- ఇంతకాలం మౌనం పాటించిన బీజేపీ అకస్మాత్తుగా రంగంలోకి
- కేంద్ర హోంమంత్రి అమిత్ షా సలహా మేరకు మహాపాదయాత్రలో పాల్గొన్న బీజేపీ
- వైసీపీ మినహా తక్కిన పార్టీలన్నీ అమరావతి రాజధానిగా కొనసాగాలని కోరుతున్నవే
అశ్వినీకుమార్ ఈటూరు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ రాజధాని రైతులు చేస్తున్న మహాపాదయాత్రలో నెల్లూరు సమీపంలో ఆదివారంనాడు బీజేపీ నాయకులు కూడా చేరి తమ మద్దతు ప్రకటించారు. ఇటీవల తిరుపతి సందర్శించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమైనప్పుడు అమరావతి పోరాటంలో ఎందుకు పాల్గొనడం లేదని రాష్ట్ర బీజేపీ నాయకులను ప్రశ్నించారు. బీజేపీ పాల్గొనకపోతే అమరావతి పోరాట ఖ్యాతి అంతా టీడీపీకే దక్కుతుందనీ, ప్రజల సానుభూతి యావత్తూ టీడీపీకే దక్కుతుందనీ హెచ్చరిస్తూ పాదయాత్రలో పాల్గొనవలసిందిగా ఆదేశించారు.
Also read: ఇది అసెంబ్లీనా, పశువుల సంతనా?
రాష్ట్రమంతటా భారీ వర్గాలూ, వరదలతో అతలాకుతలం అవుతుంటే రాజకీయ రంగం కూడా ఆటుపోటులు ఎదుర్కొంటున్నది. బీజేపీ నాయకులు అమరావతి రైతుల మహాపాదయాత్రలో చేరడంతో ‘ఒకే రాష్ట్రం – ఒకే రాజధాని’ నినాదానికి బలం చేకూరినట్టు అయింది. వైసీపీ ప్రభుత్వం అమరావతి ఏకైక రాజధానిగా కాకుండా మూడు రాజధానుల చట్టాన్ని తెచ్చింది. అమరావతిని శాసన రాజధానిగా (లెజిస్లేటివ్ కేపిటల్), కర్నూలును న్యాయరాజధానిగా (జుడీషియల్ కేపిటల్), విశాఖపట్టణాన్ని పరిపాలన రాజధానిగా (అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్) అభివృద్ది చేయాలని ప్రతిపాదించింది.
Also read: చంద్రబాబునాయుడు కంటతడి, వాకౌట్, అసెంబ్లీలో తిరిగి ముఖ్యమంత్రిగానే అడుగు
అమిత్ షా ఆదేశాలకు అనుగుణంగా ఆదివారంనాడు నెల్లూరులో పాదయాత్రలో బీజేపీ జాతీయ కార్యదర్శి దగ్గబాటి పురందేశ్వరి, రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ విభాగం అధ్యక్షుడు సోం వీర్రాజు, తదితర నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలంటూ బీజేపీ తీర్మానం ఆమోదించిందని సుజనా చౌదరి ప్రకటించారు. తనకు అధికారం లేకపోయినా వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పథకాన్ని ప్రకటించిందనీ, రాజధానికోసం భూములను త్యాగం చేసిన రైతులకు మద్దతుగా బీజేపీ కూడా అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్న డిమాండ్ ను సమర్థిస్తున్నదనీ ఆయన చెప్పారు.
Also read: టీడీపీ 2018-19లో చేసినట్టు టీఆర్ఎస్ యూ-టర్న్ తీసుకుంటుందా?
రాజధాని వికేంద్రీకరణ కోసం ప్రభుత్వం తెచ్చిన ఏ.పీ. డీసెంట్రలైజేషన్ అండ్ ఇన్ క్లూజివ్ డెవలప్ మెంట్ ఆఫ్ ఆల్ రీజియన్స్ యాక్ట్ 2020నీ, ఆంధ్రప్రదేశ్ కేపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ (రిపీల్ )యాక్ట్ 2020ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపైన రాష్ట్ర హైకోర్టు విచారణ కొనసాగిస్తున్నది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు ఎం సత్యనారాయణ మూర్తి, డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం ఎదుట అమరావతి పరిరక్షణ సమితి తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపిస్తున్నారు.
Also read: హిందూత్వపైన సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యపై పెనుతుపాను
హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇస్తుందని రైతులు ఆశాభావంతో ఉన్నారు. ఇంతకాలం మౌనం పాటించిన బీజేపీ అకస్మాత్తుగా అమరావతి డిమాండ్ కు మద్దతుగా రంగంలోకి దిగడంతో ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదానికి ఊపు వచ్చింది. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, జనసేన కూడా అమరావతి రాజధాని డిమాండ్ ను సమర్థిస్తన్నాయి. ఒక్క అధికార వైసీపీ మినహా తక్కిన రాజకీయ పార్టీలన్నీ అమరావతికి మద్దతు ప్రకటించాయి. రాజధాని రైతుల మహాపాద యాత్ర తిరుపతిలో ముగుస్తుంది.
Also read: విరాట్ కోహ్లీ కుటుంబాన్ని వేధించిన హైదరాబాదీ ముంబయ్ జైలులో