Sunday, December 22, 2024

పుదుచ్ఛేరిలో పావులు కదుపుతున్న బీజేపీ

మరి కొన్ని నెలల్లోనే పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈలోపే ప్రస్తుత కాంగ్రెస్ -డిఎంకె సంకీర్ణ ప్రభుత్వం రద్దయ్యే పరిస్థితి వచ్చింది. అధికార కాంగ్రెస్ ఎంఎల్ ఏ ల వరుస రాజీనామాలు ఒక వంక -బిజెపి నియమించిన గవర్నర్ కిరణ్ బేడీ అకస్మాత్తు ఉద్వాసన ఇంకొక వంక జరగడంతో పుదుచ్చేరి సంచలన వార్తలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ సంఘటనలు జరిగిన గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటన కూడా జరగడం విశేషం. రాహుల్ పర్యటన ముందే ఖరారైనప్పటికీ, ఈ సమయంలో రావడంతో ప్రాధాన్యతను సంచరించుకుంది. ఈ తరుణంలో,రాహుల్ పర్యటన వల్ల స్థానిక కాంగ్రెస్ నేతలకు కాస్త నైతిక మద్దతు లభించినట్లే.

వ్యూహ రచనకు సావకాశం

అదే సమయంలో, అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం వ్యూహ రచన చేయడానికి అవకాశం కుదిరింది. రాష్ట్ర ముఖ్యమంత్రి,కాంగ్రెస్ నేతలు నేరుగా రాహుల్ తోనే సంప్రదించుకునే వెసులుబాటు కూడా కుదిరినట్లు భావించాలి.పుదుచ్చేరిలో జరిగిన ఈ హఠాత్ పరిణామాల వెనక బిజెపి వ్యూహం ఉందన్నది మెజారిటీ విశ్లేషకుల అభిప్రాయం. ఈ రాష్ట్ర రాజకీయాలను గమనిస్తే, మొదటి నుంచీ ఇక్కడ ఎక్కువ సార్లు కాంగ్రెస్, డిఏంకెల సంకీర్ణ ప్రభుత్వాలే పరిపాలించాయి.

Also Read : పుదుచ్ఛేరి గవర్నర్ గా కిరణ్ బేదీ తొలగింపు

దక్షిణాదిలో ఏకైక కాంగ్రెస్ పాలిత రాష్ట్రం పుదుచ్ఛేరి

ప్రస్తుతం, దక్షిణాదిలో కాంగ్రెస్ పాలనలో ఉన్న ఏకైక రాష్ట్రం పుదుచ్చేరి. వచ్చే ఎన్నికల్లోనూ మళ్ళీ ఇదే సంకీర్ణం అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని వినవస్తోంది. దక్షిణాదిలో అధికారం చేపట్టాలని బిజెపి శత విధాలా ప్రయత్నం చేస్తోంది. అందులో భాగమే ఇటువంటి చర్యలని పరిశీలకుల అభిప్రాయం. ఇది చాలా చిన్న రాష్ట్రం. కేంద్ర పాలిత ప్రాంతం. మొత్తం ఉన్నదే 30అసెంబ్లీ నియోజక వర్గాలు. ప్రస్తుతం 28మంది సభ్యలు ఉన్నారు. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీ ఓట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. డిఎంకె సహకారం కాంగ్రెస్ కు కలిసి వచ్చింది.

తమిళనాడు రాజకీయాల ప్రభావం

ఈ రాష్ట్రంలో ఎక్కువమంది తమిళ భాషే మాట్లాడుతారు.  తమిళనాడు రాజకీయాలే ఎప్పుడూ ఇక్కడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఎన్ ఆర్ కాంగ్రెస్, ఎఇఎడిఎంకె, బిజెపి లు సంకీర్ణంగా ప్రతిపక్షంలో ఉన్నాయి. కొద్ది రోజుల నుంచి కాంగ్రెస్ ఎంఎల్ ఏ ల రాజీనామాల పర్వం ప్రారంభమైంది. అందులో ఇద్దరు బిజెపి తీర్ధం పుచ్చుకున్నారు. మరొక ఎంఎల్ ఎ కూడా ఈరోజో రేపో రాజీనామా చేసి,బిజెపిలో చేరుతాడని సమాచారం. ఈ వరుస రాజీనామాలతో కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది.

Also Read : నమ్మరాని పొరుగుదేశం చైనా

ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్

ఈ నేపథ్యంలో,ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. గవర్నర్ గా కిరణ్ బేడీని ఉద్వాసన పలికి, తాత్కాలికంగా ఆ బాధ్యతలు తెలంగాణ గవర్నర్ తమిళసైకి ఇచ్చారు. ఆమె పుదుచ్చేరికి వెళ్లి, బాధ్యతలు తీసుకోక ముందే, కాంగ్రెస్ ప్రభుత్వంతో రాజీనామాను చేయించాలని రాసిన లేఖను ప్రతిపక్షాలు గవర్నర్ కార్యాలయంలోని అధికారికి అందచేశాయి. దాదాపు నాలుగున్నర సంవత్సరాల నుంచి కిరణ్ బేడీ ఇక్కడ లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా ఉన్నారు. ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రభుత్వాన్ని మొదట నుంచీ బలహీన పరుస్తూనే ఉన్నారు. దానికి తోడు, ముగ్గురిని బిజెపి నుంచి నామినేటెడ్ ఎమ్మెల్యేలుగా ఆమె నియమించారు.

కిరణ్ బేదీ నిర్వాకం

ప్రభుత్వ పాలనకు అడుగడుగునా అడ్డుపడుతూనే ఉన్నారు. ఎన్నికల కమీషనర్ల నియామకం, సంక్షేమ పధకాల అమలు మొదలు అనేక అంశాల్లో కిరణ్ బేడీ జోక్యం చేసుకుంటూ ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేస్తూ వచ్చారు. మంత్రులు, అధికారులతో కూడా ఆమె నేరుగా మాట్లాడంతో కాంగ్రెస్ పాలనా పగ్గాలు చేతులు దాటిపోయాయి. దీనితో అగ్రహించిన ముఖ్యమంత్రి నారాయణస్వామి స్వయంగా దీక్షకు దిగారు. ఇది దేశంలోనే పెను సంచలమైంది. ముఖ్యమంత్రి నారాయణస్వామి రాష్ట్రపతిని కూడా కలిసి తన గోడు వినిపించుకున్నారు. వీటివల్ల ఎటువంటి ఫలితాలు రాకపోగా, నేడు ప్రభుత్వమే గల్లంతయ్యే వాతావరణం వచ్చేసింది. ప్రస్తుతం అధికార -ప్రతిపక్ష పార్టీలు ఒక్కొక్కరూ 14సీట్ల చొప్పున సమానమైన బలంతో ఉన్నారు. మెజారిటీ కోసం బిజెపి తన బలాలన్నీ ఉపయోగించి, సరిపడా  ఎంఎల్ ఎ లను తన శిబిరం వైపు తిప్పుకొని, అధికార పీఠంపై కూర్చుంటుందా?

Also Read : ప్రమాదం అంచున పుదుచ్చేరి ప్రభుత్వం

ఏమి చేయబోతున్నారు?

ఎన్నికలకు కొన్ని నెలల సమయమే ఉంది కాబట్టి,  ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యమంత్రినే ఆపద్ధర్మంగా కొనసాగామంటుందా? లేదా కాంగ్రెస్, డిఎంకె పార్టీలు ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం కావాల్సిన సంఖ్యాబలాన్ని ఏదో రూపంలో పోగుచేసుకుంటాయా? అన్నవి నేటి ప్రధాన ప్రశ్నలు. ఎవరు చక్రం తిప్పుతారో వేచి చూడాల్సిందే. కిరణ్ బేడీ ప్రవర్తన వల్ల ప్రజల్లో అసంతృప్తి, ఆగ్రహం పెరిగాయాన్నది వాస్తవం. రేపటి ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవలనుకుంటున్న బిజెపికి ప్రస్తుత పరిణామాలు నష్టాన్నే తెస్తాయని భావించాలి. తాత్కాలికంగా కాంగ్రెస్ ను చికాకులకు గురిచేసినా, రేపటి ప్రజాక్షేత్రంలో ప్రజల మనోభావాలను గెలుచుకోవడం అంత సులభం కాదు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ ఎ ల వరుస రాజీనామాలతో పాటు, కిరణ్ బేడీ ప్రవర్తన బిజెపికి నష్టాన్నే తెచ్చిపెట్టాయి. ఎన్నికల ముందు వీటిని సరిదిద్దుకోవడం కోసమే ఆమెకు ఉద్వాసన పలికారని విశ్లేషకులు భావిస్తున్నారు.

బీజేపీ వ్యూహం ఏమిటి?

ప్రస్తుతం అధికారాన్ని కాంగ్రెస్ నుంచి లాక్కున్నా, ప్రభుత్వాన్ని రద్దు చేసినా, రేపటి ఎన్నికల సమయంలో చక్రం తిప్పడానికి అవకాశం ఉంటుందనే వ్యూహంతోనే బిజెపి ఈ చర్యలను చేపట్టిందని కొందరు భావిస్తున్నారు. సాత్వికమైన వ్యక్తిగా ముఖ్యమంత్రి నారాయణస్వామికి ముద్ర ఉంది. అదే సమయంలో ఆయనపై పెద్దగా చెడ్డపేరు కూడా లేదు. తమిళనాడులో అనుసరిస్తున్న విధానాలనే బిజెపి ఇక్కడా కూడా అనుసరిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కిరణ్ బేడీ స్థానంలో వచ్చిన తమిళసై తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ప్రజలతో తమిళంలో మాట్లాడగలరు. రేపటి ఎన్నికలకు ఈ అంశం కూడా ఉపయోగపడుతుందని బిజెపి భావిస్తున్నట్లు అనుకోవాలి.

Also Read : ట్రంప్ గెలిచినా ఓడినట్టే

కృష్ణారావు దారి ఎటు?

తాజాగా రాజీనామా చేసిన మల్లిడి కృష్ణారావు బిజెపిలో చేరుతారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తారా? వేచిచూద్దాం. ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మంచి సంబంధాలు ఉన్నాయి. జగన్ ప్రమాణస్వీకార మహోత్సవానికి కూడా వచ్చారు. పుదుచ్చేరిలో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో, అని దక్షిణాది రాష్ట్రాలు ఆసక్తిగా చూస్తున్నాయి.తమిళనాడులో కూడా త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. అక్కడా, ఇక్కడా బిజెపి హవా కొనసాగుతుందా, రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్, డిఎంకె సంకీర్ణ ప్రభుత్వాలు వస్తాయా… కొన్ని నెలల్లోనే తేలిపోనుంది.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles