ఒక్క దేవకాకులే కాదు
పక్షులన్నీ పురాత్మా బంధువులే!
మనల్ని పలకరించను చేరవచ్చిన
మన్వంతరాల పురందరులే!
పిగిలిపిట్టని మనం పరదేశి అనుకుంటాం
శాంతి సంగాతిగా చూసిందెప్పుడు?
గుడ్డికొంగను దెయ్యం పక్కిగా భావిస్తాం
సౌజన్యరథసారథిగా లెక్కించిందెప్పుడు?
నల్ల చిలువ నల్లనిదే అయినా
నల్లన్నయ్యంత చల్లని గుండెల తండ్రి
ఎర్ర తీతువు అందాల చిందులన్నీ
సంసార పక్షమైన సుఖసామ్రాజ్య దీపావళులే
కొమ్మాకొమ్మా జీవన హోమంలో
పచ్చని చిరునవ్వుల ఆజ్యం పోస్తాయి
రెమ్మా రెమ్మా సంతాన జ్యోతి యాత్రలో
నవపల్లవ దీపాలు వెలిగిస్తాయి..
ఎన్ని ప్రబంధాలో, ఎన్ని ప్రణయాలో
ప్రతి కొమ్మా వాత్సాయన శిబిరం
ప్రతి గూడు ప్రణవోత్ధాన ముఖరం
సృష్టిలేదు, వృష్టిలేదు, వ్యష్టిలేదు
సంసార సుఖం వినా విశ్వ వృద్ధి లేదు
మనిషికి సంతానమే కాలబీజం
పక్షికి అండమే చైతన్య తేజం
విత్తు నుంచి చెట్టు, చెట్టు నుంచి విత్తు
విశ్వవ్యాప్తికి మొదటి మెట్టు
వలస పక్షుల సంతాన యజ్ఞానికి
యాగ వేదిక పరిఢవిల్లిన కడప చెట్టు
చెట్టు ప్రకృతి ఎగరేసిన పచ్చని జెండా
చెట్టే అలిసిన ప్రాణి కోటి అండ
సముద్రాలు దాటిన పరదేశి పక్షులకి
చెట్టే ప్రణయ సంగమాలయం
అనురాగం మరవని అండజతతికి
చెట్టే సృష్టిరహస్య దేవాలయం..!!
Also read: ఫ్లెమింగో-9
Also read: ఫ్లెమింగో-8
Also read: ఫ్లెమింగో-7
Also read: ఫ్లెమింగో – 6