పాక్ ప్రమేయంతోనే పుల్వామా దాడి జరిగిందని పాక్ మంత్రి అంగీకరించడంతో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. దాడి వెనుక తమ హస్తం ఉందని స్వయంగా పాక్ మంత్రే స్వయంగా అంగీకరించినందున కాంగ్రెస్ పార్టీ సహా ఇతర విపక్షాలు క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ డిమాండ్ చేశారు.
పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జరిగిన దాడి వెనుక ప్రధాని మోడీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత బీకే హరి ప్రసాద్ దాడి జరిగిన అనంతరం ఆరోపించారు. మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కూడా దాడిలో కుట్రకోణం దాగి ఉందని విమర్శించారు. జవాన్లపై దాడితో బీజేపీ లాభపడిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ప్రశ్నలు కురిపించారు. దాడి వెనుక అధికార పార్టీ కుట్ర ఉందంటూ పలువురు విపక్ష నేతలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో విపక్షాలు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని జవదేకర్ డిమాండ్ చేశారు.
పుల్వామా దాడి మా పనేనన్న పాక్ మంత్రి
గత ఏడాది జమ్ము కశ్మీర్ లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జరిగిన ఉగ్రదాడిలో తమ ప్రమేయం ఉందని పాక్ సీనియర్ మంత్రి ఫవాద్ చౌధురి ఆ దేశ పార్లమెంటులో అంగీకరించారు. పుల్వామా దాడి ఇమ్రాన్ నాయకత్వంలో పాక్ సాధించిన ఘన విజయంగా అభివర్ణించారు.
పుల్వామా దాడిలో పాక్ ప్రమేయం ఉందని భారత్ వాదిస్తుండగా ..దాడిలో మా పాత్ర లేదంటూ పాక్ బుకాయిస్తోంది. తాజాగా ఆ దేశ పార్లమెంటులో పాక్ మంత్రి అంగీకరించడంతో భారత్ వాదనకు బలం చేకూరినట్లయింది.