- ఆటగాళ్ల మొర వినిపించిన కెప్టెన్ కొహ్లీ
- వన్డేలు అవసరమా అంటూ ప్రశ్నించిన విరాట్
భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ మరోసారి సహఆటగాళ్ల తరపున గొంతు విప్పాడు. ఇంగ్లండ్ తో తీన్మార్ వన్డే సిరీస్ లో తమజట్టు విజేతగా నిలిచిన అనంతరం కెప్టెన్ కొహ్లీ తన అభిప్రాయాలను మీడియా ద్వారా క్రికెట్ పెద్దలకు విన్నవించుకొన్నాడు.
అటు కరోనా…ఇటు బయోబబుల్…
కరోనా వైరస్ జోరుతో గత ఏడాది మార్చి నెల నుంచి క్రికెట్ కు దూరంగా ఉండడంతో పాటు ఇంటిపట్టునే ఉంటూ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడిపోయిన భారత స్టార్ క్రికెటర్లంతా ఇప్పుడు తాము మితిమీరిన క్రికెట్ ఆడేస్తున్నామంటూ వాపోతున్నారు.
గల్ఫ్ దేశాలు వేదికగా జరిగిన ఆరువారాల ఐపీఎల్ 13వ సీజన్లో పాల్గొన్న నాటినుంచి తమకు విశ్రాంతి అనేది లేకుండాపోయిందని, క్రిమిరహిత బయోబబుల్ వాతావరణంలో వారాలు, నెలలపాటు గడపటం ఆటగాళ్ల సహనానికి పరీక్షగా నిలుస్తోందని, మానసికంగా బలంగా ఉన్న ఆటగాళ్లు బయోబబుల్ వాతావరణానికి అలవాటు పడినా బలహీనమైన ఆటగాళ్లు మాత్రం బర్నవుట్ అయ్యే ప్రమాదం ఉందని భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ హెచ్చరించాడు.
Also Read: మ్యాచ్ విన్నర్ల జట్టు భారత్
బబుల్ లో సిరీస్ వెంట సిరీస్…
గత ఐపీఎల్ సీజన్ ముగిసిన వారం రోజుల తర్వాత నుంచే తాము విదేశీ టూర్ కోసం ఆస్ట్ర్రేలియా వెళ్లి ఆరునుంచి ఎనిమిదివారాలపాటు బయోబబుల్ వాతావరణంలో గడిపి వచ్చామని, ఆ తర్వాత స్వదేశీ సిరీస్ లో ఇంగ్లండ్ తో నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్, 5 మ్యాచ్ ల టీ-20 సిరీస్, మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ ల్లో పాల్గొన్నామని ఇప్పుడు ఐపీఎల్ 2021 సీజన్ కు సిద్ధమయ్యామని వివరించాడు.
Also Read: విజయం మాది…అవార్డులు వారికా?
అంతర్జాతీయ,జాతీయ క్రికెట్ క్యాలెండర్ ను ఖరారు చేసే సమయంలో ఆటగాళ్లనూ దృష్టిలో పెట్టుకోవాలని భారత కెప్టెన్ సూచించాడు. గత కొద్దిమాసాల కాలంలో తమజట్టు ఎనిమిది టెస్టులు, ఆరు వన్డేలు, ఆరు టీ-20 మ్యాచ్ ల్లో పాల్గొని ఇప్పుడు ఏడువారాల ఐపీఎల్ కు సిద్ధంగా ఉందని, ఊపిరిసలుపని క్రికెట్ షెడ్యూల్ ఆటగాళ్ల శారీరక,మానసిక పరిస్థితికి పరీక్షగా మారిందని వివరించాడు.కరోనా వైరస్ నేపథ్యం, ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల్లో అదీ బయోబబుల్ వాతావరణంలో క్రికెట్ సిరీస్ లు ఆడటం సహనానికే పరీక్ష అనడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పాడు.
వన్డే సిరీస్ లు అవసరమా?
ప్రపంచ క్రికెట్లోని ప్రధానజట్లన్నీ ఐసీసీటెస్టు లీగ్, భారత్ వేదికగా జరిగే టీ-20 ప్రపంచకప్ టోర్నీలపైనే దృష్టి పెట్టి టెస్టు, టీ-20 సిరీస్ లకే ప్రాధాన్యమిస్తుంటే ఏమాత్రం ప్రాధాన్యం లేని వన్డే సిరీస్ ల అవసరం ఏమొచ్చిందని భారత కెప్టెన్ ప్రశ్నించాడు. ఇంగ్లండ్ తో నాలుగుమ్యాచ్ ల టెస్టు, ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ వరకూ బాగానే ఉందని,తీన్మార్ వన్డే సిరీస్ వల్ల ప్రయోజనం ఏమిటంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
యువఆటగాళ్ళకు కితాబు…
గత కొద్దిమాసాలుగా భారత్ ఆడిన ఎనిమిదిటెస్టులు, ఆరువన్డేలు, ఆరు టీ-20 మ్యాచ్ ల ద్వారా అరంగేట్రం చేసిన భారత యువఆటగాళ్లంతా అంచనాలకు మించి రాణించారని, అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొన్నారని కొనియాడాడు. వన్డే క్రికెట్లో 380కి పైగా స్కోర్లు సాధించే సత్తా భారత బ్యాటింగ్ లైనప్ కు ఉందని కొహ్లీ గుర్తు చేశాడు.
ఏప్రిల్ రెండోవారంనుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ తర్వాత భారతజట్టు మాంచెస్టర్ వేదికగా జరిగే టెస్టు లీగ్ ఫైనల్స్ తో పాటు అక్టోబర్-నవంబర్ మాసాలలో జరిగే 2021 టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనాల్సి ఉంది.
Also Read: అయ్యర్ కు విదేశీ లీగ్ చాన్స్