తిరుపతి : శాసన పరిష్కర్త, చరిత్రకారుడు సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి 135 వ జయంతి తిరుపతిలో ఘనంగా జరిగింది. ముందుగా వారి కాంస్య విగ్రహానికి పుష్పార్చన వైదికంగా నిర్వహించారు. తదనంతరం అన్నమయ్య మందిరంలో శోభాయమానంగా వేడుక సాగింది. తిరుమల దేవాలయాలకు సంబంధించిన చరిత్ర,వైభవం, తాళ్ళపాక కవుల సంకీర్తనా సంపదను జాతికి అందించే యజ్ఞంలో పునీతుడైన మహనీయునిగా సాధు సుబ్రహ్మణ్యశాస్త్రిని తరతరాలు గుర్తుపెట్టుకోవాలని వక్తలందరూ ముక్తకంఠంతో చాటిచెప్పారు.
తిరుమలస్వామికి అంకితమైన ఈ మహనీయ చారిత్రక పురుషుడి చరిత్ర, విశేషాలు పాఠ్యాంశంగా తీసుకురావాలని అందరూ అభిప్రాయపడ్డారు. టీటీడీ అన్నమయ్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ ఉత్సవం జరిగింది. ఈ వేడుకలో సుబ్రహ్మణ్యశాస్త్రి కుమార్తె గిరిజాదేవి, మనుమడు సి ఎస్ ఎన్ మూర్తి పాల్గొనడం విశేషం.
గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్, గోపికృష్ణ, కొప్పరపు శేష శైలేంద్ర, మాశర్మ, అన్నమయ్య ప్రాజెక్టు డైరెక్టర్ విభీషణశర్మ, టీటీడీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ దూసి నృసింహ కిషోర్, ఆచార్య డి.వి.జి.ఎ సోమయాజులు తదితరులు ఈ వేడుకలో భాగస్వాములయ్యారు.
డాక్టర్ విభీషణశర్మ నిర్వాహకులుగా, అధ్యక్షులుగా వ్యవహరించారు.
పెద్ద సంఖ్యలో పురప్రముఖులు, విద్యార్థులు హాజరైన ఈ సంబరం ఆద్యంతం కన్నులపండువగా జరిగింది.