Thursday, December 26, 2024

అధికార, ప్రతిపక్ష కూటమల సమాయత్తం

కె. రామచంద్రమూర్తి

బిహార్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. తొలి దశ పోలింగ్ అక్టోబర్ 24న, మలి దశ నవంబర్ 3న, తుది దశ నవంబర్ 7న జరుగుతాయనీ, ఫలితాలు నవంబర్ 10న వెల్లడి అవుతాయనీ ఎన్నికల సంఘ శనివారంనాడు ప్రకటించింది. జేడీయూ, బీజేపీ, ఎల్జీపీలు కలసి ఎన్ డీ ఏ కూటమిగా అధికారంలో ఉన్నాయి. ప్రతిపక్షాలు ఒకే తాటిమీదికి రావాలని ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల తేదీలు ఖరారు కావడంతో కూటముల నిర్మాణంపైన నాయకుల శ్రద్ధ చూపుతున్నారు.

కడచిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో (2015) జేడీయూ, ఆర్ జేడీ, కాంగ్రెస్ పార్టీ కలసి మహకూటమిగా ఏర్పడి ఎన్నికలలో పోటీ చేశాయి. బీజేపీని చిత్తుగా ఓడించాయి. మహాకూటమికి 178 స్థానాలు రాగా బీజేపీ నాయకత్వంలోని ఎన్ డీ ఏ కూటమికి 59 స్థానాలు లభించాయి. ఇతరులకు ఆరు స్థానాలు దక్కాయి. బిహార్ లో 2014 లోక్ సభ ఎన్నికలలో ఘనవిజయం సాధించిన బీజేపీ 2015 అసెంబ్లీ ఎన్నికలలో మట్టికరిచింది. బిహార్ ఓటమి అనంతరం ఉత్తరప్రదేశ్ లోనూ, గుజరాత్ లోనూ, త్రిపురలోనూ విజయాలు సాధించింది. కానీ దిల్లీ, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, కేరళ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలలో బీజేపీ ఓడిపోయింది. అయినా సరే, ప్రతిపక్ష కూటమి ప్రభుత్వాన్ని బిహార్ లో పడగొట్టి, కూటమిని చీల్చి, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను సుముఖం చేసుకొని ఎన్ డీ ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వాన్ని సాగనంపి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించి యడ్యూరప్ప నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  ఆ తర్వాత మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్యసింధియాను కాంగ్రెస్ నుంచి తనవైపునకు తిప్పుకొని కమల్ నాథ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి నాలుగో సారి శివరాజ్ సింహ్ చౌహాన్ ప్రభుత్వాన్ని నెలకొల్పింది. రాజస్థాన్ లో సచిన్ పైలట్ కు ఆశచూపించి, వసుంధరే రాజే సహకరించకపోవడంతో గెల్హాట్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలకు స్వస్తి చెప్పింది. ప్రయత్నమైతే గట్టిగానే చేసింది. పరిస్థితులు కలిసి రాలేదు. గెల్హాట్ అనూహ్యంగా గట్టిగా, సమర్థంగా ప్రతిఘటించారు.

ఈ సారి బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో గెలుపొందాలని బీజేపీ నాయకత్వం గట్టిగా కోరుకుంటున్నది. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీ చాలా పట్టుదలగా ఉన్నారు. ఆయన ఎన్నికల ప్రచారం పరోక్షంగా ప్రారంభించారు. బిహార్ లో రూ. 16,000 కోట్లు ఖర్చు తో కూడుకున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆరంభించారు. ప్రధాని ప్రాబల్యం బిహార్ లో బాగానే ఉన్నదని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. అయితే, దేశ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఒక వైపు ఆర్థకరంగం అడుగంటిపోతోంది. భారత్ –చైనా సరిహద్దులో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దూకుడుమీద ఉన్నది. కోవిద్ మహమ్మారిని అదుపు చేయడంలో ప్రభుత్వాలు విఫలమైనాయనే అభిప్రాయం జనబాహుళ్యంలో ఉన్నది.

ఈ నేపథ్యంలో కేంద్రంలోని ఎన్ డీ ఏ ప్రభుత్వం మూడు వ్యవసాయ సంబంధమైన బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టి అనుమానాస్పదమైన, వివాదాస్పదమైన రీతిలో ఆమోదం పొందింది. వ్యవసాయ బిల్లుల పట్ల ఉత్తరాది రైతులు ఆందోళన చేస్తున్నారు. పంజాబ్, హరియాణా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ లలో రైతులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తమకు ఏటా లభించే కనీస మద్దతు ధర ఎగగొట్టే దురాలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నదనీ, వ్యవసాయాన్ని అంబానీలకూ, అదానీలకూ కట్టిబెట్టడానికి మోదీ ప్రణాళిక వేసుకున్నాడనీ, వ్యవసాయ సంస్కరణల పేరుతో రైతులను నిలువునా ముంచడానికి మోదీ ప్రయత్నిస్తున్నారనీ కొన్ని రాష్ట్రాలలో రైతులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ బిల్లుల పట్ల వ్యతిరేకత అన్ని రాష్ట్రాలలో వ్యక్తం కాలేదు. కొన్ని ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైనది.

వ్యవసాయసంస్కరణలకు పరీక్ష

వ్యవసాయ బిల్లులలో ఎటువంటి ప్రతిపాదనలు చేశారో అటువంటి చర్యలు బిహార్ లో 2006 నుంచి అమలులో ఉన్నాయి కనుక బిహార్ రైతాంగం కేంద్రం పట్ల ఆగ్రహంతో ఉండే అవకాశం లేదని బీజేపీ నాయకత్వం అభిప్రాయం. బీజేపీ పట్ల పట్టణాలలోనూ, అగ్రవర్ణాలలో సానుకూలత ఉన్నది.  ఈ వ్యవసాయ సంస్కరణలపైన ఉధృతంగా ప్రచారం చేసి బిహార్ గ్రామీణ ప్రాంతాలనూ, ముఖ్యంగా రైతుల హృదయాలనూ గెలుచుకోవాలని బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తున్నది.

నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీ-యూతో సఖ్యత బీజేపీకి అవసరం. అందుకే బీజేపీ కంటే ఎక్కువ స్థానాలకు జేడీ-యూ పోటీ చేయడానికి ఒప్పుకోవాలనీ, తన నాయకత్వంలో ప్రచారం సాగాలనీ నితీష్ కుమార్ పెట్టిన షరతులకు తాత్కాలికంగా బీజేపీ నాయకత్వం ఒప్పుకున్నది. అయితే, ఇప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉంటూ వచ్చిన నితీష్ కుమార్ అంటే జనానికి మొహం మొత్తిందనీ, కొత్త మొహాన్ని జనం కోరుకుంటున్నారనీ, కొత్తదనాన్ని ఆహ్వానిస్తున్నారనీ బీజేపీ నాయకులే అంటున్నారు. మూడు టరమ్ ల యాంటీ-ఇంకంబెన్సీని (అధికారంలో ఉన్నవారి పట్ల ఉండే విముఖతను) తట్టుకొని గెలవడం అంత తేలిక కాదని అంటున్నారు.

మోదీ పేరు మీదనే ప్రచారం

నితీష్ కుమార్ పట్ల వ్యతిరేకత కనిపిస్తున్నది కనుక కేంద్ర పథకాలపైన ప్రచారం చేయాలనీ, మోదీ ప్రధానంగా ప్రచారం సాగిస్తే కానీ ఈ సారి గట్టెక్కలేమని బీజేపీ నాయకులు అంటున్నారు. అందుకు బీజేపీ, జేడీ-యూలు చెరి వంద స్థానాలకూ పోటీ చేయడం సమంజసంగా ఉంటుందని బీజేపీ నాయకులు అంటున్నారు. రాం విలాస్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జన శక్తి పార్టీ (ఎల్ జే పీ) దూకుడుగా ఉంది. తండ్రి చేతిలోనుంచి చిరాగ్ పశ్వాన్ పార్టీ పగ్గాలు తీసుకున్నాడు. తమ పార్టీకి కేటాయించే సీట్ల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తున్నాడు. జేడీ –యూ అడిగే సీట్ల సంఖ్యను తగ్గించడం. జూనియర్ పాశ్వాన్ ను అదుపులో ఉంచడం, కొత్త పార్టీలను కూటమిలోకి ఆహ్వానించి వాటికి కూడా గౌరవప్రదమైన రీతిలో సీట్లు కేటాయించడం ఎట్లా అనేది బీజేపీ నాయకత్వం ఎదుట ఉన్న సవాలు. సినిమా హీరో సుశాంత్ సింగ్ మరణాన్ని ఉపయోగించుకొని బిహారీ అస్మితను ప్రేరేపించి ఎన్నికలలో లబ్ధిపొందాలని జేడీయూ, బీజేపీ ఆలోచిస్తున్నాయి. నితీష్ కుమార్, ఉపముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు సుశీల్ మోదీలు సుశాంత్ వివాదాన్ని ఇంతవరకూ బాగా వినియోగించుకున్నారు. బిహార్, మహారాష్ట్రల మధ్య వివాదంగా మార్చారు. మహారాష్ట్రలో ఇప్పట్లో ఎన్నికలు లేవు. కనుక బిహార్ వైపు మొత్తం బీజేపీ నిలబడినట్టూ, బిహార్ అస్మిత కోసం పాకులాడుతున్నట్టూ ప్రచారం చేయడంలోని ఉద్దేశం ఇదే.

ఎన్ డీ ఏకి అనుకూలించే  అవకాశం కలిగిన మరో అంశం కూడా ఉన్నది. ఆర్ జేడీలో మొదటి నుంచీ ఉంటూ వచ్చిన నాయకుడూ, లాలూ ప్రసాద్ యాదవ్ కి అత్యంత సన్నిహితుడూ అయిన రఘువంశ ప్రసాద్ సింగ్ దిల్లీలో మరణించడానికి మూడు రోజుల ముందు పార్టీ నుంచి వైదొలుగుతూ తన రాజీనామా పత్రాన్ని జైలులో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ కు పంపించారు. లాలూకు రాసిన లేఖలో పలు ఆరోపణలు చేశారు. బిహార్ అభివృద్ధి గురించి ఆందోళన వెలిబుచ్చతూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు కూడా లేఖలు రాశారు. చనిపోయిన రఘువంశప్రసాద్ ను ఎట్లా ఉపయోగించుకోవాలో బీజేపీ, జేడీ-యూ నాయకులు సమాలోచనలు జరుపుతారు.

ప్రతిపక్ష కూటమిలో సర్దుబాట్లు

జేడీ-యూ అడుగుతున్న సీట్లను తగ్గించడం, జేఎల్ పీ యువనాయకుడు చిరాగ్ కు కళ్లెం వేయడం, బీజేపీ నాయకుల ఒత్తిళ్ళను తట్టుకొని సరైన అభ్యర్థులను ఎంపిక చేయడం బీజేపీ నాయకత్వం ఎదుట ఉన్న సవాళ్ళు. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ అధికారపక్షమైన ఎన్ డీ ఏకి ప్రతిపక్ష గ్రాండ్ అలయెన్స్ పైన ఆధిక్యం ఉన్నదనే అభిప్రాయం బీజేపీ నేతలలో కనిపిస్తున్నది.

ప్రతిపక్షం సమైక్యంగా ఉండటం చాలా అవసరం. ప్రతిపక్షాలన్నీ కలసికట్టుగా పోరాడితేనే నితీష్ కుమార్ నాయకత్వంలోని ఎన్ డీ ఏని ఓడించడం సాధ్యం అవుతుందని బిహార్ లో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠాన ప్రతినిధి శక్తీసిన్హ్ గోహిల్ పదేపదే చెబుతున్నారు. ప్రతిపక్షానికి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే ప్రశ్న వినిపిస్తోంది. ఆర్ జేడీ యువనాయకుడు తేజశ్వి యాదవ్ నాయకత్వం తనకు ఏ మాత్రం సమ్మతం కాదంటూ రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ ఎల్ ఎస్ పీ) నాయకుడు ఉపేంద్ర కుష్వాహా ప్రకటించారు. ప్రతిపక్షంతో పొత్తు కుదరకపోతే, తనకు సంతృప్తికరంగా సమాలోచనలు జరగకుండా ఉంటే తన పార్టీ అసెంబ్లీలోని మొత్తం 243 స్థానాలకూ పోటీ చేస్తుందని కూడా హెచ్చరించారు. కష్వాహా కేంద్ర మంత్రిగా ఎన్ డీ ఏ సర్కార్ లో పనిచేశారు. ఎన్ డీ ఏ అంతర్గత వ్యవహారాలు సైతం తెలుసు. ఆయనతో గోహిల్ సమాలోచనలు జరుపుతున్నారు. అయితే, ఆర్జేడీ ఇప్పటికే తేజశ్వికి పట్టంకట్టాలని తీర్మానించింది. ఆర్జేడీకి తన నాయకుడి పేరును ప్రకటించుకునే స్వేచ్ఛ ఉన్నదనీ, ఎన్నికల ముందు నాయకత్వ సమస్యపైన కూటమి సభ్యులు చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారనీ గోహిల్ వ్యాఖ్యానించారు.

కుష్వాహాపైన అనుమానాలు

తేజశ్వి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం పట్ల ఆర్జేడీ పట్టుదలకు పోతే ఉపేంద్ర కుష్వాహా మహాకూటమిలో కొనసాగే అవకాశాలు లేవు. మొత్తం 243 స్థానాలలోనూ 140 స్థానాలకు మహాకూటమిలో పెద్ద పార్టీ అయిన ఆర్జేడీ అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉంది. సుమారు 90 స్థానాలకు పోటీ చేయాలని పట్టుపడుతున్న కాంగ్రెస్ పార్టీ దిగివచ్చి 70 స్థానాలతో సరిపెట్టుకోవచ్చు. 2015లో కాంగ్రెస్ 42 స్థానాలకే పోటీ చేసింది. జనతాదళ్ కు చెందిన ఇద్దరు అభ్యర్థులు కాంగ్రెస్ టిక్కెట్టుపైన పోటీ చేశారు. మూడు ప్రధాన కమ్యూనిస్టు పార్టీలూ – కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్ – లెనినిస్ట్), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) కలిసి పాతిక స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టవచ్చు. ముఖేశ్ సాహ్నీ నేతృత్వంలోని వికాశ్ శీల్ ఇన్సాన్ పార్టీ కి పది స్థానాల కంటే తక్కువే కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విభజనకు మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నీ అంగీకరించాయనీ, ఒకటి, రెండు రోజుల్లో ప్రకటిస్తామనీ ఆర్ జేడీ నాయకుడు ఒకరు మీడియాకు చెప్పారు.

కుష్వాహాతో కాంగ్రెస్ నాయకులు చర్చలు జరుపుతున్నారు. ఆయన నాయకత్వంలోని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ ఎల్ ఎస్ పి)ని మహాకూటమిలో కొనసాగేలా అందరినీ ఒప్పించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠాన ప్రతినిధి గోహిల్ ప్రయత్నిస్తున్నారు. అయితే, ఎన్నికలు అయిన తర్వాత ఉపేంద్ర కుష్వాహా మహాకూటమిలో కొనసాగుతారన్న విశ్వాసం లేదనీ, ఆయనను చేర్చుకోవడం నష్టదాయకమేననీ ఆర్ జేడీ నాయకుడు తేజశ్వి యాదవ్ అభిప్రాయం. ఎన్ డీఏకీ, మహాకూటమికి తేడా తక్కువగా ఉంటే కుష్వాహా కీలకమైన పాత్ర పోషిస్తారనీ, ఆయనకు ఇప్పటికే ఎన్ డీ ఏ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనీ తేజశ్వి విశ్వాసం. బీజేపీని ఓడించడం ప్రతిపక్షాల ప్రధాన లక్ష్యం కావాలని సీపీఐ జాతీయ నాయకుడు డి. రాజా వ్యాఖ్యానించారు. ఉపేంద్ర కుష్వాహా వేరు కుంపటి పెట్టుకున్నా, తిరిగి ఎన్ డీ ఏ భాగస్వామిగా ఎన్నికల బరిలో దిగినా ప్రతిపక్ష కూటమికి నష్టమే. అతడు గెలవకపోయినా, కొందరు ప్రతిపక్ష అభ్యర్థులను ఓడించే బలం ఉన్నవాడు. పోలింగ్ తేదీలు నిర్ణయం కావడంతో అన్ని పార్టీలలోనూ చురుకు పుట్టింది. నాయకులు పావులు కదపడం మొదలు పెట్టారు. బిహార్ ఎన్నికల రంగం రసవత్తరంగా మారబోతున్నది. చాలా కాలంగా ప్రతిపక్షంలో ఉన్న ఆర్ జేడీకీ, యువనాయకుడు తేజశ్వికీ ఈ ఎన్నికలు అగ్నిపరీక్ష వంటివి. నితీశ్ కుమార్ కంటే కూడా నరేంద్రమోదీకి ఈ ఎన్నికలు కీలకమైనవి. ఇంతవరకూ సంస్కరణలు ప్రకటించకుండా దాటవేస్తున్నారనీ అపవాదునుంచి తప్పుకోవడానికి మోదీ వ్యవసాయరంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టారు. వాటిని ప్రజలు ఆమోదిస్తున్నారో, వ్యతిరేకిస్తున్నారో బిహార్ ఎన్నికలు తేల్చివేస్తాయి. ఎన్నికలలో విజయం సాధించినట్లయితే మోదీ వ్యవసాయ సంస్కరణలను ప్రజానీకం ఆమోదించినట్టు లెక్క. గెలుపు సాధిస్తే నితీశ్ కుమార్ నాలుగో టరమ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. లేకపోతే, బిహార్ లో యువనాయకుడూ, లాలూ ప్రసాద్ రెండో కుమారుడూ ముఖ్యమంత్రి అవుతారు.

కొత్తదనంపై బిహార్ ప్రజల మోజు

బిహార్ ప్రజలు కొత్తదనం కోరుకుంటున్నారు. 1990ల ప్రారంభంలో మండల్-కమండల్ వైరుధ్యం రాజకీయాలను రెండుగా చీల్చినప్పటి నుంచి మండలి ప్రతినిధులుగా బిహార్ లో లాలూప్రసాద్ యాదవ్, ఉత్తరప్రదేశ్ లో ములాయంసింగ్ యాదవ్ లు అధికారంలోకి వచ్చారు. నితీశ్ కుమార్ కూడా వారికోవలోని నాయకుడే. వీరంతా సామాజికన్యాయం ప్రాతిపదికగా రాజకీయాలు నెరపినవారు. దాదాపు మూడు దశాబ్దాలుగా వీరిని చూసిచూసి జనాలకు మొహంమొత్తింది. ఉత్తరప్రదేశ్ లో ములాయంసింగ్ కుమారుడు అఖిలేశ్ యాదవ్ విద్యాధికుడు. ఆయన ఒక సారి ముఖ్యమంత్రిగా చేశారు. పార్టీ యంత్రాంగం యావత్తూ యువనేత అధీనంలోకి వచ్చేసింది. బిహార్ లో గడ్డి కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ జైలు శిక్ష అనుభవిస్తున్న కారణంగా ఆయన ఇద్దరు కుమారులలోనూ రెండవ వాడైన తేజశ్వి చురుకైనవాడు. అతని చేతికి పార్టీ పగ్గాలు అందాయి. పెద్దవాడు కొంతకాలం గింజుకొని సర్దుకున్నాడు. లాలూ రాజకీయ వారసుడుగా తేజశ్విని సమాజం ఆమోదించింది. నితీశ్ కుమార్ తో విసుగుపుట్టిన ప్రజలు తేజశ్వికి అవకాశం ఇస్తారా లేక ప్రశాంత్ కిశోర్ ప్రారంభించిన ఉద్యమానికి మద్దతు ఇస్తారా లేక కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా సాగిస్తున్న నైతిక ఉద్యమాన్ని బలపరుస్తారా చూడాలి. యశ్వంత్ సిన్హా, ప్రశాంత్ కిశోర్ లు ఏ ప్రాతిపదికపైన బరిలోకి దిగుతారో, అసలు ఎన్నికల రంగంలో ఉంటారో ఉండరో తేలవలసి ఉన్నది. ఈ సందేహాలన్నిటికీ త్వరలో సమాధానాలు లభిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles