(‘సకలం’ ప్రత్యేక ప్రతినిధి)
కేంద్రానికీ, పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు నిందలు మోపుకుంటున్నారు. ఎన్నికల వేడిని అమాంతంగా పెంచివేస్తున్నారు. బిహార్ శాసనసభ ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలోనే బీజేపీ సీనియర్ నాయకుడు అమిత్ షా పశ్చిమ బెంగాల్ వెళ్ళి ఎన్నికల ప్రచారం ఆరంభించారు. ఎన్నికలు ఆరు మాసాలు ఉన్నాయనగానే బీజేపీ నాయకులందరూ పశ్చిమెబెంగాల్ పూర్తి స్థాయిలో దిగిపోయారు.
కలకత్తా కాళిక ఆశీస్సులు : నడ్డా
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వాహనంపైన దాడి జరగడంపై బీజేపీ నేతలు తృణమూల్ నాయకత్వంపైన ముప్పేట దాడికి దిగారు. తమపైన తామే దాడి చేసుకొని ఎదుటివారిని నిందించడం బీజేపీకి పరిపాటేనంటూ తృణమూల్ నాయకులు ప్రతివిమర్శలకు పూనుకున్నారు. కలకత్తా కాళిక ఆశీస్సులతో దాడి నుంచి బయట పడ్డానంటూ నడ్డా వ్యాఖ్యానించారు. దాడితోనే నడ్డా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ నాయకులూ, కార్యకర్తలూ రెండు వైపులా మోహరించి యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నారు. చిన్న ఘటన జరిగినా దానిని రాజకీయంగా వినియోగించుకునేందుకు రెండు పక్షాలు ప్రయత్నిస్తున్నాయి.
పరోక్షంగా ఆత్యయిక పరిస్థితి అమలు
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బెదిరించడం, భయపెట్టడం ద్వారా పశ్చిమబెంగాల్ లో ఆత్యయిక పరిస్థిని పరోక్షంగా అమలు చేయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రయత్నిస్తున్నారని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ముగ్గురు ఐపీఎస్ అధికారులను కేంద్రానికి డిప్యుటేషన్ పైన పంపాలంటూ శుక్రవారంనాడు పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు పంపడంపైన నిరసన తెలుపుతూ హోం కార్యదర్శి అజయ్ భల్లాకు రాసిన లేఖలో త్రిణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ విమర్శించారు.
అధికారులపై ఒత్తిడి తెస్తున్న కేంద్రం
డిసెంబర్ 10న బీజేపీ కారుల బారుపైన దుండగులు రాళ్ళు విసిరన సమయంలో కేంద్రం అడుగుతున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులూ దాడి జరిగిన ప్రాంతంలోనే డ్యూటీలో ఉన్నారనీ, వారిని కేంద్రానికి డిప్యూటేషన్ లోకి తీసుకొని పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసుబనాయించడంలో వారిని ఉపయోగించాలని కేంద్రం పన్నాగం పన్నుతున్నదనీ కల్యాణ్ బెనర్జీ ఆరోపించారు. పశ్చిమబెంగాల్ పోలీసుశాఖ అధిపతినీ, ఉన్నత ఐఏఎస్ అధికారులనూ దిల్లీకి వచ్చి సంజాయిషీ చెప్పాలని ఆదేశించడం రాష్ట్రంపైన కేంద్ర ప్రభుత్వం జులుం చెలాయించడమేనని బెనర్జీ విమర్శించారు. ఇందులో రాజకీయకోణం స్పష్టంగా కనిపిస్తున్నదని ఆయన అన్నారు. రాజకీయ కక్ష తీర్చుకునేందుకు పశ్చిమబెంగాల్ అధికారులపైన ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
కారులబారుపై దాడితో కొత్త మలుపు తిరిగిన ప్రచారం
నడ్డా కారులబారుపైన గురువారం జరిగిన దాడి బీజేపీ-తృణమూల్ రాజకీయ పోరాటం కొత్త పుంతలు తొక్కింది. నడ్డా కారులబారుపైన కర్రలతో, రాళ్ళతో, ఇటికెలతో దాడి చేశారు. ఈ ఘటనలో కొందరు బీజేపీ నాయకులు గాయపడినారు. కొన్ని కార్లు ధ్వంసమైనాయి. ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నియోజకవర్గం డైమండ్ హార్బర్ లో ఈ ఘటన జరిగింది. జనసమ్మర్దంతో క్రిక్కిరిసిన రోడుపైన కారులబారు వెడుతుండగా రాళ్ళు దూసుకొని వచ్చి కార్ల అద్దాలు పగిలిపోయిన దృశ్యాలను వీడియో కెమెరాలు చిత్రించాయి. కైలాశ్ విజయవర్గీయ, ముకుల్ రాయ్, తదితర నాయకులు గాయపడ్డారని బీజేపీ ఆరోపించింది.
నిప్పుతో చెలగాటం వద్దు : గవర్నర్
నిప్పుతో చెలగాడం ఆడవద్దంటూ పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ కర్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీని హెచ్చరించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో, ప్రభుత్వంతో గవర్నర్ ధన్ కర్ పోరాటం చాలాకాలంగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా కంటే బీజేపీ ప్రతినిధిగా గవర్నర్ స్థాయి దిగజారి వ్యవహరిస్తున్నారంటూ తృణమూల్ నాయకులు విమర్శిస్తూ వచ్చారు. మీడియా గోష్ఠులలో గవర్నర్ పైన మమతా బెనర్జీ, ఆమె సహచరులూ, మమతాబెనర్జీపైన గవర్నర్, కేంద్ర మంత్రులూ పరస్పర ఆరోపణలు చేసుకోవడం నిత్యకృత్యంగా మారింది.
ప్రశాంత కిశోర్ సహకారం
వచ్చే ఏడాది ప్రథమార్ధంలో జరిగే ఎన్నికలకు ఇప్పటి నుంచీ ప్రచారం జోరందుకోవడం విశేషం. 2019 నాటి లోక్ సభ ఎన్నికలలో గణనీయమైన ఓట్ల శాతం, సీట్ల సంఖ్య సాధించిన బీజేపీ ఈ సారి అసెంబ్లీ ఎన్నికలలె తృణమూల్ కాంగ్రెస్ ను గద్దె దించి అధికారం కైవసం చేసుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. బీజేపీని మమతాబెనర్జీ అడుగడుగా ప్రతిఘటిస్తున్నారు. ఎన్నికల ప్రవీణుల ప్రశాంత్ కిశోర్ మమతాబెనర్జీతో కలసి పని చేస్తున్నారు. ఆయన వ్యూహాలను ఆమె అమలు చేస్తున్నారు. ఈ కారణంగా తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేతలు కొందరు ప్రశాంత్ కిశోర్ జోక్యంపైన అభ్యంతరం తెలుపుతున్నారు. కొందరు పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు అతడిని కారణంగా చూపుతున్నారు.