- నాలుగు రాష్ట్రాలలో బీజేపీకి సుముఖం
- పంజాబ్ లో ఆప్ కు అనుకూలం
- ఉత్తరాఖండ్ లో బీజేపీ, కాంగ్రెస్ ఢీ
- ఒపీనియన్ పోల్స్ సందడి
మరికొన్ని రోజుల్లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయని తెలిసిందే. ఒక్క పంజాబ్ తప్ప,మిగిలిన అన్ని చోట్లా బిజెపి అధికారంలో ఉంది. ఈసారి కూడా ఆ నాలుగు రాష్ట్రాల్లో బిజెపి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ‘ఒపీనియన్ పోల్స్’ చెబుతున్నాయి. పంజాబ్ లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ అధికారపీఠాన్ని కైవసం చేసుకుంటుందని ఈ నివేదికలు చెబుతున్నాయి. అదే జరిగితే, దిల్లీతో పాటు మరో రాష్ట్రం కూడా కేజ్రీవాల్ చేతికింద వెళ్లిపోయినట్లవుతుంది. అతిపెద్ద రాష్ట్రం, కీలకమైన ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి రాకపోయినా, పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకాగాంధీ అన్నీతానై సర్వశక్తులు ఒడ్డుతున్నా, ఫలితాల్లో ప్రయోజనం దక్కేట్లు లేదని ఈ నివేదికల ద్వారా అర్థమవుతోంది.
Also read: వీడని కోవిద్ మహమ్మారి
మళ్ళీ యోగి చేతికే అధికారదండం
ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం చెడ్డపేరు మూటగట్టుకుంది. ఐనప్పటికీ, మళ్ళీ సింహాసనం అధిరోహించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హవా, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు ఊతంగా నిలుస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కాశీలో కారిడార్, అయోధ్య రామమందిరం నిర్మాణం, గంగా ప్రాజెక్టు మొదలైనవాటికి భారీమొత్తంలో నిధుల కేటాయింపు ఆ రాష్ట్రంలో బిజెపికి కలిసిరానున్నాయని భావించాలి. యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం బిజెపి 312 స్థానాల బలంతో ఉంది. అధికారంలోకి రావాలంటే 202 సీట్లు అవసరం. చాలా సంస్థలు ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. 223-272 స్థానాల్లో బిజెపి గెలుపుబాట పడుతుందని ఈ పోల్స్ చెబుతున్నాయి. వీటి ప్రకారం చూస్తే 40-90 సీట్లను కోల్పోతున్నట్లు అర్థం చేసుకోవాలి. బిజెపి కోల్పోయిన స్థానాలు ఎక్కువ శాతం సమాజ్ వాదీ పార్టీ ఖాతాలోకి చేరుతాయని అంచనా వేయవచ్చు. సమాజ్ వాదీకి 130- 150 సీట్లు వచ్చే అవకాశాలను ఈ నివేదికలు జోశ్యం చెబుతున్నాయి.
Also read: ఆంధ్రప్రదేశ్ లోనూ కొత్త జిల్లాలు వస్తున్నాయ్!
2017ఎన్నికల్లో ఈ పార్టీకి కేవలం 47 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈ లెక్కన పార్టీ మళ్ళీ ఊపందుకుంటుందని పరిశీలకులు విశ్వసిస్తున్నారు. 2012లో కేవలం 47 సీట్లను దక్కించుకున్న బిజెపి 2017లో 312 స్థానాలను కైవసం చేసుకొని అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈసారి ఎన్నికల్లో సంఖ్య తగ్గినా, అధికారాన్ని నిలబెట్టుకోగలగడం కూడా బిజెపి దృష్టిలో మంచిపరిణామమే. బిజెపి సర్వశక్తులు ఒడ్డి, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మళ్ళీ అధికారంలోకి రాగానే సంబరంకాదని, వచ్చే సార్వత్రిక ఎన్నికలు గెలవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందని రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ సమయానికి సమాజ్ వాదీతో పాటు కాంగ్రెస్ సైతం పుంజుకునే అవకాశాలను కొట్టిపారేయలేమని వారు అంటున్నారు. ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి కంటే కాంగ్రెస్ కే ఎక్కువ సీట్లు వచ్చాయి. కానీ, సామదానభేద దండోపాయాలను ఉపయోగించి బిజెపి/ఎన్ డి ఏ ముఖ్యమంత్రి పీఠాలను సొంతం చేసుకున్న సంగతిని సీనియర్ పాత్రికేయులు నేడు గుర్తు చేస్తున్నారు. రేపటి ఎన్నికల ఫలితాల తర్వాత కూడా అదే దృశ్యం రిపీట్ అవుతుందని వారు అభిప్రాయాపడుతున్నారు. నేటి ఒపీనియన్ పోల్స్ ప్రకారం చూస్తే, గోవాలో బిజెపి దాదాపుగా స్వతంత్రంగా అధికారంలోకి వచ్చే శకునాలే కనిపిస్తున్నాయి. గోవాలో మొత్తంగా 40 స్థానాలు ఉన్నాయి.పీఠాన్ని ఎక్కాలంటే 21 స్థానాల బలం కావాలి. ఒపీనియన్ పోల్స్ ప్రకారం ఇంచుమించుగా ఆ బలం పొందవచ్చు.
Also read: రెండు మాసాల్లొ కరోనా ఖతం?
అంచనాలో సగటున 16-23 సీట్లు కనిపిస్తున్నాయి. అవసరమైతే మిగిలిన పార్టీలు/ స్వతంత్రుల సహకారాన్ని తీసుకొని బిజెపి మళ్ళీ సింహాసనంపై కూర్చుంటుందని ఈ ఒపీనియన్ పోల్స్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. అక్కడ తృణమూల్ కూడా ప్రవేశిస్తోంది కానీ, పెద్ద ప్రభావాన్ని చూపించే పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. బిజెపి తర్వాత,ఆమ్ ఆద్మీ -కాంగ్రెస్ నువ్వా నేనా అంటూ కుస్తీ పడుతున్నాయి. రెండు పార్టీలకు దాదాపు సమానమైన ఫలితాలను ఒపీనియన్ పోల్స్ నివేదికలు చెబుతున్నాయి. 5-10 స్థానాలు సగటున కనిపిస్తున్నాయి. ఈ ప్రకారం చూస్తే, ఆమ్ ఆద్మీ పార్టీకి గోవాలో విస్తరణ దిశగా మెరుగైన భవిష్యత్తు కనిపిస్తోంది. కాంగ్రెస్ కు ఇక్కడ కూడా తిరోగమనం ప్రారంభమైందని అర్థం చేసుకోవాలి. ఉత్తరాఖండ్ లో బిజెపి- కాంగ్రెస్ మధ్య పోటాపోటీ ఫలితాలు కనిపిస్తున్నాయి. మొగ్గు మాత్రం బిజెపి వైపే ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ ఖాతా తెరిచే అవకాశాలు దర్శనమిస్తున్నాయి.
Also read: కేజ్రీవాల్ – క్రేజీవాల్?
ఉత్తరాఖండ్ లో సమఉజ్జీలుగా బీజేపీ, కాంగ్రెస్
70 అసెంబ్లీ స్థానాలు కలిగిన ఉత్తరాఖండ్ లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా 36 స్థానాల బలిమి కావాలి. పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ -32, బిజెపి – 31 సీట్లను పొందాయి కానీ, చివరకు బిజెపియే రాష్ట్రాన్ని తన ఏలుబడిలోకి తెచ్చుకుంది. అధికారాన్ని చేపట్టినా, అనేకసార్లు ముఖ్యమంత్రులను మార్చి చెడ్డపేరు మూటగట్టుకుంది. ఈ వైఖరితో, పార్టీలో అంతర్గత విభేదాలు కూడా పెరిగాయి. ఈ బలహీనతలను తనకు అనుకూలంగా మలచుకోగలిగిన చాకచక్యతను కాంగ్రెస్ చూపించుకోగలిగితే, రేపు అధికారపీఠం ఎక్కి, పోయిన ప్రతిష్ఠను నిలబెట్టుకుంటుంది. లేదా తిరోగమనమే శరణ్యం. మణిపూర్ లో కూడా బిజెపి – కాంగ్రెస్ మధ్య పోటీ బాగానే కనిపిస్తోంది. కానీ, బిజెపి ఫలితాలు మిన్నగా ఉన్నాయి. పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ -28 చోట్ల, బిజెపి – 21 చోట్ల గెలిచాయి. బిజెపి కంటే కాంగ్రెస్ కు 7 సీట్లు ఎక్కువ వచ్చినా, రాజ్యాధికారాన్ని దూరం చేసుకుంది. ఈ సారి కూడా కాంగ్రెస్ ఏ మేరకు కసరత్తు చేస్తుందో చూడాలి. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో బిజెపి మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని చెబుతున్న ఒపీనియన్ పోల్స్ పంజాబ్ విషయంలో బిజెపి వెనుకడుగునే సూచిస్తున్నాయి. మొదటి నుంచి ఆ రాష్ట్రంలో వెనుకబడి ఉన్న బిజెపికి ఈసారి కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని చెబుతున్నాయి. ప్రధానమైన పోటీ ఆమ్ ఆద్మీ – కాంగ్రెస్ మధ్యనే ఉంటుందని తేల్చిచెప్పేశాయి.
Also read: షరతులతో ‘చింతామణి’ని అనుమతించాలి
అధికారపీఠం ఆప్ దే అంటున్నాయి. వ్యవసాయ బిల్లుల విషయంలో బయటకు వచ్చిన శిరోమణి అకాళీదళ్ మళ్ళీ బిజెపి సరసన చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ నుంచి గెంటివేయబడిన మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేంద్ర సింగ్ కూడా ఎన్నికల బరిలో ఉన్నారు.వీరందరూ ఏకమైనా ఆమ్ ఆద్మీ గెలుపును ఆపలేరనే మాటలు పంజాబ్ లో గట్టిగా వినపడుతున్నాయి. ప్రాయోజిత కార్యక్రమాల వంటి ఒపీనియన్ పోల్స్ ను పూర్తిగా నమ్మలేమనే కొందరు అంటున్నారు. ఈ నివేదికలపై ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ, క్షేత్ర వాస్తవాలు కూడా ఇంచుమించుగా అలాగే ఉన్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా చూస్తే, బిజెపి విజయపరంపర కొనసాతూనే ఉందని అనిపిస్తోంది. ఆమ్ ఆద్మీకి మంచి భవిష్యత్తు ఉందనీ తెలుస్తోంది.
Also read: వాక్సిన్ కి ఏడాది