• పది రౌండ్లు ముగిసేసరికి 3734 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ
• మూడు రౌండ్లలో మాత్రమే టీఆర్ఎస్ ఆధిక్యం
• పార్టీకి ఆశ్చర్యకరమైన విజయమని రాం మాధవ్ వ్యాఖ్య
దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు గంట గంటకూ ఉత్కంఠ రేపుతోంది. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవగా … పది రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసే సరికి బీజేపీ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకి టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత కంటే 3734 ఓట్ల ఆధిక్యం లభించింది. దుబ్బాక రూరల్, ఆర్బన్ ప్రాంతాలలో టీఆర్ఎస్ ఆధిక్యం దిశగా సాగింది. విజయం పై బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. దాదాపు 10 నుంచి 15 వేల మెజారిటీ లభిస్తుందని బీజేపీ అంచనా వేస్తోంది. పది రౌండ్ల ఓట్ల లెక్కింపు లో టీఆర్ఎస్ మూడు రౌండ్లలో మాత్రమే ఆధిక్యాన్ని ప్రదర్శించింది.
2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ కి 62,350 మెజారిటీ లభించింది. బీజేపీ మూడో స్థానం దక్కించుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి మృతితో ఉపఎన్నిక జరిగింది. టీఆర్ఎస్ తరపున దివంగత రామలింగా రెడ్డి భార్య సుజాత ఎన్నికల బరిలో నిలిచారు.
మూడోస్థానంలో కాంగ్రెస్
కాంగ్రెస్ 3285 ఓట్ల తో మూడో స్థానానికి పరిమితమయింది. దీంతో టీఆర్ఎస్, బీజేపీ లు నువ్వా నేనా అన్న రీతిలో చేగుంట మండలంలో ఓట్ల లెక్కింపు ఫలితంపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఒక వేళ ఈ మండలంలో బీజేపీ మెజారిటీ సాధిస్తే విజయం దాదాపు బీజేపీని వరించనట్లేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ తో పాటు ప్రధాన ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ లు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.