దారాసింగ్ చౌహాన్, స్వామి ప్రసాద్ మౌర్య
- ఇద్దరు వెనుబడినవర్గాల మంత్రుల రాజీనామా
- నలుగురు ఎంఎల్ఏలు కూడా నిష్క్రమణ
- యోగీ ఆదిత్యనాథ్ పట్ల ముదురుతున్న వ్యతిరేకత
- బలం పుంజుకుంటున్న అఖిలేష్
ఎన్నికలు దగ్గర పడుతున్నాయంటే వలసలు జరగడం సర్వ సాధారణమైన అంశం. కాకపోతే రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అత్యంత శక్తివంతంగా ఉన్న అధికార పార్టీని వీడి బయటకు వెళ్లడమనేది పలు అనుమానాలను రేకెత్తిస్తోంది, ఆలోచనలను పుట్టిస్తోంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ బిజెపిలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. 24 గంటలు తిరగక ముందే రాష్ట్ర కేబినెట్ మంత్రులు వరుసగా ఇద్దరు పార్టీని వీడి బయటకు వచ్చారు. వారితో పాటు నలుగురు ఎమ్మెల్యేలు కూడా పార్టీకి రాజీనామా చేశారు. వారందరూ సమాజ్ వాదీ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. 13మంది ఎమ్మెల్యేలు బిజెపిని వీడి సమాజ్ వాదీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఎన్సీపి అధినేత శరద్ పవార్ తాజాగా వ్యాఖ్యానించారు. అంతే కాదు, అఖిలేష్ తో కలిసి నడవడానికి తాము తయ్యారుగా ఉన్నామనీ పవార్ ప్రకటించారు. అధికార పార్టీకి మొదటి షాక్ ఇచ్చిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య ఉత్తరప్రదేశ్ లోని వెనుకబడిన వర్గాల్లో చాలా బలమున్న నాయకుడు. రెండో దెబ్బకొట్టిన మంత్రి దారా సింగ్ చౌహాన్ కూడా బీసీ వర్గాల్లో కీలకమైన నేత. వీరి వెనకాల చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారని సమాచారం. ఇంకా ఎంతమంది బయటకు వెళ్లిపోతారో అనే భయం బిజెపి వర్గాల్లో పట్టుకుందని వినికిడి.
Also read: మౌనమే మాయావతి భాష
బీసీలపట్ల చిన్నచూపే కారణమా?
అంకితభావంతో పనిచేసినవారిని చిన్నచూపు చూడడం, వెనుకబడినవారు,అణగారిన వర్గాలు, దళితులు, రైతులు, నిరుద్యోగ యువత పట్ల యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అణచివేత వైఖరితో ప్రవర్తిస్తోందని రాజీనామా చేసిన మంత్రి చౌహన్ లేఖలో వివరించారు. తొలుత పార్టీని వీడిన స్వామి ప్రసాద్ మౌర్య కూడా ఇవే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వెనుకబడిన వర్గాలే కాక బ్రాహ్మణులు కూడా ఆదిత్యనాథ్ విషయంలో ఆగ్రహంగా ఉన్నారని పలుమార్లు కథనాలు వెల్లువెత్తాయి. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మొదటి నుంచీ ప్రధానమైన భూమిక పోషించిన బ్రాహ్మణులను, బలమైన ఓటుబ్యాంక్ కలిగిన దళితులను దూరం చేసుకోవడం తెలివైన చర్యలు కావని మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. వెనుకబడిన వర్గాలతో పాటు దళితులు,బ్రాహ్మణులు, మహిళలను ఆకర్షించడానికి సమాజ్ వాదీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయి.
ముస్లిం ఓటుబ్యాంక్ పైన కూడా ఈ రెండు పార్టీలు కన్నేశాయి. ఒకప్పుడు దళిత,బ్రాహ్మణ వర్గాలను ఏకం చేసి అధికారాన్ని కైవసం చేసుకున్న బహుజన సమాజ్ అధినేత్రి మాయావతి నేడు మౌనముద్రలో ఉండడం, ఆ పార్టీ నుంచి వలసలు పెరగడంతో సమాజ్ వాదీ, కాంగ్రెస్ పార్టీలు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నాయి. మహిళలను రాజకీయాల వైపు ఆకర్షిస్తూ అధికారంలో భాగస్వామ్యం చేసే సరికొత్త వ్యూహాన్ని కాంగ్రెస్ అగ్రనాయకమణి ప్రియాంకా గాంధీ అనుసరిస్తున్నారు.
Also read: లాక్ డౌన్ అనివార్యమా?
ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటే, దళిత ఓటుబ్యాంక్ ను మాయావతి ఏ మేరకు కాపాడుకుంటారో అనుమానమేనని పరిశీలకులు భావిస్తున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో అమేయమైన విజయాన్ని దక్కించుకున్న బిజెపి రేపటి ఎన్నికల్లోనూ తనదే విజయమనే అతి విశ్వాసంలో ఉంది.
ఠాకూర్ల ఆధిపత్యం
యోగి ఆదిత్యనాథ్ పాలనలో సర్వత్రా ఠాకూర్ ల ఆధిపత్యం పెరిగిపోయిందనే విమర్శలు వెల్లువెత్తాయి. “విభజించి పాలించు” అనే సూత్రాన్ని అమలుచేయడం వల్ల సామాజిక అసమానతలు, అసంతృప్తులు ఎక్కువయ్యాయనే వార్తలు చక్కర్లు కొట్టాయి. లఖింపూర్ ఖేరీ ఘటన అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. యోగి వ్యవహారశైలిపై ఆ మధ్య అధిష్టానానికి పలు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ముఖ్యమంత్రిని మారుస్తారనే ప్రచారం కూడా జరిగింది.
కానీ, పలు సమీకరణాల నేపథ్యంలో యోగిని కొనసాగించక తప్పలేదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఉత్తరప్రదేశ్ లో బలపడడం అత్యంత కీలకమని అందరికీ తెలిసిన సూత్రం. అందుకే ప్రతి పార్టీ ఉత్తరప్రదేశ్ పై ప్రత్యేక దృష్టిని పెడుతూ ఉంటుంది. అందుచేతనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ రాష్ట్రంపై మొదటి నుంచీ వరాల జల్లులు కురిపిస్తున్నారు.
Also read: ఎన్నికల నగారా మోగెన్
వారణాసిని లోక్ సభ స్థానానికి ఎంచుకోవడంలోనే నరేంద్రమోదీ ముందుచూపు అర్ధమయ్యింది.
అయోధ్య రామమందిర నిర్మాణం,కాశీ కారిడార్ స్థాపన, గంగా ప్రాజెక్టుకు అధికమొత్తంలో నిధుల విడుదల, పలు కీలక ప్రాజెక్టుల రూపకల్పన మొదలైనవన్నీ బిజెపి ప్రభుత్వం చేపట్టింది. ఇన్ని ఆకర్షణీయమైన పథకాలు చేబట్టినా, పార్టీ అంత శక్తివంతంగా ఉన్నప్పటికీ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికల వేళ బిజెపిని వీడి ప్రతిపక్షాల వైపు చూస్తున్నారంటే బిజెపి ఆత్మపరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది.
యోగి ఆదిత్యనాథ్ ఏకస్వామ్యం, పార్టీలో అంతర్గత విబేధాలు, అసంతృప్తులు, కరోనా కష్టాలు, అధిక ధరలు, నిరుద్యోగం మొదలైనవన్నీ అధికార పార్టీకి సవాళ్లు విసురుతున్నాయి. ఇప్పటి వరకూ వెలువడిన పోల్ సర్వేలు బిజెపి గెలుపు తథ్యమని చెబుతున్నాయి.
స్పాన్సరింగ్ ప్రాతిపదికన రూపుదిద్దుకుంటున్న పోల్ సర్వేలను నమ్మలేమని కొందరు అంటున్నారు. బిజెపి గెలుపు అంత సునాయాసం కాదని కొందరు పరిశీలకులు, జాతీయ స్థాయి జర్నలిస్టులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.
వివిధ విపక్షాలు సమాజ్ వాదీ పార్టీ వైపు నడవడానికి మొగ్గుచూపిస్తున్న నేపథ్యంలో, ఉత్తరప్రదేశ్ లో యుద్ధం ప్రధానంగా బిజెపి -సమాజ్ వాదీ మధ్యనే ఉంటుందనే మాటలు ఎక్కువగా వినపడుతున్నాయి. గెలుపుఓటములను అంచనా వేయడానికి ఇంకాస్త సమయం పడుతుంది.
Also read: భద్రతా లోపం, ప్రచార పటాటోపం