ఈమధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నంకి వచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆ సందర్భంలో తనను వచ్చి కలవవలసినదిగా ప్రత్యేకంగా చలనచిత్ర నటుడు, రాజకీయ నాయకుడు, జనసేన వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి కబురంపారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకొని ప్రధానమంత్రి తో గంటకు పైగా ఏకాంతంగా చాలా విషయాలు చర్చించారు. సమావేశం ముగిసిన తరువాత పత్రికా విలేకరులతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు ఉన్నాయని క్లుప్తంగా సమాధానమిచ్చి వెళ్లిపోయారు. ఈ వ్యాఖ్యానంలోని అంతరార్థం ఏమిటి అని రాజకీయ విశ్లేషకులు, పత్రికా ప్రతినిధులు వారి వారికి అనుకూలంగా వ్యాఖ్యానించుకుంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్సీపి పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా బిజెపి-జనసేన కూటమి ఎదిగి 2024 ఎన్నికలలో అధికారాన్ని చేకించుకోబోతున్నదా? పవన్ కళ్యాణ్ చెప్పిన ‘భవిష్యత్తులో మంచి రోజులు’ అంటే దాని అర్థం ఇదేనా!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా విస్మరించబడిన సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ పార్టీ అవసరం ఎంతైనా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన 1956వ సంవత్సరం నుంచి రాష్ట్ర రాజకీయాలను నిశితంగా పరిశీలించే ఏ రాజకీయ విశ్లేషకుడికైనా ఈ అవసరం కొట్టు వచ్చినట్లు కనిపిస్తుంది.
రెడ్ల ఆధిపత్యం
మద్రాస్ రాష్ట్ర నుంచి విడివడి వచ్చిన ఆంధ్ర ప్రాంతాన్ని హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాన్ని కలిపి 1956వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రిగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర రాజకీయ నాయకత్వానికి తనకు అనుకూలంగా ఉండే విధానాన్ని అనుసరించారు. ఆయా రాష్ట్రాలలో బలంగా ఉన్న సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రులు ఎంపిక చేసి రాష్ట్ర వ్యవహారాల వరకు వారికి పూర్తి స్వేచ్ఛ అందించి, కేంద్ర స్థాయిలో వీరి సహాయ సహకారాలతో తనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకటిన్నర దశాబ్దం కాలం పరిపాలన సాగించారు. ఈ విధానంలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రులు స్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తూ పరిపాలన సాగించారు. మధ్యలో కొద్ది కాలం దామోదరం సంజీవయ్య దేశంలోనే మొదటి దళిత ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన సాగించిన తర్వాత దాదాపు ఒకటిన్నర దశాబ్దం నీలం సంజీవరెడ్డి గారు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రులు గా కొనసాగారు.
బ్రహ్మానందరెడ్డి స్థానంలో పీవీ
ఇందిరా గాంధీ కేంద్రంలో బలపడిన తరువాత 1970లో ఈ బలమైన రాజకీయ ప్రయోజనాలకు భంగం కలిగే విధంగా రాష్ట్ర రాజకీయాలను నిర్దేశించడం ప్రారంభించారు. దీనిలో భాగంగానే 1969 తెలంగాణ ఉద్యమాన్ని ఆసరాగా తీసుకుని నాయకత్వ మార్పు తెచ్చి బ్రహ్మానంద రెడ్డి గారిని తొలగించి ఆ స్థానంలో పివి నరసింహారావుని తీసుకొని రావటం జరిగింది. మొదటిసారి ఆయన నాయకత్వంలో వెనుకబడిన వర్గాలకు క్యాబినెట్లో పెద్ద పీట వేయటం జరిగింది. విప్లవాత్మకంగా భూ సంస్కరణల అమలుకు శ్రీకారం చుట్టడం జరిగింది. కానీ 1972వ సంవత్సరంలో వచ్చిన ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం రాష్ట్ర రాజకీయ రూపురేఖనే మార్చివేసింది. పీవీ నరసింహారావు రాజీనామా చేసిన తర్వాత జలగం వెంగళరావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యత చేపట్టి దీర్ఘకాలం పరిపాలన కొనసాగించారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన వెంగళరావు ప్రధానంగా కమ్మ సామాజిక వర్గ ప్రయోజనాలకు ప్రాతినిధ్య వహించారు. దానికి కారణం ఆయన రాజకీయ ప్రస్థానానికి ఆర్థికపరమైన, సంఖ్యాపరమైన మద్దతు ఈ సామాజిక వర్గం నుంచే లభించింది. జలగం వెంగళరావు గారు ఇందిరా గాంధీ గారితో విభేదించడం, ఇందిరా కాంగ్రెస్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఘన విజయం సాధించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మరొకసారి మారిపోయింది. ఒక రకంగా ఇందిరా గాంధీ గారి నాయకత్వంలో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడటం రాష్ట్ర రాజకీయాలలో నాయకత్వ అస్థిరతకు, స్వల్ప కాలంలో ముఖ్యమంత్రులను మార్చే విధానానికి దారితీసింది.
ఎన్ టి రామారావు ఆగమనం
ఇదే సమయానికి షష్టిపూర్తి జరుపుకున్న తెలుగు సినిమా హీరో ఎన్టీ రామారావు ఆంధ్రుల ఆత్మగౌరవం ప్రధానమైన నినాదంగా తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి తొమ్మిది నెలలలో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి ఆంధ్ర రాజకీయాలలో, తెలుగుదేశం పార్టీ , కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా రెండు బలమైన సామాజిక వర్గాలకు వారి ప్రయోజనాలకు ప్రాతినిథ్యం వహిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు నడిపాయి. 2009లో ఈ రెండు పార్టీలకు భిన్నంగా మిగిలిన సామాజిక వర్గాలకు ప్రాతినిత్యం వహించే విధంగా ప్రజారాజ్యం పార్టీ వెలసి ఎన్నికలలో పాల్గొన్నది కానీ నాయకత్వ లోపం, సిద్ధాంతపరమైన పునాదులు సరిగ్గా లేకపోవడం వల్ల విజయం సాధించలేకపోయింది.
విస్మృత వర్గాలకు ప్రాతినిథ్యం ఆవశ్యకత
రాష్ట్రంలో రాజకీయంగా విస్మరించబడిన వర్గాలకు ప్రాతినిథ్యం వహించే రాజకీయ పార్టీ అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతైనా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాలో మిగిలిన సామాజిక వర్గాల కన్నా అధిక సంఖ్యలో ఉన్న కాపులు ఇంతకాలం అధికారపు అంచులలోనే ఉన్నారు కానీ ముఖ్యమంత్రులుగా రాజకీయ అధికారాన్ని చవిచూడలేదు. ఈ వర్గం, ఈ వర్గంతో పాటు రాజకీయంగా విస్మరించబడిన మిగిలిన వర్గాల వారు తమ ప్రయోజనాలకు ప్రాతినిథ్యం వహించే రాజకీయ కూటమిగా బిజెపి-జనసేన కూటమిని భావిస్తూ ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఈ కూటమికి అవరోధాలు మాత్రం ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా మీడియా. ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా రెండు కూడా వైఎస్ఆర్సిపి, తెలుగుదేశం పార్టీల చేతులలో ఉన్నాయి. 2009 సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీని అప్రతిష్టపాలు చేయడంలో ఆనాడు తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న మీడియా పాత్ర గణనీయం. ఈ ప్రతికూల మీడియాను ఎదుర్కొంటూ ముందుకు పోవటానికి వ్యూహాత్మకమైన విధానాన్ని బిజెపి-జనసేన కూటమి అనుసరించాల్సి ఉంటుంది. సామాజిక మీడియా(social media ) మీద ఎక్కువ ఆధారపడుతూ తమ విధానాలను ఆశయాలను ప్రజల వరకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది.
మీడియా అవసరం
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఏ ఇతర రాష్ట్రంలో లేని విధంగా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయటానికి స్వయం ప్రకటిత మేధావులు చాలామంది ఉన్నారు. వీరిలో కొందరు వైయస్సార్సీపీ పార్టీకి, ఎక్కువమంది తెలుగుదేశం పార్టీకి అనుకూలురు. అవసరానికి అనుగుణంగా రాష్ట్ర విభజన అంశాలను ఊహాజనిత అన్యాయాన్ని ఎత్తి చూపిస్తూ బిజెపిని ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు దోషిగా నిలబెట్టటానికి వీరి వంతు ప్రయత్నం నిర్విరామంగా చేస్తూ ఉంటారు. ఈ కూటమిని అధిగమించి నిజాలను ప్రజలలోకి తీసుకుపోవాల్సిన అవసరం బిజెపి-జనసేన కూటమికి ఉంది.
2024 ఎన్నికలలో విజయం సాధించాలంటే ఇప్పటినుంచి ఈ రెండు పార్టీలు కలసి తమ కార్యాచరణను నిర్వహించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అప్పుడే సత్ఫలితాలు రావచ్చు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, రాజకీయంగా విస్మరించబడిన అన్ని వర్గాల ప్రయోజనాల దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్ లో బిజెపి-జనసేన కూటమి బలపడి రాజ్యాధికారం చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఐవైఆర్ కృష్ణారావు, ఐఏఎస్, బీజేపీ నాయకులు