హైదరాబాద్ : ఆత్మహత్యా యత్నం చేసిన బీజేపీ కార్యకర్త శ్రీనివాస్ ఆస్పత్రిలో మరణించడం పట్ల బజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంతాపం ప్రకటించారు. ‘‘తమ్ముడు శ్రీనివాస్ మరణం నన్నెంతగానో భాధిస్తున్నది.మెరుగైన చికిత్స అందించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా శ్రీనివాస్ ను కాపాడుకోలేకపోయాం. ఆత్మబలిదానాలతో సాధించిన తెలంగాణాలో ఇదే చివరి బలిదానం కావాలి. ప్రాణాలు ఎంతో విలువైనవి. కార్యకర్తలెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు. ఆత్మహత్యలు తల్లితండ్రులకు కడుపుకోత తప్ప, వాటి ద్వారా దేన్ని సాధించలేం. 2023 లో గోల్కొండ ఖిల్లా పై కాషాయ జెండా ఎగరడాన్ని కళ్లారా చూడడమే మన లక్ష్యం కావాలి,’’ అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
దుబ్బాక ఎన్నికల పోరాటం మధ్యలో సంజయ్ ని పోలీసులు అరెస్టు చేయడం పట్ల నిరసనగా బీజేపీ కార్యకర్త శ్రీనివాస్ ఒంటిమీద కిరోసిన్ పోసుకొని నిప్పు పెట్టుకున్న సంగతి తెలిసిందే. 50 శాతం కాలిన గాయలతో శ్రీనివాస్ ను యశోదా ఆస్పత్రిలో చేర్పించారు.
తెలంగాణలో బీజేపీ పాలన సాధించడం కోసం బ్రతికుండి పోరాటం చేయడమే మార్గంగా ముందుకు సాగాలని బీజేపీ కార్యకర్తలకు ఆయన ఉద్బోధించారు. ‘‘కొట్లాడి సాధించుకున్న తెలంగాణాలో, కొట్లాడి ప్రజాస్వామిక తెలంగాణను నిర్మాణం చేద్దాం. కొట్లాడే శక్తి మనందరి రక్తంలో ఉంది. కార్యకర్తలందరికి అండగా నేనుంటా,’ అని చెప్పారు
శ్రీనివాస్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నానుని బండి సంజయ్ ఒక ప్రకటనలో తెలియజేశారు.