Sunday, December 22, 2024

ఉత్కృష్టమైన సాహిత్యోత్సవం ‘ఉన్మేష’

  • అతిపెద్ద సారస్వత వేడుక
  • తండోపతండాలుగా రానున్న జాతిజనులు
  • 64 ఘట్టాలలో సాహిత్యకారుల సందడి

స్వాతంత్ర్యానంతర భారతదేశంలో మొట్టమొదటిసారిగా అతిపెద్ద స్థాయిలో ‘ఉన్మేష’ శీర్షికతో అతిపెద్ద సాహిత్యోత్సవం జరుగనుంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లా ఈ వైభవానికి వేదిక కానుంది. జూన్ 16 నుంచి 18 వ తేదీ వరకూ జరిగే ఈ వేడుకలు గొప్ప ఆరంభానికి అంకురార్పణ చేస్తాయని భాషాసాహిత్యప్రియులు ఆనందం నిండిన, ఆత్మగౌరవంతో కూడిన హృదయంతో ఆకాంక్షిస్తున్నారు. ‘ఆజాదీ కా అమృతోత్సవ్’ లో భాగంగా కేంద్ర సాహిత్య అకాడెమి -భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవం సరికొత్త చరిత్రను సృష్టించాలని ఆశిద్దాం. నిజంగానే ఇది అతిపెద్ద పండుగ. కేవలం పరిధిలోనే కాదు, విస్తృతిలోనూ, విభిన్నతలోనూ, విలక్షణతలోనూ విశేషంగా దీనిని రూపుదిద్దారు. ఆధునిక, ప్రాచీన, సంప్రదాయ, జానపద విభాగాలన్నింటికీ భాగస్వామ్యం కలిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ  సాహిత్యసరస్వతికి ఘన గౌరవం జరుగబోతోంది.

Also read: సర్వమత సహనం, సమభావం మన జీవనాడి

సకల సొగసుసోయగాలను దర్శించవచ్చు

భారతీయమైన కవిత్వం, సాహిత్యం, భాషలు, యాసలు, సంస్కృతి, చరిత్ర, స్వాతంత్ర్య ఉద్యమాలు, సొగసుసోయగాలన్నింటినీ ఇక్కడ చూడవచ్చు.. అన్నట్లుగా సమగ్రతకు పెద్దపీట వేయడం ఆనందదాయకం, శుభసూచకం. సిమ్లాలోని గెయిటీ హెరిటేజ్ కల్చరల్ కాంప్లెక్స్ ప్రధాన వేదికగా జరుగుతున్న ఈ సాహిత్య ఉత్సవానికి ప్రపంచవ్యాప్తంగా తండోపతండంగా జాతిజనులు తరలివస్తున్నారు. భారతదేశంతో పాటు సుమారు 15 దేశాల నుంచి 425 మంది కవులు, రచయితలు, సాహిత్యవేత్తలు, భాషాశాస్త్రవేత్తలు, కథకులు, అనువాదకులు, పరిశోధకులు, పండితులు తమ వాగ్ధాటితో మూడురోజుల పాటు సందడి చేయనున్నారు. సుమారు 60 భారతీయ భాషలకు సంబంధించి 64 ఈవెంట్స్ జరుగనున్నాయి. జరుగబోయే చర్చలు, ప్రదర్శనలు, ఉపన్యాసాలు, ప్రసంగాలు, పఠనాలు అన్నీ భారతీయ భాషాసాహిత్య, కవిత్వాల చుట్టూనే తిరుగుతాయి. దేశంలో కొన్ని వేల భాషలు ఉన్నాయి. లిపిలేని భాషలు ఎన్నో ఉన్నాయి. అందులో అధికారికంగా గుర్తింపు పొందిన భాషలు కేవలం 22 మాత్రమే కావడం గమనార్హం. లిపిలేకపోయినా, ఉన్నా వందలాది భారతీయ భాషలు వాడుకలో ఉన్నాయి. కేవలం మాట్లాడుకోవడం, దైనందిన చర్యలకు సంకేతాలుగా మిగిలిపోవడమే కాక, అద్భుతమైన సాహిత్యం, కవిత్వం, సంగీతం, నృత్యాత్మకమైన సంస్కృతికి నిలయంగా సారస్వతాన్ని పండిస్తున్న భాషలు అనేకం భరతభూమిపై విరాజిల్లుతున్నాయి. వాటన్నింటికీ ప్రోత్సాహం జరగాలి, విస్తృతి పెరగాలి. అనువాదాల ద్వారా సాంస్కృతిక, సారస్వత వినిమయం జరగాలి. ‘ఆదాన్ ప్రదాన్’ ను అందిపుచ్చుకోవాలి. స్వాతంత్ర్య అమృతోత్సవం జరుగుతున్న వేళ, ఈ భాషలన్నీ అమరత్వాన్ని సంతరించుకోవాలి. గిరిజనుల్లో, వివిధ తెగల్లో ఎన్నో భాషలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. వాటికి మరింత జీవం పోయాలి.

Also read: అఖండంగా అవధాన పరంపర

కొలువుదీరనున్న అరవై భాషలు

ప్రస్తుతం నిర్వహిస్తున్న ‘ఉన్మేష- ఉత్సవం’లో కనీసం 60 భాషలనైనా తలచుకొని, కొలుచుకోవడం అభినందనీయం. ప్రస్తుతం 60భాషలతో ఆరంభమైన ఈ ఉత్సవం మునుముందు మరిన్ని భాషలకు విస్తరించాలని కోరుకుందాం, విస్తరిస్తుందని విశ్వసిద్దాం. ఈ మూడు రోజుల ఉత్సవంలో సుప్రసిద్ధులు, నోరూవాయీ ఉన్నవారు, తలపండినవారే  కాక, తరుణీమణులు, వర్ధిష్టులు, యువతకు కూడా పెద్దపీట వేస్తున్నారు. వెనుకబడిన రాష్ట్రాలు, ప్రాంతాలు, వర్గాలు, తెగలవారికి కూడా  చోటు కల్పిస్తున్నారు. లింగవిభేదాలకు ఏ మాత్రం తావివ్వకుండా ప్రాతినిధ్యం, భాగస్వామ్యం కల్పించడం విశేషమైన విషయం. ఎల్ జి బి టి (లెస్బియన్,గే,బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్) కి ఈ వేడుకల్లో ప్రాతినిధ్యం కల్పిస్తూ గౌరవించడం సత్ సంప్రదాయం. స్వలింగసంపర్కులు, లింగమార్పిడి చేయించుకున్నవారు, శిఖండులు కూడా సారస్వత లోకంలో అఖండంగా వెలిగిపోతున్నారు. వారందరికీ ఈ ఉత్సవంలో  చోటుదక్కడం హర్షప్రదాయకం. జానపదాలకు గొంతుకను ఇవ్వడం మరో మంచి విషయం. మీడియా,సినిమా సాహిత్యం, ప్రాంతీయ భాషలు, గ్రామీణ భాషలు, మౌఖిక సాహిత్యం, ఫాంటసీ, సైన్స్, ఫిక్షన్ మొదలైన విభాగాలపైన విస్తృతంగా చర్చకు తావుఇచ్చారు. మహిళాసాధికారతను చాటిచెప్పే సాహిత్యంపై కూడా ప్రసంగావళిని రూపొందించారు. యువత, మహిళలు, అణగారిన వర్గాలు, ఇప్పుడప్పుడే సాహిత్య రంగంలోకి అడుగుపెడుతున్నవారు ఎదుర్కొనే ఇబ్బందులు, సమస్యలపై కూడా విశేషంగా చర్చ జరుగనుంది. ఆడవారి ‘అస్మిత’కు అగ్రసింహాసనం వేయడం కర్తవ్యశోభితం.  జుగల్ బందీ అనగానే కేవలం సంగీత ప్రదర్శనలలోనే వినపడుతూ ఉంటుంది. పంజాబీ – హిందీ పద్యాలతో ఇక్కడ జుగల్ బందీని నిర్వహించ తలపెట్టడంలో కొత్తందనం కనిపిస్తోంది. కవిత్వం, సాహిత్యం, రచనా వ్యాసంగాల వల్ల ఒనగూరే ప్రయోజనాలు, వడిదుడుకుల గురించి అనేకులు మాట్లాడం ప్రత్యేకతను సంతరించుకోనుంది. అనువాద ప్రయోజనంపై విస్తృతంగా వివరించే ప్రయత్నం జరుగనుంది. స్వాతంత్ర్యోద్యమ వేళల్లో పుట్టిఎగసిన సారస్వతాన్ని మరోమారు తలచుకోవడం అక్షరరూపమైన నివాళిగా భావించాలి.భక్తి ఉద్యమం ప్రభావం ఎంత గొప్పదో చరిత్ర విదితం. ఆ మహనీయులందరినీ మరోమారు ఇక్కడ తలచుకోబోతున్నాం.భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పుస్తకాల పాత్ర చాలా గొప్పది.

Also read: సివిల్స్ పరీక్షల్లో నిలిచి వెలిగిన తెలుగువారు

తెలుగువారి పర్యవేక్షణలో జరగడం విశేషం

ఇలా… భారతీయ సారస్వతానికి సంబంధించిన భూత-భవిష్య -వర్తమానాలు అనే త్రికాలాలకు మూడు రోజుల పండుగ వేదిక కానుండడం ఆశావహ పరిణామం. ప్రపంచ సాహిత్యం- భారతీయ సాహిత్యంపై తులనాత్మక అధ్యయనానికి కూడా భూమిక కల్పించడం మరో మంచి అడుగు. హిమాచల్ ప్రదేశ్ లో ఉత్సవం జరుగుతున్న వేళ, ఆ రాష్ట్ర సారస్వత వైశిష్ట్యానికి కూడా అగ్రతాంబూలం ఇవ్వడం సముచితమే. ప్రతిరోజూ సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేస్తున్నారు. దక్షిణాది -ఉత్తరాది మధ్య సమతుల్యతను పాటిస్తూ ఈ కార్యక్రమాలను రూపొందించారు. అనేకమంది పెద్దలకు సంబంధించిన డాక్యుమెంటరీ ప్రదర్శనలను కూడా ఏర్పాటుచేశారు. ఉత్సవం జరుగుతున్న ప్రాంగణంలో 1000 పుస్తకాలను అమ్మకం -ప్రదర్శన ఆశయంతో అందుబాటులో ఉంచుతున్నారు. ఈ పుస్తకాలన్నీ స్వాతంత్ర్య ఉద్యమాలకు సంబంధించినవే కావడం మరో విశేషం. అత్యంత వైభవంగా, సత్ సంకల్పంతో రచించిన ‘ఉన్మేష-సాహిత్య ఉత్సవం’ దిగ్విజయంగా జరగాలని కోరుకుందాం.భారతీయ భాషాసంస్కృతులకు, సారస్వతానికి ఆధునిక కాలంలో విశ్వవ్యాప్తంగా గుర్తింపు,ఖ్యాతి రావాలని ఆకాంక్షిద్దాం. ఈ శుభకామనకు ఈ వేడుకలు భూమికగా నిలుస్తాయని విశ్వసిద్దాం. కాకతాళీయమే ఐనప్పటికీ, ఈ మహోత్సవం తెలుగువారి కనుసన్నల్లో జరుగనుండడం తెలుగువారందరికీ గర్వకారణం. కేంద్ర సాంస్కృతిక శాఖా మంత్రిగా కిషన్ రెడ్డి ,కేంద్ర సాహిత్య అకాడెమి కార్యదర్శిగా కె శ్రీనివాసరావు, సాంస్కృతిక శాఖ జాయింట్ సెక్రటరీగా నండూరి ఉమ ఈ మహోత్సవానికి బాధ్యులుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన ఉత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిధిగా పాల్గొనవచ్చునని మొదట్లో అనుకున్నారు. వారికుండే వ్యవహారాల వత్తిళ్ల వల్ల ప్రధాని పాల్గొనడం లేదని తెలుస్తోంది. ఇటువంటి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా మరిన్ని జరగితే భాషా సాహిత్య వికాసానికి పెద్ద ప్రచారం జరుగుతుంది, చైతన్యం తాండవిస్తుంది.

Also read: ఎన్టీఆర్ కి భారత రత్న ఇప్పుడైనా…

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles