- బీజేపీ ఎన్నికల ప్రణాళికలో హామీ
- తమిళనాడు ముఖ్యమంత్రి పలనిస్వామి డిటో హామీ
- ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల సంగతి ఏమిటి : కేజ్రీవాల్
- ఇది సిగ్గుమాలిన వ్యవహారం, ఎన్నికల సంఘం మొట్టికాయలు వేస్తుందా: శశిథరూర్
బీహార్ ఎన్నికల రణరంగంలో కోవిద్ టీకా బాణం ప్రచారాగ్ని సృష్టిస్తున్నది. వచ్చే వారం మొదటి దశ పోలింగ్ జరుగనుండగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ బీహార్ లో అందరికీ ఉచితంగా టీకా మందు ఇప్పిస్తామంటూ చేసిన వాగ్దానం హాస్యాస్పదంగానూ, మోసపూరితంగానూ ఉన్నదని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి.
‘కోవిద్ టీకా అందుబాటులోకి రాగానే బీహార్ లో ప్రతివ్యక్తికీ ఉచితంగా టీకా ఇవ్వడం జరుగుతుందని సీతారామన్ అన్నారు. ఇది తమ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న మొదటి హామీ అని కూడా ఆర్థికమంత్రి అన్నారు. ఆమె బీజేపీ బీహార్ ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. కోవిద్ టీకా తయారీకి అనేక దేశాలలో ఉరుకులూపరుగులూ సాగుతున్నాయి. కానీ ఇంకా కనిపెట్టని టీకా ఉచితంగా ఇస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేయడం ఇదే ప్రథమం. ఇటీవల న్యూజిలాండ్ లో జరిగిన ఎన్నికలలో కూడా టీకా ఉచితంగా ఇస్తామని హామీ ఇవ్వలేదు. కోవిద్ వచ్చినప్పుడు అక్కడి ప్రభుత్వం సమర్థంగా నియంత్రించినందుకు లేబర్ పార్టీని న్యూజిలాండ్ ప్రజలు ఆదరించి మరోసారి గెలిపించారు.
‘బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల సంగతి ఏమిటి?’ అంటూ దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. దీనికి సమాధానమా అన్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి కె. పలనిస్వామి కూడా తమ ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా కోవిద్ టీకాలు ఇప్పిస్తుందని ప్రకటించారు. తమిళనాడులో బీజేపీకి ఏఐఏడిఎంకె మిత్ర పక్షం. తమిళనాడులో వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగనున్నాయి.
‘ప్రతి రాష్ట్రానికీ ఉచితంగా కరోనావైరస్ టీకా మందు సరఫరా చేయడం జరుగుతుందని బీహార్ పర్యటనలో ఉన్న కేంద్ర ఆరోగ్య శాఖ సహాయమంత్రి అశ్వనీచౌబే విలేఖరులు టీకాపైన అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ స్పష్టం చేశారు. ‘ఎన్నికల షెడ్యూల్ ను దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి,’ అంటూ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హెచ్చరించారు. ‘బీజేపీ చేస్తున్న అనేక తప్పుడు, బూటకపు హామీలలో ఇది ఒకటి. ఎన్నికల షెడ్యూల్ చూస్తే ఏ రాష్ట్రానికి ఎప్పుడు కోవిద్ టీకా అందుబాటులోకి వస్తుందో చెప్పవచ్చు,’ అంటే రాహుల్ ఎద్దేవా చేశారు.
‘మీరు నాకు ఓటు వేయండి, మీకు నేను టీకా ఉచితంగా ఇస్తాను’ అంటూ బీజేపీ నాయకులు బీహార్ ప్రజలకు చెబుతున్నట్టు ఈ ఎన్నికల ప్రణాళికలోని వాగ్దానం కనిపిస్తుననదని కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు శశిథరూర్ వ్యాఖ్యానించారు. ‘ఈ సిగ్గులేని ప్రభుత్వానికి ఎన్నికల సంఘం మొట్టికాయలు వేస్తుందా?’ అంటూ శశి ప్రశ్నించారు. ఇది ప్రజలను మభ్యపెట్టే కల్తీలేని కపటనాటకమంటూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. కోవిద్ పట్ల ప్రజలలో ఉన్న భయాలను ఎన్నికలలో ఓట్లు రాబట్టుకోవడానికి బీజేపీ ప్రభుత్వం వినియోగించుకుంటున్నదని అబ్దుల్లా వ్యాఖ్యానించారు.