హైదరాబాద్ : లాయర్ దంపతుల హత్య కేసులో కొత్త వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా పరిషత్తు అధ్యక్షుడు పుట్ట మధుకర్ మేనల్లుడు బిట్టు శ్రిను హంతకుడు కుంట శ్రీనివాస్ కోరిక మేరకు కొడవళ్ళను తయారు చేయించినట్టు పోలీసులు సోమవారంనాడు వెల్లడించారు. మంథనిలో ట్రాక్టర్ చక్రాల తొడుగులను ఉపయోగించి తలసిగిరి (బిట్టు) శ్రీనివాస్ కొడవళ్ళను తయారు చేయించాడు.
తాను తయారు చేయించిన కొడవళ్ళను చిరంజీవి ఇంట్లో బిట్టు శ్రీను దాచి ఉంచాడని డీఐజీ నాగిరెడ్డి తమ దర్యాప్తులో వెల్లడైన తాజా వివరాలను తెలియజేస్తూ చెప్పారు. అయిదు రోజుల కిందట కుంట శ్రీనివాస్, కుమార్ లతో కలిపి చిరంజీవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదివరకే అదుపులోకి తీసుకున్న బిట్టు శ్రీనును పోలీసులు ప్రశ్నించడం పూర్తయిన తర్వాత సోమవారం అరెస్టు చేసినట్టు చూపించారు. లాయర్ దంపతులు గట్టు వామనరావు, భార్య పీవీ నాగమణి హత్యలో బిట్టు శ్రీనుది కీలకమైన పాత్ర. లాయర్ దంపతుల హత్యకు అవసరమైన కారునూ, కొడవళ్ళను ఏర్పాటు చేసిన వ్యక్తి బిట్టు శ్రీను అని పోలీసులు వెల్లడించారు.
Also Read:ఆందోళన కలిగిస్తున్న నేరం నేపథ్యం
వామనరావు స్వగ్రామం గుంజపడుగు వ్యవహారాలకు సంబంధించి వామనరావుకూ, కుంట శ్రీనుకూ, బిట్టు శ్రీనుకూ మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. ముఖ్యంగా రెండు దేవాలయాల నిర్మాణం విషయంలో విభేదించారు. గ్రామంలో అధికారం చెలాయించాలంటే వామనరావును అడ్డు తొలగించుకోవడం ఒక్కటే మార్గమని బిట్టు శ్రీనుతో పది మాసాలుగా కుంట శ్రీను అంటూ వచ్చాడు.
నిజానికి నాలుగు మాసాల కిందట మంథని కోర్టుకు వామనరావు వచ్చినప్పుడు అతడిని చంపాలని ప్రణాళిక వేసుకున్నారనీ, వామనరావుతో పాటు చాలామంది రావడంతో హత్యప్రణాళికను వాయిదా వేసుకున్నారనీ పోలీసులు తెలిపారు. లాయర్ దంపతులు ఫిబ్రవరి 17న మంథని కోర్టుకు వచ్చినట్టు కుంట శ్రీను తెలుసుకున్నాడు. వెంటనే బిట్టు శ్రీనుకు ఫోన్ చేశాడు. కోర్టు ప్రాంగణంలో ఉన్న లచ్చయ్యతో మాట్లాడి వామనరావు కోర్టులో ఉన్నట్టు కుంట శ్రీను నిర్ధారించుకొని బిట్టు శ్రీనుకు ఆ విషయం తెలిపాడు. అప్పుడు మంథని బస్ స్టాప్ కు కొడవళ్ళు తీసుకొని రావలసిందిగా చిరంజీవికి బిట్టు శ్రీను పోన్ చేసి చెప్పాడు. కల్వచర్ల దగ్గర వామనరావునూ, నాగమణినీ హత్య చేసిన తర్వాత ఆ విషయం కుంట శ్రీను ఫోన్ చేసి బిట్టుశ్రీనుకు తెలియజేశాడు.
Also Read: సూమోటోగా లాయర్ల హత్య కేసు, నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం