Sunday, January 26, 2025

అన్ని మతాలనూ గౌరవిస్తామంటున్న బీజేపీ

నుపూర్ శర్మ, నవీన్ జిందాల్

  • గల్ఫ్ దేశాల ఆగ్రహం కారణంగా ఇద్దరు ప్రతినిధుల తొలగింపు
  • మహమ్మద్ ప్రవక్తపైన నుపూర్ శర్మ, నవీన్ జిందాల్ అవాకులు చెవాకులు
  • పెద్దలు సంతోషిస్తారనుకొని రెచ్చిపోయిన ప్రతినిధులు

విద్వేష ప్రసంగాలకైనా ఒక పరిమితి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ శనివారంనాడు వ్యవహరించిన తీరు స్పష్టం చేసింది. ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడటం, తమను విమర్శించినవారిని పాకిస్తాన్ ఏజెంట్లుగా ముద్రవేయడం, ఎన్నికలలో ముస్లింలకు బీజేపీ టిక్కెట్లు ఇవ్వకపోవడం, ఆవు మాంసం తింటున్నారనో, తీసుకువెడుతున్నారనో నెపంపైన ముస్లింలను చంపివేస్తే స్పందించకుండా ఉండటం, ఒక రకంగా ఆమోదం వెలిబుచ్చడం వంటి పనులు చేయడం ద్వారా 2014 నుంచి 2022 దాకా జరిగిన ఎన్నికలలో బీజేపీ గెలుచుకుంటూ వచ్చింది. పైన పేర్కొన్న అన్ని అంశాలలో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకీ, దేశీయాంగమంత్రి అమిత్ షాకీ ప్రమేయం ఉన్నదనేది బహిరంగ రహస్యం. మైనారిటీలకు వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేయడం, మైనారిటీలపైన ఒంటికాలుపైన లేవడం అనేది బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నుంచి కింది స్థాయి నాయకుల వరకూ అందరూ నిత్యం చేస్తున్న పనులే. సామూహిక హత్యాకాండ జరిపించాలంటూ ధర్మసంసద్ లలో ఉపన్యాసాలు దంచడం, హిందూ మతాన్ని ప్రమాదం నుంచి రక్షించాలంటూ పిలుపులు ఇవ్వడం ప్రతినిత్యం ఒక ప్రమాదకరమైన క్రీడగా కాషాయపార్టీ నాయకులు ఆచరిస్తున్న సంగతి విదితమే. ఇంతవరకూ ముస్లింలపైన వాగ్దాడి, భౌతికదాడి చేసినవారిని ప్రధాని కానీ, హోంమంత్రి కానీ, అధికార పార్టీ అధ్యక్షుడు కానీ మందలించిన పాపాన పోలేదు.

ఇస్లాం ప్రవక్త (ప్రాఫెట్)పైన అవహేళనగా వ్యాఖ్యానించారనే ఆరోపణపైన బీజేపీ అధికార ప్రతినిధులు నుూపుర్ శర్మ, నవీన్ జిండాల్ లపైన సస్పెన్షన్ వేటు వేయడం బీజేపీ నాయకత్వం తీసుకున్న ప్రథమ చర్య. మహమ్మద్ ప్రవక్తపైన వీరిద్దరూ బీజేపీ ప్రతినిధులూ చేసిన వ్యాఖ్యలు గల్ఫ్ దేశాలలో కలకలం సృష్టించాయి. ఉత్తర ప్రదేశ్ లో అల్లర్లకు దారి తీశారు. అల్లర్లకు సంబంధించి పాతికమంది దాకా అరెస్టు చేశారు. వారిని దారిలోకి తేవడానికి అవసరమైతే బుల్డోజర్ ప్రయోగించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్య ప్రమాదకరమైనది. ఆదిత్యనాథ్ కు ఈ దేశంలో కనిపించేది బుల్డోజర్ ఒక్కటే. న్యాయస్థానాలూ, పోలీసు స్టేషన్లూ, రాజ్యాంగం, న్యాయం, ధర్మం ఏదీ కనిపించదు. ఇటీవల జరిగిన ఎన్నికలలో ఆయన ఘనమైన విజయం సాధించారు కనుక ఏమి వ్యాఖ్యానించినా చెల్లుబాటు అవుతుందంటే కుదరదు. ప్రజలు ఓటు వేసి గెలిపించింది జనం పైన, జనావాసాలపైన బుల్డోజర్ ప్రయోగించేందకు కాదు. చట్టం ప్రకారం పరిపాలన సాగించేందుకు.

గల్ఫ్ దేశాలతో చాలా కీలకమైన సంబంధాలను మోదీ స్వయంగా పెంపొందించే కృషి చేశారు. తనకు ఇస్లామిక్ దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ అసూయ చెందుతోందని ప్రధాని మోదీ స్వయంగా వ్యాఖ్యానించారు. ఆ సద్భావం అంతా బీజేపీ ప్రతినిధి ఒక టీవీలో మహమ్మద్ ప్రవక్తపైన చేసిన బాధ్యతారహితమైన వ్యాఖ్యానంతో తుడిచిపెట్టుకొని పోయింది.  పాకిస్తాన్, చైనా ఆట కట్టించాలంటే గల్ఫ్ లోని ముస్లిం దేశాలతో మైత్రి అత్యవసరం. ఇంతకాలం దేశంలో ముస్లింలను ఫుట్ బాల్ ఆడినా అది అంతర్గత వ్యవహారమని ఇతర దేశాలు పెద్దగా జోక్యం చేసుకోలేదు. అమెరికా విదేశాంగ మంత్రి మాత్రం 2021లో ఆసాంతం ముస్లింలపైన దాడులు జరిగాయనీ, వీటికి ప్రభుత్వాల మద్దతు ఉన్నదనీ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. దానికి మన విదేశాంగమంత్రి జయశంకర్ అభ్యంతరం చెప్పినా, ఖండించినా దాన్ని సంపూర్ణ సత్యంగా భావించేవారు భారతీయులలో కూడా అధిక సంఖ్యాకులు లేరు. చరిత్రను సవరించే క్రమంలో ఉన్నామనీ, తమది అహంకారం కాదు, ఆత్మవిశ్వాసనమనీ కబుర్లు చెబుతున్న విదేశాంగమంత్రి తన సహచరులు ఏమి మాట్లాడుతున్నారో దయజేసి వినాలి.

 నూపుర్ శర్మ ఒక టీవీ డిబేట్ లోచేసిన వ్యాఖ్యలు దేశ,విదేశాలలో ముస్లింలను ఎంతగా కలవరపరిచాయంటే కతార్ లో తన పర్యటను ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు హడావిడిగా ముగించుకోవలసి వచ్చింది. పలు గల్ఫ్ దేశాలు భారత రాయబారులను పిలిపించుకొని వారికి సుద్దులు చెప్పాయి. నూపుర్ శర్మ అమాయకురాలు కాదు. విద్యాధికురాలు. దిల్లీ విశ్వవిద్యాయలం హిందూ కళాశాలలో ఆర్థికశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. దిల్లీ యూనివర్శిటీలోనే ఎల్ఎల్ బీ చదివారు. న్యాయశాస్త్రంలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి మాస్టర్స్ డిగ్రీ చేశారు. దిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా పని చేశారు. 2015లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పైన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీ యువమోర్చాలో పని చేశారు. 2017లో దిల్లీ అధికార ప్రతినిధిగా నియుక్తులైనారు. 2020లో బీజేపీ జాతీయ ప్రతినిధిగా ఎదిగారు.

ఇండొనీసియా తర్వాత ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా ఉన్నది భారత దేశంలోనే. ముస్లింలను కలవరపెట్టడం వల్ల కానీ, వారికి ఆగ్రహం తెప్పించడం వల్ల కానీ, వారిపైన దాడులు చేయడం కానీ, వారిని అవహేళన చేయడం కానీ ఆత్మహత్యాసదృశమని గ్రహించలేనివారు ఈ దేశానికి సారథ్యం వహిస్తున్నారు. ముస్లింలు విసుగు చెంది, సహనం కోల్పోయి, రెచ్చిపోతే చివరకు అంతర్యుద్ధానికి పరిస్థితులు దారి తీస్తాయనీ, మతకలహాలలో ఎంత ప్రాణనష్టం జరుగుతుందో ఊహించడానికే భయం కలుగుతుందని తెలుసుకోలేని మందమతులు బరితెగించి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మసీదులు తవ్వాలనీ, శవం బయటపడితే అది ముస్లింలకూ, శివలింగం బయటపడితే హిందువులకూ చెందాలని బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ సంధిప్రేలాపనకు మోదీ, షాలు అభ్యంతరం చెబితే బాగుండేది. దాన్ని మరోసారి అనకుండా సంజయ్ జాగ్రత్తపడేవారు. ఆ విధంగా బీజేపీ నాయకులు ఎవ్వరూ  సంజయ్ ను మందలించకపోవడంతో దేశంలోని ఇతర నాయకులు కూడా అదే పల్లవి అందుకున్నారు. నుపూర్ శర్మ కూడా తన వ్యాఖ్యలకు మోదీజీ, అమిత్ షాజీ, నడ్డాజీ సంతోషిస్తారనుకొని రెచ్చిపోయి ఉంటారు. జిందాల్ పరిస్థితి సైతం డిటో.  

నుపూర్ శర్మ, నవీన్ జిందాల్ పైన క్రమశిక్షణ చర్య తీసుకుంటూ బీజేపీ ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేసింది. భారత రాజ్యాంగం అన్ని మతాలనూ సమానంగా పరిగణిస్తుందనీ, ఏ మత పెద్ద గురించీ తేలికగా మాట్లాడటాన్నిభారతీయ జనతాపార్టీ సహించదనీ, అన్ని మతాలనూ, మతగురువులనూ బీజేపీ సమానంగా గౌరవిస్తుందనీ, ఇది భారతీయ సంప్రదాయమనీ ప్రకటన వివరించింది. అంతర్జాతీయ ఒత్తిడికి లొంగి బీజేపీ ఈ పాట పాడుతోందనీ, అసలు స్వరూపమైన హిందూత్వవాదాన్ని కప్పిపెట్టడానికి ప్రయత్నిస్తోందని సోషల్ మీడియాలో సందేశాలు అదే పనిగా వస్తున్నాయి. టెలిగ్రాఫ్ పత్రిక మొదటి పేజీలో ఈ విషయం మీకు తెలుసా? అనే ప్రశ్నతో ఒక వార్త ప్రచురించింది. 1. భారతీయ జనతా పార్టీ అన్నిమతాలను గౌరవిస్తుంది. 2. ఏ మతానికి చెందిన మతపెద్దలనైనా తూలనాడటాన్ని బీజేపీ గట్టిగా వ్యతిరేకిస్తున్నది. 3. ఏదైనా తెగను లేదా మతాన్ని తెగనాడే భావజాలానికి బీజేపీ బద్ధ వ్యతిరేకి. 4. ప్రతి మతాన్ని గౌరవించాలనీ, ఆదరించాలనీ, పౌరులకు ఇష్టమైన మతాన్ని ఆచరించే స్వేచ్ఛ ఉంటుందనీ భారత రాజ్యాంగం హామీ ఇచ్చింది. ఈ అంశాలకు భిన్నంగా మాట్లాడినవారు బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా, నడ్డాలు, తదితర బీజేపీ నాయకులు. యోగులూ, మాతలూ, సాధ్వులూ దేశ వ్యాప్తంగా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. వారి నోళ్ళు మూయించగలరా? పైన పేర్కొన్న నాలుగు అంశాలను బీజేపీ నాయకత్వం త్రికరణశుద్దిగా అమలు చేయగలిగితే ఇంకో పదేళ్ళు అదే పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ పెద్దగా నష్టం ఉండదు.

విధానాలను సవరించుకోకుండా గల్ఫ్ దేశాల ప్రతిస్పందన సంకుచితత్వంతో కూడినదనీ, అనవసరమైనదనీ భారత ప్రభుత్వం వ్యాఖ్యానించింది. బీజేపీ ప్రతినిధుల మొహమ్మద్ పైన చేసిన వ్యాఖ్యలను ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కొఆపరేషన్ (ఓఐసీ) జెడ్డా కేంద్ర కార్యాలయం ఖండించింది. ఇండియాలో ఇస్లాం పట్ల విద్వేష పూరితమైన వ్యాఖ్యలు పరంపరగా రావడం, ముస్లింలను ఒక పద్ధతి ప్రకారం వేధిస్తున్న నేపథ్యంలో బీజేపీ ప్రతినిధులు ఈ విధంగా వ్యాఖ్యానించి ఉంటారని ఓఐసీ ఒక ప్రకటనలో అన్నది. ఈ ప్రకటనను పూర్తిగా ఖండిస్తున్నామంటూ భారత దేశ విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ స్పందించారు. అన్ని మతాలకూ సమున్నతమైన గౌరవాన్ని భారత ప్రభుత్వం ఇస్తుందని ఆయన అన్నారు. ఓఐసీలో పాకిస్తాన్ సభ్యదేశం. ముస్లిం ప్రపంచపు సమష్టి వాణిగా ఓఐసీ తనకు తాను ప్రకటించుకున్నది.   

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles