రెస్ కు ఎక్కువ గౌరవం ఇస్తున్నారు. దిల్లీ అసెంబ్లీ, మునిసిపాలిటీ ఎన్నికల విషయంలో ఆప్ కీ, బీజేపీకీ అధికారం ఇస్తున్నారు. ఆప్ పెరుగుదలకూ, కాంగ్రెస్ తరుగుదలకూ సంబంధం ఉంది. ఆప్, కాంగ్రెస్ లతో సంబంధం లేకుండానే బీజేపీ ఎదుగుతూ (కనీసం ఓట్ల శాతంలో) వచ్చింది.
దీనికి ప్రధాన కారణం ఆప్ పుట్టుకలోనే ఉంది. 2012లో పురుడుపోసుకున్న ఆప్ అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టింది. అన్నా హజారే ఇప్పుడు ఆప్ గురించీ, కేజ్రీవాల్ గురించీ భిన్నమైన అభిప్రాయాలు చెప్పవచ్చును కానీ అవినీతికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో కాంగ్రెస్ ను దోషిగా నిలబెట్టారు. కొన్ని సందర్భాలలో కాంగ్రెస్ కు అన్యాయం జరిగింది. టూజీ స్పెక్ట్రమ్ విక్రయం కేసులో కాగ్ తప్పుడు లెక్కలకు కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. దానివల్ల ఇటు అన్నాహజారే ఉద్యమం, అందులోనుంచి పుట్టిన ఆమ్ ఆద్మీపార్టీ, దిల్లీ ఆవల బీజేపీ బాగుపడ్డాయి. కాంగ్రెస్ దిల్లీలో మటుమాయం కావడంతో పాటు జాతీయ స్థాయిలో కూడా భారీగా నష్టబోయింది. దిల్లీలో అయితే ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకోవడం కష్టం.