• రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు బీజేపీ పక్కా స్కెచ్
• ఆలయాల పరిరక్షణ పేరుతో భారీ రథయాత్రకు శ్రీకారం
• జాతీయ నేతలను రప్పించేందుకు ప్రయత్నాలు
ప్రజాసమస్యలపై పోరాడేందుకు పాదయాత్రలను ఎంచుకోవడం సర్వసాధారణం. తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు పాదయాత్రలకు విడదీయరాని సంబంధం ఉంది. 2003లో అప్పటి కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పాదయాత్రలకు ఆద్యుడుగా చెప్పవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు ఆయన పాదయాత్ర చేపట్టి 2004 ఎన్నికల్లో ఘనవిజయం అందుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి పీఠం ఆయన్న వరించింది. ఆ దెబ్బతో పదేళ్లు ప్రతిపక్షానికే పరిమితమైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 2012లో వస్తున్నా మీకోసం పేరుతో పాద యాత్ర చేపట్టి ఆయనా ముఖ్యమంత్రి అయ్యారు. అనంతరం ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజాసమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైఎస్ జగన్ విజయవంతమయ్యారు. పాదయాత్ర తరువాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టి వైఎస్ జగన్ భారీ మెజారిటీతో ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు.
ఇదీ చదవండి: ఉద్రిక్తంగా బీజేపీ, జనసేన ఛలో రామతీర్థం
ఇపుడు తెలుగు రాష్ట్రాలలో అధికారం చేపట్టేందుకు ఉవ్విళ్లూరుతున్న బీజేపీ కూడా అలాంటి ప్లానే వేస్తోంది. ఏపీలో అధికారం చేపట్టేందుకు ఆతృతగా ఉన్న బీజేపీ అందుకు కావాల్సిన అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. రాష్ట్రంలో అంతగా బలంలేని బీజేపీ అధికార ప్రతిపక్షాలను ఢీకొట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీంతో ఎన్నాళ్లుగానో వేచిచూస్తున్న బీజేపీకి ఆలయాలపై జరుగుతున్న దాడుల అంశం అక్కరకొచ్చింది. రామతీర్థం ఘటనలో ఆందోళనలు చేపట్టిన సోము వీర్రాజు ఆదే పంథాను కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన రామతీర్ఠం విగ్రహ ధ్వంసం కేసులో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. దేవాలయాల పరిరక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్ర చేపట్టాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. రామతీర్థం నుంచే యాత్రకు శ్రీకారం చుట్టేందుకుక వ్యూహ రచన చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఆలయాల దాడులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
రథ యాత్ర ప్రధానంగా ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంతో పాటు, రాష్ట్రంలో జరుగుతున్న మత మార్పుడులపై కూడా దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ యాత్రకు బీజేపీ జాతీయ నేతలను కూడా రప్పించేందుకు తీవ్ర కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. యాత్ర షెడ్యూల్, రూట్ మ్యాప్ పై చర్చించేందుకు సంక్రాంతి తర్వాత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన పార్టీ నేతలు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
గత కొన్ని రోజులుగా ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలు ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర దూమారాన్నే రేపుతున్నాయి. విగ్రహాల ధ్వంసంపై అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో విగ్రహాల ధ్వంసంపై ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. దీంతో అప్పటివరకు సీఐడీ పర్యవేక్షిస్తున్న కేసులను ప్రభుత్వం సిట్ కు బదిలీ చేసింది. రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కమిటీలను కూడా నియమించింది.
ఇదీ చదవండి: రణరంగం రామతీర్థం