Sunday, December 22, 2024

గుజరాత్ పై బీజేపీ గురి

  • మరోసారి బీజేపీ గెలిచే అవకాశాలు
  • బలహీనపడిన కాంగ్రెస్
  • హార్దిక్ పటేల్ నిష్క్రమణ కాంగ్రెసె కు ఎదురుదెబ్బ

ఇరవై ఏళ్ళుగా బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రం, పార్టీ పెద్దల సొంత రాష్ట్రం, మామూలు చాయ్ వాలాను ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిని చేసిన రాష్ట్రం, డబ్బుల చెట్టులను సృష్టించే బడాబాబుల జన్మక్షేత్రం, మహాత్మాగాంధీ వంటి మహనీయుడు, మొరార్జీదేశాయ్ వంటి మాననీయుడికి జన్మనిచ్చిన ప్రాంతం గుజరాత్. మరి కొద్ది రోజుల్లోనే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మిగిలిన మరికొన్ని రాష్ట్రాల్లోనూ 2022, 23లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సివుంది. వీటన్నిటి తర్వాత 2024లో దేశ సార్వత్రిక ఎన్నికలు కూడా జరగనున్నాయి. అన్నీ కలిసి వస్తే ముందుగానో ఆ తర్వాతో జమిలి ఎన్నికలను నిర్వహించే అవకాశాలు కూడా లేకపోలేదు. ప్రధాని నరేంద్రమోదీ పదే పదే బలంగా చెప్పేవాటిల్లో జమిలి ఎన్నికలు కూడా ప్రధానమైనవి. ఇటీవల విడుదలైన పలు ఉపఎన్నికల ఫలితాల్లో బిజెపికి అన్నిచోట్ల ఘన విజయమే లభించింది. ఇంటగెలిచి రచ్చ గెలవడం అనుభవమైన నరేంద్రమోదీ, అమిత్ షా ద్వయానికి గుజరాత్ ఎన్నికల్లో గెలుపు అన్నింటి కంటే ప్రధానమైన విషయం. ఏదో బొటాబొటిగా గెలవడం కాక నిరుడుకు మించిన గెలుపును సొంతం చేసుకోవలన్నది ప్రధానమైన లక్ష్యం. దీనిని సాకారం చేసుకోనేందుకు అన్ని విద్యలు, అన్ని శక్తులు ప్రయోగిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టులన్నింటినీ అక్కడే స్థాపిస్తున్నారు. మిగిలిన ఏ రాష్ట్రంలో లేనట్లుగా కోట్లాది రూపాయల నిధులు గుజరాత్ లోనే కుమ్మరిస్తున్నారు. డిసెంబర్ 1,5 తేదీల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటన కూడా విడుదల చేసింది. డిసెంబర్ 8వ తేదీన అందరి జాతకాలు బయటపడతాయి. ఈ నేపథ్యంలో, తాజాగా దిల్లీ పార్టీ కార్యాలయంలో అగ్రనేతలంతా సమావేశమయ్యారు.

Also read: కాలుష్యం వల్ల మధుమేహం

గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు

గెలుపే లక్ష్యంగా వ్యూహరచనలు ప్రారంభించారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపెంద్ర పటేల్, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ కూడా అగ్రనేతలతో భేటీ అయ్యారు. ఎన్నికల వ్యూహంలో భాగంగా ఈసారి సీనియర్లను పక్కన పెడుతున్నట్లు సమాచారం. 75 ఏళ్ళు పైబడిన వారికి ఎట్లాగూ టిక్కెట్లు ఇవ్వరు. ఆ నిబంధన గతంలో వచ్చిందే. ఈసారి యువతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు భావించాలి. ఎన్నికలలో పాల్గొన కుండా దూరంగా ఉంటామని పలువురు సీనియర్ నేతలు ప్రకటించారు కూడా. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, మాజీ ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్, సీనియర్ శాసనసభా సభ్యుడు భూపేంద్ర సిన్హా వంటివారు ఉన్నారు. కాంగ్రెస్ ను వదిలి బిజెపిలో చేరిన పాటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ ను బరిలోకి దింపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా పటేల్, ఇటీవల తీగల వంతెన కూలిన సమయంలో సేవలందించిన కాంతిలాల్ అమృతీయ మొదలైనవారికి సీట్లు కేటాయించే అవకాశం ఉంది. అన్ని స్థానాలకు నిలిపే అభ్యర్ధులను ఈరోజు రేపట్లో ఖరారు చేసి అధికారికంగా ప్రకటించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో బిజెపి 99చోట్ల గెలిచింది. కాంగ్రెస్ కూడా గట్టిపోటీ ఇచ్చి 77స్థానాల్లో గెలుపును సొంతం చేసుకుంది. ఆ తర్వాతి పరిణామాల్లో కాంగ్రెస్ నుంచి 12 మంది బిజెపిలోకి దుమికారు. ఆకర్ష్ మంత్ర లో భాగంగా ఈ ఫిరాయింపులు జరిగాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలా బిజెపి బలం 99 నుంచి 111కు చేరుకుంది. హార్దిక్ పటేల్ వంటి ఉద్యమ నేతలు కూడా కాంగ్రెస్ ను వీడి బిజెపిలో చేరడంతో కాంగ్రెస్ మరింత బలహీన పడింది. ఈ ఐదేళ్లల్లో ముఖ్యమంత్రులను మార్చినప్పటికీ సొంత రాష్ట్రమనే ప్రేమ, దేశంలో ప్రతిష్ఠ తగ్గకూడదనే భయంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ రాష్ట్రానికి సంపూర్ణమైన సహకారాన్ని అందించారు. పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నారనే విమర్శలు వచ్చినా ఆయన లెక్క చేయలేదు. కేంద్ర ప్రభుత్వంలోనూ కీలకమైన భూమికలు పోషించే అధికారగణం కూడా గుజరాతీయులనే పేరుమోసినా ఆయనేమీ పట్టించుకోలేదు. రాష్ట్రంలో 20ఏళ్ళుగా బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉంది.

Also read: అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు సమంజసమే

ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ…

ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత రావడం సర్వ సాధారణమైన అంశం. కానీ, ఆ వ్యతిరేకత పార్టీని దెబ్బతీయకుండా ఉండడం కోసం ప్రధాని నరేంద్రమోదీ, అగ్రనేత అమిత్ షా శత విధాలా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ బలహీనమైన నేపథ్యంలో అక్కడ బలాన్ని పెంచుకోవాలని అమ్ ఆద్మీ పార్టీ చూస్తోంది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ఆ పార్టీ అగ్రనేత కేజ్రీవాల్ ప్రజలను దువ్వే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు. భారత్ జోడో యాత్ర పేరుతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్టీకి కొత్త రక్తం ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పార్టీకి కొత్త జాతీయ అధ్యక్షుడుగా ఇటీవలే మల్లికార్జున ఖడ్గే కుర్చీలో కూర్చున్నారు. ఈ ఎన్నికలు ఆయన నాయకత్వానికి పెద్ద సవాల్. గత ఎన్నికల్లో మంచి ఫలితాలు దక్కించుకొని ప్రధాన ప్రతి పక్షంగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ పరువును కాపాడాల్సిన బాధ్యత ఖడ్గే పైన వుంది. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పెద్దగా ప్రగతి సాధించిన దాఖలాలు కనిపించడం లేదు. అమ్ ఆద్మీ పార్టీకి కొన్ని సీట్లు దక్కే అవకాశాలను కొట్టి పారెయ్యలేం. మిగిలిన పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రస్తుత వాతావరణం బట్టి ప్రజలు మళ్ళీ బిజెపికి పట్టం కట్టవచ్చునని అంచనా వెయ్యవచ్చు. ప్రజల్లో బిజెపిపై తీవ్ర వ్యతిరేకత వచ్చి, కాంగ్రెస్ పైనో, అమ్ ఆద్మీ పైనో కొత్తమోజు పెరిగితే తప్ప బిజెపికి  ఢోకాలేదు. గుజరాత్ ఫలితాలు రాబోయే ఎన్నికల గతిని మారుస్తాయనడంలో సందేహం లేదు.

Also read: ఏ విలువలకీ ప్రస్థానం?

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles