Sunday, December 22, 2024

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారీగా పుంజుకోనున్న బీజేపీ

  • జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారీగా లాభపడనున్న బీజేపీ
  • 2016 లో 10 శాతం ఓట్లతో సరిపెట్టుకున్నబీజేపీ
  • రాబోయే ఎన్నికల్లో 30 శాతం ఓట్లు రాబట్టే అవకాశం
  • టీఆర్ఎస్ వాటా 35% నుంచి 40%
  • పెద్దగా ప్రభావం చూపలేని కాంగ్రెస్
  • ‘క్రౌడ్ విజ్ డమ్’ సర్వేలో వెల్లడి

ఎన్నికల్లో ఎదురుదెబ్బ అంటే టీఆర్ఎస్ కు ఇప్పటిదాకా తెలియదు. తొలిసారి దుబ్బాక ఉప ఎన్నికలో  ఓటమి పాలవడంతో పార్టీ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. దుబ్బాక ఓటమితోనే టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బల ప్రదర్శనకు దిగుతోంది. క్రౌడ్ విజ్ డమ్ నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలో గతంలో ఎన్నడూ లేనంతగా బీజేపీ తన బలాన్ని పెంచుకుంటుందని తేల్చి చెప్పింది. ఓట్ల శాతంతో పాటు మరిన్ని సీట్లను సాధిస్తుందని తెలిపింది.

జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో బీజేపీ భారీగా లాభపడనున్నట్లు  సర్వే లో తేలింది. 2016 లో సాధించిన 3 సీట్ల నుండి తన బలాన్ని  40 నుంచి 45 సీట్లకు పెంచుకుంటుందని సర్వేలో ఫలితాలు సూచిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ సీట్లలో మాత్రం  దాదాపు 50 శాతం వరకు కోత పడనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అంతగా ప్రభావం చూపలేదని కూడా తెలిపింది. గత ఎన్నికల్లో ఒక్క సీటుతో సరిపెట్టుకున్న కాంగ్రెస్ ఈ సారి తన బలాన్ని 5 సీట్ల దాకా పెంచుకునే అవకాశాలున్నాయని తెలిపింది.

పునరాలోచనలో టీఆర్ఎస్

దుబ్బాక ఓటమితో ఖంగుతిన్న అధికార టీఆర్ఎస్  బల్దియా ఎన్నికల్లో బీజేపీకి పుంజుకునే సమయాన్ని ఇవ్వకూడదని భావిస్తోంది. ఎన్నికల వ్యూహంలో భాగంగానే ఆస్తిపన్నులో 50 శాతం రాయితీని మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించి గ్రేటర్ ఓటర్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల భారీ వర్షాలతో ముంపునకు గురైన కుటుంబాలకు తక్షణ సాయం కింద 10 వేలను ప్రకటించారు. ఆస్తి పన్నులో రాయితీ ఇచ్చిన అంశాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా మున్సిపల్ కమిషనర్ రాయితీదారులకు మెసేజ్ పంపారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన తాయిలాలకు ఓటర్లు సంతృప్తి చెందారో లేదో తెలియాలంటే ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. గ్రేటర్ ఎన్నికలను సంక్రాంతి తరువాత నిర్వహించాలని కేసీఆర్ కు టీఆర్ఎస్ నేతలు మొర పెట్టుకున్నట్లు సమాచారం. అయితే దుబ్బాకలో అనూహ్య ఓటమిని దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ ఎన్నికలను ముందుగా నిర్వహించేందుకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఆలస్యం అయిన కొద్దీ ఓటర్లలో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోతుందని ఈ లోపు బీజేపీ తన బలాన్ని పెంచుకోవచ్చని కేసీఆర్ ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: జీహెచ్ఎంసీ పోలింగ్ డిసెంబరు 1

కేటీఆర్ ప్రతిభకు పరీక్ష

కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న ఆశావహుల జాబితా భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా టికెట్ ఆశిస్తున్న వారు కొందరు ఉన్నారు. వీరితో పాటు రెండోసారి టికెట్ ఆశిస్తున్న వారి జాబితా కూడా భారీగానే ఉన్నట్లు సమాచారం. టీఆర్ఎస్ మాత్రం పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికే టికెట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దుబ్బాక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్నీ తానై ప్రచారం నిర్వహించిన హరీశ్ రావు స్వల్ప తేడాతో విజయాన్ని అందుకోలేకపోయారు. ఇది హరీశ్ రావుకు మాయని మచ్చగా మిగిలింది. ఇపుడు బల్దియా ఎన్నికలతోపాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు సీఎం తనయుడు కేటీఆర్ ప్రతిభకు పరీక్ష పెట్టనున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో కూడా కేటీఆర్ హైదరాబాద్ లో ఉండి వరద ముంపునకు గురైన  బాధిత కుటుంబాలకు అండగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దుబ్బాకలో ఆయన ప్రచారం కూడా నిర్వహించలేదు.

బల ప్రదర్శనకు బీజేపీ రెడీ

బండి సంజయ్ పార్టీ పగ్గాలు చేపట్టాక బీజేపీ శ్రేణులు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. చాన్నాళ్ల తరువాత అధికార పార్టీకంటే బీజేపీ పైచేయి సాధించినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. బండి సంజయ్ ఎప్పటికప్పుడు పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేస్తూ కార్యకర్తల్లో జోష్ ను నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ నేతలను, కార్యకర్తలను సమన్వయ పరచడం ద్వారా అసాధ్యమనుకున్న దుబ్బాకలో విజయం సాధించగలిగారు. దుబ్బాకలో అనుసరించిన వ్యూహలనే గ్రేటర్ ఎన్నికల్లో అమలు చేయాలని బీజేపీ భావిస్తోంది. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టాలని నేతలకు బండి సంజయ్ దిశా నిర్ధేశం చేస్తున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన డబుల్ బెడ్ రూం ఇళ్లు, నగరంలో డ్రైనేజి వ్యవస్థ, ఇటీవల వరద ముంపునకు గురయిన వారికి సహయం అందించడంలో వైఫల్యం, హైదరాబాద్ లో అధ్వాన్నంగా తయారైన రోడ్ల దుస్థితిపై  ప్రజలకు వివరించినున్నారు.

బల్దియా ఎన్నికల్లో చక్రం తిప్పనున్న భూపేంద్ర

మున్సిపల్ ఎన్నికలను బీజేపీ సీరియస్ గా తీసుకుంది. సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలలో విజయం సాధించి టీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పాలని యోచిస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున వ్యూహాలు రచించిన భూపేంద్ర సింగ్ యాదవ్ కు గ్రేటర్ ఎన్నికల బాధ్యతలను  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అప్పగించారు. అమిత్ షా కు సన్నిహితుడైన భూపేంద్ర సింగ్ యాదవ్ ఎన్నికల వ్యూహాలను రచించడంలో దిట్టగా భావిస్తారు. పార్టీ ప్రదాన కార్యదర్శిగానూ, రాజ్యసభ ఎంపీగానూ విధులు నిర్వహిస్తున్నారు. 2013 లో రాజస్థాన్, 2014లో జార్ఖండ్, 2015 లో గుజరాత్, 2017లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి  భూపేంద్ర వ్యూహరచన ఉన్నట్లు సమాచారం. గ్రేటర్ ఎన్నికల్లో వ్యూహాలను రచించేందుకు భూపేంద్ర యాదవ్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. భూపేంద్రకు సాయం చేసేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు మంత్రులనూ, ఒక మాజీ మంత్రినీ కమిటీలో సభ్యులుగా నియమించారు. కర్ణాటక విద్యాశాఖ మంత్రి డాక్టర్ సుధాకర్ కో కన్వీనర్ గా,  మహారాష్ట్ర మాజీ మంత్రి ఆశిష్ షేలర్, గుజరాత్ నుంచి ప్రదీప్ సింగ్ వాఘెలా, కర్ణాటక ఎమ్మెల్యే సతీష్ రెడ్డిలు ఎన్నికల కమిటీలో  సభ్యులుగా వ్యవహరించనున్నారు.

కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లకు కీలక బాధ్యతలు

నాంపల్లి బీజేపీ కార్యాలయంలో ఎన్నికలపై కసరత్తు చేసిన బీజేపీ పెద్దలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీకి ఛైర్మన్ గా ఎన్నుకున్నారు. బీజేపీ ఓబీసీ సెల్ ఛైర్మన్ లక్షణ్ కన్వీనర్ గా వ్యవహరించనున్నారు. మాజీ ఎంపీ వివేక్ కో కన్వీనర్ గా, గరికపాటి రాంమోహన్  రావు, చింతల రామ చంద్రారెడ్డిలు ఇంఛార్జులుగా బాధ్యతలు నిర్వహించనున్నారు.

కాంగ్రెస్ కు గడ్డుకాలం

బల్దియా ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా ప్రభ కోల్పోనున్నట్లు తెలుస్తోంది. 2016 ఎన్నికల కంటే దారుణంగా ఓటమి పాలు కానున్నట్లు సర్వేలో తేలింది. ముఖ్యంగా పార్టీ  స్టార్ క్యాంపెయినర్ రేవంత్ రెడ్డిపైనే ఆధారపడటం దీనికి కారణంగా కనిపిస్తోంది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. జాతీయ నాయకత్వం నుంచి కావాల్సినంత అండదండలు అందకపోవడం, తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాల వల్ల పార్టీ విజయావకాశాలు దెబ్బతింటాయని తెలుస్తోంది.

బల్దియా బరిలో జనసేన

బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన కూడా బల్దియా ఎన్నికల్లో పోటీ చేయనుంది. ఎన్నికల్లో పోటీచేసే అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విద్యార్థి సంఘాలతో, రాష్ట్ర కమిటీలతోనూ సమావేశమయ్యారు. ఈ ఎన్నికల్లో సెటిలర్స్ ఓట్లపైనే జనసేన ఆశలు పెట్టుకుంది. కార్యకర్తలు, అభిమానుల విజ్ఞప్తి మేరకు ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయించినట్లు పవన్ వెల్లడించారు.

కమ్యునిస్టుల ఒంటరి పయనం

బల్దియా ఎన్నికల్లో తొలిసారి సీపీఐ, సీపీఎంలు కలిసి పోటీచేయనున్నాయి. ఇరు పార్టీలు  50 స్థానాల్లో  పోటీచేయాలని నిర్ణయించాయి. ఎన్నికల్ల్ కమ్యూనిస్టులు పెద్దగా ప్రభావం చూపలేవని సర్వేలో తేలింది. ప్రధాన పోటీ మాత్రం బీజేపీ, టీఆర్ఎస్ ఎంఐఎంల మధ్యే ఉంటుందని సర్వే తేల్చింది.

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles