Tuesday, January 21, 2025

తమిళనాట కాషాయం ఆట

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. వెస్ట్ బెంగాల్ లో బిజెపి ఆట మొదలుపెట్టి కూడా చాలా కాలమైంది. అది విజయవంతంగానే సాగుతోంది. నేడు అస్సాంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ఆట మొదలెట్టారు. తాజాగా, పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వేటుతో తమిళనాట ఆట ఊపందుకుంది.

కాంగ్రెస్ దురవస్థ:

అందరూ ఊహించినట్లుగానే పుదుచ్చేరిలో కాంగ్రెస్,డిఎంకె సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. కూల్చేశారా? కూలిపోయిందా? అన్నది బహిరంగ రహస్యమే. దక్షిణాదిలో కాంగ్రెస్ పాలనలో వున్న ఏకైక రాష్ట్రమిదే. దీన్ని సైతం కాపాడుకోలేని బలహీనమైన దశలోనే కాంగ్రెస్ ఉంది. మొదటినుంచీ కాంగ్రెస్ కు పుదుచ్చేరి కంచుకోట. 2016నుంచే ఆ కోటకు బీటలు పడడం ప్రారంభమైంది. డిఎంకె సహకారంతో, బొటాబొటి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.

Also Read: పుదుచ్ఛేరిలో పావులు కదుపుతున్న బీజేపీ

తమిళనాడుమీద బీజేపీ కన్ను:

దక్షిణాది రాష్ట్రాల్లో అధికారం చేపట్టాలనుకున్న బిజెపి తమిళనాడు, పుదుచ్చేరి మీద కన్నేసింది.అధికారంలో లేకపోయినా, మెల్లగా అజమాయిషీ చేయడం ఆరంభించింది. తమిళనాడులో చోటుచేసుకున్న పరిణామాలు అందుకు కలిసివచ్చాయి. అత్యంత జనాకర్షణ కలిగిన బలమైన నేత జయలలిత మరణించడం మొదటి పరిణామం. ఆమెతో సమానమైన నేత ఇంకొకరు లేకపోవడం, ఆమె నెచ్చెలి శశికళకు కొంత ఆకర్షణ, సమర్ధత ఉన్నప్పటికీ, అక్రమార్జన కేసుల్లో జైలుకు వెళ్లాల్సివచ్చింది. దీనితో ఆ కాస్త అడ్డూ తొలగిపోయింది. ముఖ్యమంత్రి రేసులో ఉన్న పన్నీరుసెల్వం, పళనిస్వామి ఇద్దరూ ఢిల్లీ ప్రభువులకు మోకరిల్లక తప్పలేదు. వీరిద్దరి మధ్య ఒక అంగీకారం కుదిర్చి అధికారాన్ని అప్పచెప్పారు.

బీజేపీ కనుసన్నలలో పళని, పన్నీరు:

అప్పటి నుంచి వీరు బిజెపి పెద్దల కనుసన్నల్లోనే నడుస్తున్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చి, ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే ఆట ఇంకొక రకంగా ఉండేది. పన్నీరుసెల్వం అటు జంప్ అయివుండేవాడు. రజనీ ఎన్నికల పోటీకి స్వస్తి పలకడంతో పన్నీరుసెల్వం యధాస్థానంలో కొనసాగుతున్నాడు. జైలు నుంచి విడుదలైన శశికళ ఎఐఎడిఎంకె నాదే అంటూ కత్తులు నూరుతున్నారు. ఆమె చెన్నైలో అడుగుపెట్టిన గంటల వ్యవధిలోనే, పళనిస్వామి ప్రభుత్వం ఆమె ఆస్తులన్నింటినీ అక్రమఆస్తుల కేసులో అటాచ్ మెంట్ చేసింది. శశికళ ఆర్ధిక మూలాలపై దెబ్బ పడింది. పార్టీ పగ్గాలు చేపట్టాలంటే కోర్టు నుంచి అనుకూలమైన తీర్పు రావాలి. బిజెపి పెద్దలకు ఆమెపై ఏ మాత్రం మంచి అభిప్రాయం లేదు.

Also Read: తమిళనాడు ఎన్నికలపై శశికళ ప్రభావం ఉంటుందా?

శశికళ చక్రం తిప్పలేరు:

ఆరేళ్ళ వరకూ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిషేధం ఉంది. వీటన్నింటి నేపథ్యంలో శశికళ తమిళనాడులో చక్రం తిప్పడం ప్రస్తుతానికి కుదిరేపని కాదు. ఇవ్వన్నీ ఎఐఎడిఏంకె పార్టీకి ఉన్న బలహీనతలు. ఈ బలహీనతలను అడ్డం పెట్టుకొని తమిళనాడులో బిజెపి చక్రం తిప్పనుంది. రేపటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేంత బలం బిజెపికి సొంతంగా లేకపోయినా, కింగ్ మేకర్ గా చక్రం తిప్పి, తన ఆట కొనసాగిస్తూనే ఉంటుంది. డిఎంకె పార్టీ అధికారానికి దూరమై చాలాకాలమైందనే సెంటిమెంట్ ప్రజల్లో మళ్ళీ వస్తే స్టాలిన్ చేతికి పగ్గాలు వస్తాయి. ఇక్కడ కాంగ్రెస్, డిఎంకె మిత్రపక్షాలుగా ఉన్నాయి.

స్టాలిన్ కు అవకాశాలు:

కరుణానిధికి ఉన్నంత ఆకర్షణ, ప్రజాబలం స్టాలిన్ కు లేవు. పళనిస్వామి, పన్నీరుసెల్వం కంటే, స్టాలిన్ కాస్త స్వతంత్రత, ఆకర్షణ ఉన్న వ్యక్తి. పుదుచ్చేరి వేరే రాష్ట్రం అయినప్పటికీ, తమిళనాడు రాజకీయాలే అక్కడా నడుస్తాయి. చాలావరకూ అందరూ తమిళులే. తమిళనాడులో జయలలిత మరణించినప్పుడు మొదలు పెట్టిన ఆటను బిజెపి కొనసాగిస్తూనే ఉంది. 2016లో కిరణ్ బేడీని లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా నియమించినప్పుడే పుదుచ్చేరిలో కూడా బిజెపి ఆట మొదలైంది. ఇప్పుడు అది పరాకాష్టకు చేరింది. ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ముఖ్యమంత్రి నారాయణస్వామిని డమ్మీగా మార్చేశారు. చివరకు కాంగ్రెస్, డిఎంకె పార్టీలకు బలం లేదని నిరూపించారు.

కూలిపోయిన పుదుచ్ఛేరి ప్రభుత్వం:

సోమవారంనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. విశ్వాస పరీక్షను ఎదుర్కోకుండానే కేబినెట్ మొత్తం రాజీనామాను సమర్పించింది. మెజారిటీకి సరిపడా ఎంఎల్ ఎలు ప్రస్తుతం బిజెపి,ఎన్ ఆర్ కాంగ్రెస్, ఎఐఎడిఎంకె వైపు ఉన్నారు. కిరణ్ బేడీని హటాత్తుగా తప్పించి, తమిళసైని ఆ స్థానంలో కూర్చోపెట్టడంతోనే ఆడబోయే ఆట అందరికీ అర్ధమైంది.ఇప్పుడు బంతి గవర్నర్ తమిళసై చేతిలో ఉంది. ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడుగా ఎన్ ఆర్ కాంగ్రెస్ కు చెందిన రంగస్వామి ఉన్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కూడా.

Also Read: 5 రాష్ట్రాలలో అన్ని పార్టీలకూ అగ్నిపరీక్ష

నారాయణస్వామి స్థానంలో రంగస్వామి:

ప్రస్తుతం, ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా బలం ప్రతిపక్షానికి ఉన్న నేపథ్యంలో, రంగస్వామిని ముఖ్యమంత్రిగా కూర్చోపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరో మూడు నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో, ముందుగానే పుదుచ్చేరిని తన చేతుల్లోకి తీసుకోవాలానే బిజెపి వ్యూహం ఫలించింది. ఇది కేంద్ర పాలిత ప్రాంతం. కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ విశేష అధికారాలు ఉంటాయి. వీటన్నింటినీ ఉపయోగించి, రేపటి ఎన్నికల్లో పుదుచ్చేరిని సంపూర్ణంగా తన అధికారంలోకి తెచ్చుకోవాలని బిజెపి చూస్తోందని రాజకీయ విశ్లేషకులు బలంగా అభిప్రాయపడుతున్నారు.

మళ్ళీ కాంగ్రెస్-డిఎంకె విజయం?

నారాయణస్వామికి అన్యాయం జరిగిందని పుదుచ్చేరి ప్రజలు బలంగా భావిస్తే, మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్, డిఎంకె సంకీర్ణ ప్రభుత్వమే వస్తుంది. డిఎంకె పార్టీ, కరుణానిధి వారసుడు స్టాలిన్ అధికారానికి చాలా ఏళ్ళ నుంచి దూరమయ్యారనే సెంటిమెంట్ ప్రజల్లో గట్టిగా వస్తే, తమిళనాడులో డిఎంకె, కాంగ్రెస్ సంకీర్ణం రేపు అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటుంది. బిజెపి గతంలో కర్ణాటక, మధ్యప్రదేశ్, అస్సాంలో ఆడిన ఆటలు ఆ పార్టీకి బాగా కలిసివచ్చాయి. తమిళరాష్ట్రాల్లో ఆటలు ఫలిస్తాయా? వికటిస్తాయా? అన్నది కొన్ని నెలల్లోనే తేలనున్నది.

Also Read: ముఖ్యమంత్రికీ, గవర్నర్ కీ మధ్య చిచ్చు

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles