బిల్కిస్ బానో పైన సామూహిక అత్యాచారం చేసి, ఆమె మూడు సంవత్సరాల బాలికనూ, మరో 13 మంది కుటుంబసభ్యులనూ హత్య చేసిన నేరానికి జైలులో శిక్ష అనుభవిస్తున్న 11 మంది హంతకులను విడిచిపెట్టవలసిందిగా గుజరాత్ ప్రభుత్వ సంఘం సిఫార్సు చేయడం, ఆ సిఫార్సు అమలు జరగడం అన్యాయం మాత్రమే కాదు రాజకీయంగా చాలా ప్రమాదకరమైన చర్య. ‘ఇదేనా న్యాయం అంటే?’ అని బిల్కిస్ బానో అడిగిన ప్రశ్న ప్రజాస్వామ్యవాదుల చెవుల్లో మార్మోగుతోంది. మతోన్మాదం ఎంతగా ప్రబలిందో చెప్పడానికి ఈ ప్రశ్నకు స్పందన అంతగా లేకపోవడం ఒక ఉదాహరణ. 1992నాటి విధానం ప్రకారం శిక్షను తగ్గించామని గుజరాత్ సర్కార్ వాదిస్తున్నది. 1992నాటి విధానాన్ని మార్చి కొత్త విధానం అమలు చేస్తున్న తరుణంలో పాత విధానాన్ని అమలు చేస్తామనడంలోని విజ్ఞత ఏమిటో అర్థంకాదు.
భయంకరమైన అత్యాచారం చేసినవారికి శిక్ష తగ్గింపు కుదరదంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శక సూత్రాలు స్పష్టం చేస్తున్నాయి. విచక్షణాధికారాలను వినియోగించుకున్నట్టు ప్రభుత్వం చేస్తున్న వాదనలో పసలేదు. అన్యాయం చేయడానికీ, హంతకులకు క్షమాభిక్ష పెట్టడానికి అధికారాలను వినియోగించుకుంటామనడం మానవీయత ఎట్లా అవుతుంది? ‘నారీమణులను గౌరవించాలి’ అంటూ ఎర్రకోట నుంచి దేశపౌరులకు ప్రధాని నరేంద్రమోదీ ఆగస్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవ సందేశంలో ఉద్ఘాటించిన తర్వాత కొన్ని గంటలలోనే హంతకులనూ, అత్యాచారం చేసినవారినీ విడుదల చేయడం విశేషం. విడుదల చేయాలన్న నిర్ణయాన్ని తిరగదోడాలని ప్రధాని ఆదేశించవచ్చు. ఎవరైనా పిటిషన్ దాఖలు చేస్తే అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవచ్చు. ఇవేవీ జరగకపోయినా ఆశ్చర్యం లేదు. దేశంలోపరిస్థితులు అట్లా ఉన్నాయి.
గుజరాత్ లో 2002లో గోధ్రా ఘోరం జరిగిన అనంతరం సంభవించిన ముస్లింల ఊచకోత కార్యక్రమంలో చాలామంది మరణించారు. అనేకమంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి. కానీ బిల్కిస్ బానో సంగతి మాత్రం అత్యంత విషాదకరమైనది. నేరం జరిగినట్టు స్పష్టంగా నిరూపించారు. ఎవరు చేశారో కూడా అనుమానం లేకుండా నిర్ధారించారు. ఒక గర్భిణీ స్త్రీపైన అత్యాచారం చేయడం, ఆమె చేతిలో ఉన్నమూడేళ్ళ పసి కందును నేలకేసికొట్టి చంపివేయడం, ఆమె కుటుంబంలో మిగిలిన పదకొండు మందిని హత్యచేయడం ఘోరాతిఘోరమైన రాక్షసక్రీడ అనడంలో అతిశయోక్తి లేదు.
ఈ నేపథ్యంలో బిల్కిస్ బానో అసాధారణమైన సాహసం ప్రదర్శించింది. నేరారోపణ, నిరూపణ వంటి అంశాలలో ఎంతో శ్రమకోర్చి సాక్ష్యాధారాలు సేకరించింది. హక్కుల కార్యకర్తల, న్యాయవాదుల సహకారం తీసుకున్నది. ఇదంతా తనకు ప్రతికూలంగా ఉండిన రాజకీయవాతావరణంలో, తనకు వస్తున్న బెదిరింపులను లెక్కపెట్టకుండా, ఆర్థిక కష్టాలను అధిగమిస్తూ చేయడం అంటే మాటలు కాదు. అటువంటి మహిళ ఉండే ప్రాంతంలోకే పదకొండు మంది హంతకులు గుజరాత్ ప్రభుత్వ క్షమాభిక్ష కారణంగా విడుదలై ప్రవేశించిన విషయం ఆమెకు ఎవ్వరూ చెప్పలేదు. ముందస్తు సమాచారం లేకుండా పిడుగువంటి వార్త తెలుసుకొని ఆమె గుండె బేజారైంది. ‘నాకు నిర్భయంగా బతికే వాతావరణం కల్పించండి,’ అంటూ ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేసింది.
లోగడ1984లో సిక్కుల ఊచకోత కావచ్చు, గోధ్రా విషాదం కావచ్చు, గుజరాత్ అల్లర్లు కావచ్చు, నేరం చేసినవారిలో కొందరినే పట్టుకున్నారు. కోర్టుబోను ఎక్కించారు. చాలామంది తప్పించుకున్నారు. చట్టానికి దొరికిన ఈ కొద్దిమంది కూడా కొన్ని ఎంజీవోలూ, హక్కుల కార్యకర్తలూ, కాంగ్రెస్ పార్టీ పెద్దలూ, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కారణంగా దొరికారనే అభిప్రాయం ప్రజలలో బలంగా ఉంది. ఇది ఒక భయంకరమైన వాదన. చట్టానికి నేరస్థులను అప్పగించడమే ఒక కుట్ర అనే సిద్ధాంతాన్ని బీజేపీ ప్రచారం చేస్తూ వచ్చింది. 1984లో సిక్కుల ఊచకోత ఘటనపైన బీజేపీ వాదం వేరు. గుజరాత్ అల్లర్లపైన బీజేపీ వైఖరి దానికి పూర్తిగా విరుద్ధం. అక్కడ ప్రతిపక్ష పాత్ర. ఇక్కడ అధికార పక్షం. ప్రాణాలతో చెలగాటం అంటే ఇదే. అక్కడ హతులవైపు, ఇక్కడ హంతకులవైపు. ఇదెక్కడి న్యాయం? బీజేపీ వాదనను తలకెక్కించుకున్న ప్రజలు అధిక సంఖ్యాకులు దేశంలో ఉన్నారు కనుకనే బిల్కిస్ బానో దీనారావం ఎక్కువ మందిని కదిలించలేదు. పైగా జైలు నుంచి విడుదలైనవారికి కుంకుమ పెట్టి, లడ్డూలు తినిపించి, పాదనమస్కారం చేసి స్వాగతం చెప్పే ‘సంస్కారవంతులు’ ఈ దేశంలో ఉన్నారంటే పౌరులు సిగ్గుతో తల దించుకోవలసిన పరిస్థితి.