- భాగస్వామి పక్షాన్ని మరోసారి మార్చిన నితీశ్
- తనను కొట్టక మునుపే తానే కొట్టిన ముఖ్యమంత్రి
- నీతిమాలిన రాజకీయాలలో నువ్వా-నేనా?
రాజకీయ చదరంగానికి తాజాగా బీహార్ వేదికయ్యింది. మహారాష్ట్రలో ఇంకా ఆట సాగుతూనే ఉంది. ప్రస్తుతానికి బిజెపి – శివసేన చీలిక నేత షిండే పైఎత్తున ఉన్నారు. బీహార్ ఆటలో నితీశ్ కుమార్ గెలుపుగుర్రమెక్కారు.అందరిదీ ఒకటే ఎత్తు. అంతరంగం కూడా ఒకటే..అధికారపీఠంపై కలకాలం తామే ఉండాలి. ఇంతకు మించిన వేరే సిద్ధాంతం ఏమీ లేదు. సైద్ధాంతిక సారూప్యాలు, వైవిధ్యాలు అనేవి నంగనాచి మాటలు, నీటిపై రాతలు. ఈ పరిణామాలు, ఫలితాలు చూస్తుంటే తప్పంతా ఓటర్ల చేతిలోనే వుందని అనుకోవాలి. ఇటువంటి ప్రబుద్ధులకు ఓటేసి గెలిపించడమే ప్రారబ్ధం. నాయకులు, పార్టీలు ఎన్నికల వేళ ఒక పక్షంలో, ఆ తర్వాత మరోపక్షంలోకి మారిపోతున్నారు. ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో, ఏ ఏ పార్టీల మధ్య సంకీర్ణవికీర్ణాలు ఉంటాయో తెలిపే కాలజ్ఞనం ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు. గతంలో మరాఠాభూమిపై ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో ఏర్పడిన సంకీర్ణమే అక్రమ సంబంధంగా అభివర్ణించారు. ఇప్పుడు రెండుగా చీలిపోయిన షిండే శివసేన – బిజెపి బంధానికి ఏపేరు పెట్టాలో అర్ధంకాక విశ్లేషకులు తికమకపడుతున్నారు.
Also read: వెంకయ్యకు ఘనంగా వీడ్కోలు
మళ్ళీ మహాగట్బంధన్
తాజాగా బీహార్ లో ఆర్జేడి, కాంగ్రెస్ సహా 7 పార్టీల ‘మహా ఘట్బంధన్’
కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బిజెపితో తెగతెంపులు చేసుకొని వీరితో కలిసిన నితీశ్ కుమార్ మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. నిన్నటి దాకా కూడా ఆయనే ఉన్నాడన్న సంగతి తెలిసిందే. తెలియంది ఏంటంటే తన ముఖ్యమంత్రి కుర్చీఆటలో ఎప్పుడు ఎవరితో జతకలుస్తారో మనకు అంతుచిక్కక పోవడం! ఈ జంపింగ్ గేమ్ కు కారణం బిజెపి అని ఆయన విమర్శలు చేస్తున్నారు. మొదటి నుంచీ నితీశ్ పై బిజెపికి నమ్మకం లేదు. బిజెపిపై నితీశ్ కు నమ్మకం లేదు. అవసరార్ధం రాజకీయ స్వార్థం పునాదులపై కలిశారు, అదే పునాదిపై మళ్ళీ విడిపోయారు. ఇవేమీ నితీశ్ కు కొత్త కాదు. ముందుగా, అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ ను జాతీయ స్థాయిలో దెబ్బతీయడంలో బిజెపి ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఒక్కొక్క రాష్ట్రంలో అధికారాన్ని లాక్కుంటూ అన్ని చోట్లా దెబ్బతీయడంలో చాలావరకూ విజయం సాధించింది. కాంగ్రెస్ కు చెప్పుకోడానికి రాజస్థాన్, ఛత్తీస్ గడ్ తప్ప ఇంకెక్కడా అధికారం లేదు. నితీశ్ రూపంలో ఇప్పుడు బీహార్ లో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్యురాలైంది. ఈ ముచ్చట ఎంతకాలం ఉంటుందో కూడా చెప్పలేం. కాంగ్రెస్ పార్టీ ఇలా పతనం కావడంలో మోదీ -అమిత్ షా సారథ్యంలోని బిజెపి ప్రధానమైన కారణమైతే, స్వయంకృత అపరాధాలు మరో ముఖ్య హేతువులు. కాంగ్రెస్ పార్టీని తుడిచిపెడుతూ ముందుకు సాగుతున్న బిజెపి ప్రాంతీయ పార్టీలపైన కూడా బాణాలను ఎక్కుపెట్టింది. తనతో కలుపుకొని తన దొడ్లో కట్టేసుకుంటూ, అదయ్యాక వాటిని బలహీనపరుస్తూ, ఆ యా పార్టీల్లో చీలికలను సృష్టిస్తూ.. ఇలా… పరిపరి విధాలుగా ప్రాంతీయ పార్టీలను కూడా తొక్కేసి పైకి రావాలని, దేశమంతటా అన్ని స్థాయిల్లో బిజెపి మాత్రమే ఉండాలనే మహాసంకల్పంతో బలంగా ముందుకు వెళ్తోంది. ఆంధ్రప్రదేశ్ లో వై సీ పీ, ఒరిస్సాలో బిజూ జనతా దళ్ తటస్థంగా ఉన్నాయి. బిజెడి అధినేత నవీన్ పట్నాయక్ ఒక్కొక్క సందర్భంలో సొంత గొంతు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయనతో బిజెపికి ఎటువంటి ముప్పు లేదు. నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ అధికారంలోకి రావడానికి బిజెపి తీవ్రంగానే ప్రయత్నం చేసింది. ఆంధ్రప్రదేశ్ లో జగన్ – మోదీ బంధం బాగానే సాగుతోంది. గత ఎన్నికలకు కాస్త ముందు నుంచీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు – ప్రధాని నరేంద్రమోదీ మధ్య దూరం బాగా పెరిగింది. అనేక కారణాల వల్ల క్షేత్రస్థాయిలో బలమైన పునాదులున్న తెలుగుదేశం ఘోరంగా దెబ్బతింది. మోదీతో తిరిగి మళ్ళీ ప్రయాణం చేయడానికి చంద్రబాబు ఉవ్విళ్లూరుతున్నట్లు కనిపిస్తోంది.
Also read: ‘గురు’త్వాకర్షణశక్తి చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి
ప్రాంతీయ పార్టీలకు పొంచి ఉన్న ప్రమాదం
గతంలో వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ, సార్వత్రిక ఎన్నికల్లోనూ బిజెపిని దెబ్బకొట్టాలని, నరేంద్రమోదీని గద్దె దింపాలని చంద్రబాబు కాలికి బలపం కట్టుకొని దిల్లీ మొదలు చాలా చోట్ల తిరిగారు. ఇప్పుడు తాను అధికారంలోకి రావడానికి, కుమారుడు లోకేష్ కు పటిష్ఠమైన రాజకీయ భవిష్యత్తు నిర్మించి ఇవ్వడానికి, వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎలాగైనా గద్దెదింపడానికి మోదీకి దగ్గరయ్యే తీవ్ర ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారు. తమిళనాడులోనూ విపక్షాలు గందరగోళమైన పరిస్థితిలో ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతీయ పార్టీల ఉనికి ప్రశ్నార్ధకంగానే ఉంది. తెలంగాణలో బలమైన ప్రాంతీయ పార్టీ టీ ఆర్ ఎస్ ను గద్దెదింపి అధికారంలోకి రావాలని బిజెపి శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. అనేక కారణాలతో ఎన్ డీ ఏ భాగస్వామ్యం నుంచి చాలా పార్టీలు బయటకు వచ్చాయి. మళ్ళీ కలవాలని కొన్ని పార్టీలు చూస్తున్నాయి. ఈ చదరంగంలో బీహార్ సాక్షిగా బిజెపికి పెద్దదెబ్బ కొట్టామని, 2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి తమ బలం పెరుగుతుందనే విశ్వాసంలో కాంగ్రెస్ సహా కొన్ని ప్రాంతీయ పార్టీలు, విపక్షాలు ఉన్నాయి. ఎప్పటికీ గెలుపుమాదే అనే అచంచలమైన విశ్వాసంలో బిజెపి ఉంది. మొత్తంగా రాజకీయ క్షేత్రంలో విలువలకు తిలోదకాలు ఇచ్చే దుష్ట సంస్కృతి ఆకాశమంత ఎత్తులో ఎగిరి కూర్చుంది. రాజనీతిజ్ఞత అనే మాట పూర్తిగా అటకెక్కింది. ఓటర్లు చైతన్యం కానంత కాలం రాజకీయాలు మారవు. బీహార్, మహారాష్ట్ర వంటి చోట్ల జరిగిన పరిణామాలే తాజా ఉదాహరణలు.
Also read: మణిపూర్ లో మంటలు రగిల్చిన విద్యార్థులు