రాజస్థాన్ లో గెహ్లాట్ బృందం విజయహాసం
- ఫడ్నవీస్ ఎత్తులు ఫలించి మహారాష్ట్రలో బీజేపీ విజయం
- కర్ణాటకలో జేడీ(ఎస్) అభ్యర్థి పరాజయం
- హరియాణాలో కాంగ్రెస్ కు దెబ్బకొట్టిన భజన్ లాల్ తనయుడు
రాజ్యసభ ఎన్నికలలో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఒక్క రాజస్థాన్ లో మాత్రం బీజేపీ పాచిక పారలేదు. జీ న్యూస్ అధినేత సుభాష్ చంద్ర పరాజయం పొందారు. మొత్తం 16 స్థానాలకు నాలుగు రాష్ట్రాలలో పోటీ జరిగితే మూడు రాష్ట్రాలలో బీజేపీ గెలుపొందింది. ఒక్క రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ చెక్కుచెదరలేదు. కర్ణాటక, హరియాణ, మహారాష్ట్రలో బీజేపీ ఎత్తులు లాభించాయి. ఇండిపెండెంట్లను తమవైపు తిప్పుకొని తమ అభ్యర్థుల విజయానికి బీజేపీ నాయకులు దోహదం చేశారు.
రాజస్థాన్ లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, తన అంతర్గత ప్రత్యర్థి సచిన్ పైలట్ తో కలసి సమైక్యంగా పోరాటం చేసి మూడు స్థానాలు కైవసం చేసుకున్నారు. సుభాష్ చంద్ర ఇండిపెండెంటుగా రంగంలో దిగారు. బీజేపీ మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ ఎంఎల్ఏలు క్రాస్ ఓటు చేస్తారని భావించారు. సుభాష్ చంద్ర సచిన్ పైలట్ కు ఫోన్ చేసి తనకు ఓటు వేయడాలనీ, తన అనుచరుల చేత ఓట్లు వేయించాలనీ అడిగే తెంపరితనం ప్రదర్శించాడు. సచిన్ పైలట్ తగిన సమాధానం చెప్పాడు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ శాసనసభ్యులందరినీ అశోక్ గెహ్లాట్ ఒక హోటల్ కి తరలించారు. ఇదివరకు సైతం ఇదే విధంగా కాంగ్రెస్ శాసనసభ్యులను రిసార్ట్ కి పంపించి వారు చీలిపోకుండా, బీజేపీతో చేతులు కలపకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఈ విధంగా పకడ్బందీగా వ్యవహరించడం ద్వారా తన ముఖ్యమంత్రి పదవిపైన పట్టు మరింత బిగించారు. సచిన్ పైలట్ ఆశలు అడియాసలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అశోక్ గెహ్లాట్ ను ఎందుకు అంతగా విశ్వసిస్తున్నారో ఈ ఉదంతం నిరూపించింది.
రాజస్థాన్ విధానాన్నే హరియాణాలో కాంగ్రెస్ నాయకుడు హుడా కూడా అనుసరించారు. కానీ హరియాణాలో పోటీ చేసిన రెండు స్థానాలనూ కాంగ్రెస్ కోల్పోయింది. మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ కుమారుడు కులదీప్ సింగ్ బిష్ణోయ్ తన ప్రత్యర్థులైన భూపిందర్ సింగ్ హూడా, అతని కుమారుడు దీపేందర్ పైక కక్ష తీర్చుకున్నాడు. ఇటీవల హరియాణా కాంగ్రెస్ పునర్వ్యవస్థికరణ సందర్భంగా తనను పట్టించుకోనందుకు బిష్ణోయ్ కోపంగా ఉన్నాడు. ఎన్నికల ముందు రాహుల్ గాంధీని కలుసుకోవలసి ఉంది. ఆ సమావేశం రద్దు కావడం పరాభవంగా భావించాడు. ‘‘పాములను ఎట్లా చంపాలో తనకు తెలుసుననీ, పాములకు భయపడి అడవిని వదిలి వెళ్లే ప్రసక్తి తేదనీ బిష్ణోయ్ శనివారం ఉదయం ట్వీట్ ఇచ్చారు. బిష్ణోయ్ ఆగ్రహంతో బీజేపీ అభ్యర్థికి ఓటు వేశాడు. ఫలితంగా మీడియా యజమాని కార్తికేయశర్మ రాజ్యసభ స్థానం కైవసం చేసుకున్నాడు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన అజయ్ మెకెన్ కాంగ్రెస్ అభ్యర్థిగా త్రుటిలో ఓడిపోయారు. తాను గెలిచినట్టు సమాచారం రావడంతో సంబరాలు చేసుకున్న సందర్భంలో ఓటమి వార్త తెలిసింది మెకెన్ కు. సంబరాలు రద్దు చేసుకొని బీజేపీ పైన ధ్వజమెత్తారు. బీజేపీ గారడీ చేసి గెలిచిందని ఆరోపించారు.
మహారాష్ట్రలో శరద్ పవార్ దర్శకత్వంలో పని చేస్తున్న సంకీర్ణ ప్రభుత్వం దెబ్బతిన్నది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని సంకీర్ణం మొత్తం నాలుగు స్థానాలు గెలవడానికి ప్రయత్నించి మూడు స్థానాలను మాత్రం గెలవగలిగింది. రెండు స్థానాలు సునాయాసంగా గెలుచుకున్న బీజేపీ మూడో స్థానాన్ని సైతం కైవసం చేసుకున్నది. ఇది మాజీ ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్ నిర్వహణ సామర్థ్యం ఫలితం. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఇద్దరు బీజేపీ ఎంఎల్ఏలు ఓటింగ్ లో పాల్గొన్నారు. వారి వల్లనే మూడో అభ్యర్థి గెలుపొందారని ఫడ్నవిస్ బహిరంగంగా ప్రకటించారు. మహారాష్ట్ర సంస్కృతిని కాపాడేందుకు సంకీర్ణం అభ్యర్థికి ఓటు వేయాలంటూ ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ చేసిన విజ్ఞప్తులు పలించలేదు. విజయం సాధించిన తర్వాత ‘జై మహారాష్ట్ర సంస్కృతి’ అంటూ ఫడ్నవీస్ నినాదం చేయడం కొస మెరుపు. పది ఓట్లు సంకీర్ణం అభ్యర్థికి రావలసినవి బీజేపీకి వెళ్ళి పోయాయి. ఇటువంటి మంత్రాంగంలో శరద్ పవార్ సిద్ధహస్తుడు. కానీ ఈ సారి విఫలమైనారు.
కర్ణాటకలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్, కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేష్ ఎన్నికైనారు. బీజేపీ టిక్కెట్టు పైన జగ్గేష్, లెహర్ సింగ్ కూడా గెలిచారు. మొత్తం మూడు స్థానాలను బీజేపీ గెలుచుకోవడం విశేషం. జేడీ(ఎస్) అభ్యర్థి ఓడిపోయారు. పైగా ఒక జేడీ(ఎస్) ఎంఎల్ఏ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు చేశాడు. కాంగ్రెస్ కీ, జేడీ(ఎస్)కీ ఈ మధ్య సంబంధాలు చెడిపోయాయి.
మహారాష్ట్ర నుంచి ఎన్నికైనవారిలో కేంద్రమంత్రి పియూష్ గోయల్ ఉన్నారు. ఠాక్రే బృందం ఈ ఎన్నికలలో గుణపాఠాలు నేర్చుకోవాలి. శివసేన నాయకుడు సంజయ్ రౌత్, నేషనలిస్ట్ కాంగ్రెస్ నాయకుడు ప్రఫుల్ పటేల్, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతిప్ గఢీ విజయం సాధించారు. ప్రతిప్ గఢీని ప్రియాంకగాంధీ ప్రతిపాదించారు. ఆయన అభ్యర్థిత్వం పట్ల కాంగ్రెస్ నాయకులు ఎవ్వరికీ అంత ఇష్టం లేదు.