Friday, November 22, 2024

అమరావతి కథల మంచె సత్యం శంకరమంచి

సత్యం శంకరమంచి పుట్టి ఇప్పటికి 84ఏళ్ళు పూర్తయ్యాయి. కానీ, 50ఏళ్లకే ఆయనకు నూరేళ్లు నిండాయి.  నూరేళ్లే కాదు,ఎన్నేళ్ళైనా నిండుగా నిలిచివుండే అజరామరమైన “అమరావతి కథల” సృష్టికర్త ఆయన. అమరావతి కథలు అపురూప శిల్పాలు అని ఎందరెందరో మహామహులు పొగడ్తల పొన్నచెట్లు నాటారు. ఈ కథా సంపుటిని 1979లో రాష్ట్ర సాహిత్య అకాడెమి పురస్కారం వరించింది. శ్యామ్ బెనెగల్ వంటి దిగ్ దర్శకుడు ఈ కథలను దృశ్యమానం చేశారు. దానితో, తర్వాత తరాలకు ఈ సంపద చేరింది. దాని విలువ తెలిసింది. ఎప్పుడో 1975-77 మధ్య ఆంధ్రజ్యోతి వార పత్రికలో ప్రచురణ పొంది, ప్రాచుర్యం చెందిన ఈ కథలకు మళ్ళీ బహుళ ప్రచారం దక్కింది. శంకరమంచి సత్యం అంటే అమరావతి కథలు. అమరావతి, అనగానే సాహిత్యలోకంలో వినిపించే పేరు సత్యం శంకరమంచి. అంతగా ఆయన జీవితంలో, కథల చరిత్రలో, అమరావతితో ఇవి పెనవేసుకుపోయాయి.

అద్భుతమైన కథాకథన శిల్పం :

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మొదలు ఎందరో మహా కథకులు తెలుగునేలపై సందడి చేశారు. అందులో శంకరమంచి మామంచి కథకుడు. “అల్పాక్షరాల అనల్పార్ధ రచన” అన్నాడు పాల్కురికి సోమనాథుడు. ఆ సూత్రాన్ని అక్షరాలా పాటించినవాడు సత్యం శంకరమంచి.  ఒక్క పేజీ నిడివిలోనే అద్భుతమైన కథాకథన శిల్పాన్ని సృజియించి, తెలుగు సాహిత్యజలధిని ఆశ్చర్యంలో ముంచివేసిన ఆధునిక రచయితను తలచుకుందాం. గుంటూరు జిల్లా అమరావతి (చాపాడు)లో మార్చి 3వ తేదీ, 1937లో శేషమ్మ, కుటుంబరావు దంపతులకు జన్మించాడు. 1987 వ సంవత్సరం మే 21వ తేదీ నాడు, యాభైఏళ్ళ నడి వయస్సులోనే అమరపురికి వెళ్ళిపోయాడు.

కలకాలం భాసించే సాహిత్యం :

జీవించింది తక్కువ కాలమే అయినా, కలకాలం భాసించే సాహిత్య సృష్టి చేసిన ఈయన జీవితం కూడా ఒక పెద్ద కథ. విషాద గాథ. చిన్నతనంలోనే తల్లిదండ్రులు  వెళ్లిపోయారు. బంధువులు సీతమ్మ, పెద పున్నమ్మలు పెంచి పెద్ద చేశారు. ఏలూరు సి ఆర్ రెడ్డి కాలేజీలో బిఏ, ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ ఎల్ బి చదివారు. ఆకాశవాణిలో కొంత కాలం ఉద్యోగం కూడా చేసినట్లు సమాచారం. అనేక కథలు, నవలలు, నాటకాలు, వ్యంగ్య వ్యాసాలు రాశారు. షేక్ జాన్సన్ శాస్త్రి, శారదానాథ్, సాయిరామ్ అనే కలంపేర్లతో వివిధ దిన, వార పత్రికలకు ఎన్నో రచనలు అందించారు. ఏ వ్యాసంగమైనా, దానికి నూటికి నూరు శాతం న్యాయం చేయడం ఆయన నైజం. ఏ రచనైనా, ఏకబిగిన చదివించేట్లు రాయడం ఆయన ప్రతిభాభ్యాసం. ఈ ప్రతిభ, ఈ విలక్షణ రచనాశిల్పం శంకరమంచిని అమరుడిని చేశాయి.

చిన్న స్థలంలో అద్భుతమైన భవనం :

అన్నింటిలోకి తలమానికం “అమరావతి కథలు”. ఇది 100 కథల  సంపుటి. ఏ కథ కూడా ఒక్క పేజీకి మించదు. ఆ చిన్న స్థలంలోనే అద్భుతమైన భవనం నిర్మించిన ఘనత ఆయన సొత్తు. అమరావతి అతనికి బాగా తెలిసిన ఊరు. గడిపిన ఊరు. గాలి పీల్చిన ఊరు. నీరు తాగిన నేల. ఎంతోమంది మనుషులను, మనసులను చూసిన ఊరు. ఆ మట్టి వాసన, ఆ జ్ఞాపకాల నుంచే కథలు అల్లాలని ఎప్పుడో సంకల్పం చేసుకున్నాడు. మస్తిష్కాన్నే పుస్తకంగా చేసుకొని, గుండె గుడిలో కొన్ని కథలు అల్లుకున్నాడు. పురాణం సుబ్రహ్మణ్యశర్మ పూనికతో, వాటిని గుండె నుంచి తీసి, అక్షరబద్ధం చేశాడు. అవి చరిత్ర సృష్టించాయి.

పురాణం ప్రోత్సాహం :

“అమరావతి కథలు ” పేరుతో.. నువ్వు కథలు ఎందుకు రాయకూడదు?’’ అని ఒక సాయంసంధ్య వేళ పురాణంవారు శంకరమంచిని అడిగారు. అప్పటికే తన మనసుపొరలో దాగివున్న నాలుగు కథలను సత్యంగారు ఆశువుగా చెప్పారు. అవి విన్న పురాణంవారు శభాష్  అంటూ ప్రోత్సహించారు. ఆంధ్రజ్యోతి వారపత్రికకు అప్పుడు వారు సంపాదకుడుగా ఉన్నారు. 1975 నుంచి 1977 వరకూ రెండేళ్లపాటు వరుసగా సత్యం శంకరమంచి 100 కథలు రాశారు. ఈ సంపుటికి “అమరావతి కథలు” అని పేరు పెట్టారు. వీటన్నింటికీ బాపు బొమ్మలు వేశారు. సత్యంగారి రచనా శిల్పం -బాపుగారి చిత్ర శిల్పం ఒకదానికొకటి పోటీపడి నడిచాయి. పసిడికి తావి అబ్బిన చందాన ఈ కథలు తెలుగునాట మారుమ్రోగాయి.

పల్లెల అందాలూ, అనుబంధాలు:

చక్కని చిక్కని పచ్చని తెలుగుదనం. పల్లె ప్రజల మాటలు, ఆటలు, పాటలు, రూపాలు, వేషాలు, అనుబంధాలు, భావోద్వేగాలు, రాజకీయాలు, వృత్తులు, ప్రవృత్తులు, స్మృతులు, చమత్ కృతులు ఆన్నింటినీ ఈ కథల్లో గుదిగుచ్చాడు. ఎంతో ఘన చరిత్ర, పురాణ ప్రశస్తి కలిగిన అమరావతి గురించి చెబుతూనే, ఆధునిక పోకడలనూ కథల్లో బొమ్మ కట్టించాడు.అమరావతి వాతావరణం మొత్తాన్ని ఈ సంపుటిలో బిగించాడు. తను చూసిన, విన్న, చదివిన, తెలుసుకున్న కథలు, పాత్రలన్నింటికీ జీవం పోశాడు.ఎక్కువ భాగం యదార్ధ గాథలకే పునఃసృష్టి చేశాడు. వాస్తవ సంఘటనలకు కాల్పనికత జోడించి కమనీయం, రమణీయం చేశాడు. ఈ కథల్లో ఇంత బిగింపు రావడానికి తన రచనా ప్రతిభకు,పరిశోధన కూడా జోడై నిలిచింది.

ఇదీ చదవండి: తెలుగు భాషావేత్త పోరంకి దక్షిణామూర్తి అస్తమయం

రాజు నుంచి పేద వరకూ అందరూ కనిపిస్తారు :

ఈ కథల్లో రాజు నుంచి బిచ్చగాడి వరకూ, కామందు నుంచి కసాయివాడి వరకూ, భక్తుల నుంచి భోక్తల వరకూ, స్వాముల నుంచి లోభుల వరకూ, వర్తకుల నుండి వ్యభిచారుల వరకూ అందరూ పాత్రధారలే. కన్నీళ్లు తెప్పించే సంఘటనలు, కోపాన్ని రగిలించే పాత్రలు, నవ్వుల పువ్వులు పూయించే మాటలు, కొత్త ఆలోచనలను రేకెత్తించే దృశ్యాలు ఆన్నీ ఇక్కడ దర్శనమవుతాయి. మానవత్వం చుట్టూ మూటకట్టుకున్న కథలే ఎక్కువగా ఉన్నాయి. నవరసాలకు ఇక్కడ అక్షరాకృతి జరిగింది. వరద నుంచి మహా రుద్రాభిషేకం వరకూ ఆన్నీ కథలే. ఈ సంపుటి అనేక ముద్రణలకు నోచుకుంది. పాఠకులపై అనేక ముద్రలు వేసింది. ఈ కథలు చదివితే అమరావతిని చూడాలని, గడపాలని, తెలుసుకోవాలనే ఆరాటం ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. శ్యామ్ బెనెగల్ కూడా వారిలో ఒకడే.

ఇదీ చదవండి: విద్యాపిపాసి `కట్టమంచి`

ఎత్తుకున్న వస్తువులన్నీ హత్తుకునేవే :

సత్యం శంకరమంచి ఎంచుకున్న వస్తువు, ఎత్తుకున్న మాటలు ఆన్నీ హత్తుకునేవే. విభిన్న మనస్తత్వాలను చదవడం, వాటిని పాత్రలుగా ప్రవేశపెట్టడం ఒక ఎత్తు. చిన్న చిన్న సంఘటనలు కూడా  ఆయన రచనలో కావ్యగౌరవాన్ని సంతరించుకుంటాయి. ఆధునికత, అభ్యుదయం, మానవత్వం, సరసత్వం నిండిన శిల్పం ఈయనకే చెల్లింది. “వర్ణనా నిపుణః కవి:” అనే ఆలంకారిక సూత్రం ఈయనకు సంపూర్ణంగా సరిపోతుంది. శంకరమంచి సత్యం మాటల మంత్రికుడు. కథాకథన చక్రవర్తి. తెలుగు కథా సాహిత్య చరిత్రలో వీరిదొక ప్రత్యేకమైన అధ్యాయం. ఇంతటి కథకుడు మన తెలుగువాడు కావడం మన భాగ్యం. ఈ కథలు చదివితే తెలుగుదనం, తెలుగు సంస్కృతి, తెలుగు భాష చేరువవుతాయి. ఇటువంటి వారి కృషి వల్ల తెలుగు ఎప్పటికీ దూరమవదనే విశ్వాసం పెరుగుతూనే ఉంటుంది.

(మార్చి 3 సత్యం శంకరమంచి జయంతి)

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles