Friday, December 27, 2024

ఫ్లోరైడ్ పై పోరాటంలో విజయం

ఫ్లోరైడ్ విముక్తి పోరాట ఉద్యమంలో కేసీఆర్, కె ఆర్ మూర్తి, దశర్ల సత్యనారాయణ తదితరులు.

తెలంగాణ ప్రభుత్వానికి అభినందన

కె. ఆర్. మూర్తి

‘విషం పీడ విరగడ’ శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’ లో శనివారం (19 సెప్టెంబర్ 2020) నాడు ప్రధాన శీర్షికగా అచ్చయిన శుభవార్త ఆనందం కలిగించి. ఇటువంటి వార్తకోసం నల్లగొండ జిల్లా ప్రజలూ, ప్రజాసంక్షేమం అభిలషించే తెలంగాణ ప్రజలూ, తెలుగువారందరూ దశాబ్దాల తరబడి నిరీక్షిస్తున్నారు. తాగునీటిలో ఫ్లోరైడ్  ఉండటం మూలంగా ఫ్లోరోసిస్ వ్యాధిసోకి వంకర్లు పోయిన దేహాలతో పిల్లలు పుట్టడం, బక్కపలచని శరీరాలతో, గారపట్టిన పళ్ళతో, కిడ్నీ సమస్యలతో రోగిష్టిమారి జీవితాలు నరకసదృశంగా గడుపుతుంటే గుండెతరుక్కుపోతున్న మానవతావాదులు నిస్సహాయంగా నిట్టూర్పులు విడుస్తూ విధిని నిందించేవారు.

దుశర్ల సత్యనారాయణ పోరాటం

నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యకు ప్రతీకగా నిలిచిన అంశులస్వామిని 12 మార్చి 2003 నాడు పార్లమెంటులో బల్లపైన పడుకోపెట్టి నాటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయికి చూపించి ఆయనను చలింపజేసిన ఘనత జలసాధన సమితి అధ్యక్షుడు దశర్ల సత్యనారాయణది. భ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఫ్లోరైడ్ బాధితులను ఆదుకునేందుకు జీవితాన్ని అంకితం చేసిన సేవాతత్పరుడు ఆయన. వాజపేయి కంటతడిపెట్టారు. దుశర్ల సత్యనారాయణ పోరాటం కొనసాగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తలబెట్టిన రెండు బృహత్ కార్యక్రమాలు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ. మిషన్ భగీరథకి సారధి మంత్రి కల్వకుంట్ల తారకరామారావు. మిషన్ కాకతీయ సారథ్యం మరో మంత్రి హరీష్ రావుది.  మిషన్ భగీరథతో తెలంగాణకు ఫ్లోరైడ్ మహమ్మారి నుంచి విముక్తి లభించిం. ఈ పథకం అమలు వల్ల రాష్ట్రంలో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలు సున్నాకు చేరుకున్నాయి. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నూ, మంత్రి కేటీఆర్ నూ అభినందించాలి.

ఐదేళ్ళ కిందట 967 ఫ్లోరైడ్ గ్రామాలు

తెలంగాణలో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలు లేవనీ, 1 ఏప్రిల్ 2015 నాటికి 967 ఫ్లోరైడ్ గ్రామాలు ఉండగా 1 ఆగస్టు 2020 నాటికి ఆ సంఖ్య సున్నాకు చేరుకున్నదని లోక్ సభలో జల్ శక్తి సహాయమంత్రి రతన్ లాల్ కటారియా శుక్రవారంనాడు ప్రకటించారు. పుణె లోక్ సభ సభ్యుడు గిరీష్ బాలచంద్ర బాపట్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి తెలంగాణలో ఫ్లోరైడ్ పీడ విరగడైందని ప్రకటించారు.  అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో 402 ఫ్లోరైడ్ గ్రామాల నుంచి 111 గ్రామాలకు తగ్గాయని మంత్రి వెల్లడించారు. తెలంగాణలో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలు లేకపోవడానికి కారణం మిషన్ భగీరథ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఫ్లొరైడ్ పోరుయాత్రలో భాగంగా 2003లో మర్రిగూడ వెళ్ళిన కేసీఆర్ అక్కడే ‘పల్లెనిద్ర’ చేశారు. అక్కడి ప్రజల యాతన చూసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఇంటికీ నల్లాలతో రక్షితనీరు సరఫరా చేస్తామంటూ హామీ ఇచ్చారు. మిషన్ భగీరథ కింద నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు మంచినీరు సరఫరా చేసే కార్యక్రమానికి అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ శ్రీకారం చుట్టారు. 9 డిసెంబర్ 2014న చౌటుప్పల్ లో మిషన్ భగీరథ పైలాన్ నిర్మాణానికి పునాదిరాయి వేశారు.2017 నాటికి మిషన్ భగీరథ పనులు పూర్తయినాయి. ఆ సంవత్సరాంతంలో ఇంటింటికి నల్లా నీరు సరఫరా ప్రారంభించారు.

మొదట 1937లో సమస్య వెలుగులోకి

మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్ర ప్రాంతంలో ప్రకాశం జిల్లా దర్శిలో 1937లో తొలిసారి ఫ్లోరైడ్ ని గుర్తించారు. నల్లగొండ జిల్లాలోని బట్లపల్లి గ్రామంలో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ఉన్నట్టు నిజాం ప్రభుత్వ శాస్త్రవేత్త డాక్టర్ ఎంకె దాహూర్ వెల్లడించారు. చర్లగూడ, ఇబ్రహీంపట్టణం, పసునూరు, మునుగోడు, తంగెడిపల్లి గ్రామాలలో నిజాం చెరువులు తవ్వించాడు. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగు నీరు సరఫరా చేశారు. ప్రపంచంలోనే అత్యధిక పరిమాణంలో (28 పీపీఎం) ఫ్లోరైడ్ ఉన్నట్టు 1985లో బయటపడింది. బట్టుపల్లి గ్రామంలో నివశించేవారంతా చట్టుపక్కల గ్రామాలకు వలసపోయారు. నల్లగొండ జిల్లాలో పండించే ఆహారపదార్థాలలో, కూరగాయలలో ఫ్లోరైడ్ ఉన్నట్టు కనుగొన్నారు. డిండి ఎత్తిపోతల పథకంలో పలు రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టారు. గొట్టిముక్కల రిజర్వాయర్ పనులు 80 శాతం దాకా పూర్తయినాయి. శివన్నగూడెం, కిష్టరాంపల్లి రిజర్వాయర్ల నిర్మాణం 40 శాతం పూర్తయింది. ఈ రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయితే భూగర్భజల మట్టం పెరిగి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ మహమ్మారి పూర్తిగా అదృశ్యం అవుతుంది. బట్లపల్లిలో రూ. 440 కోట్ల ఖర్చుతో 90 ఎంఎల్ డీ సామర్థ్యం కలిగిన నీటిశుద్ధి ప్లాంటును నిర్మించారు. ఇప్పుడు అక్కడి నుంచి నాంపల్లి, చందూరు, మునుగోడు మండలాల్లోని ఫ్లోరైడ్ గ్రామాలకు నల్లాలతో తాగునీరు సరఫరా అవుతోంది. అంతకు ముందు 2005 నుంచీ ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు కృష్ణా జలాలలను సరఫరా చేస్తూ వచ్చారు. వినియోగం అంతగా లేదు. ట్యాంకల వరకూ వెళ్ళినవారికి కృష్ణనీరు దొరికేది.  

ప్రభుత్వాధికారుల ప్రతి సంవత్సరం స్కూలు విద్యార్థులకు ఫ్లోరైడ్ సోకిందేమో తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహిస్తారు. 2014లో 413 మంది 1.5 పీపీఎం కంటే ఎక్కువ ఫ్లోరిన్ శాతం ఉన్నది. 2019లో 94 మందికే ఫ్లోరిన్ ఉంది. ఇప్పుడు ఫ్లోరైడ్ లక్షణాలు ఉన్న విద్యార్థుల ఒక్కరూ లేదు. ఎవ్వరి పళ్ళపైనా గారలు కనిపించడం లేదని నల్లగొండ జిల్లా ఆరోగ్యాధికారి డాక్టర్ కొండలరావు వెల్లడించారు.

హెచ్ఎంటీవీ ‘ఫ్లోరైడ్ యాత్ర’

ఫ్లోరైడ్ పీడిత గ్రామాల ప్రజల కష్టాలు తొలగించేందుకు అనేకమంది అనేక ప్రయత్నాలు చేశారు. స్వచ్ఛంద సంస్థలు సైతం తమవంతు కృషి చేశాయి. అందరిలోకీ దుశర్ల సత్యానారాయణ సేవ గొప్పది. ఎన్నికలు జరిగినప్పుడు జలసాధన సమితి తరఫున వందల నామినేషన్లు వేయించేవారు. ఈ సమస్యను జాతీయ స్థాయి నాయకుల దృష్టికి తీసుకొనివెళ్ళేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఈ రచయిత హెచ్ఎంటీవీ ప్రధాన సంపాదకుడుగా పని చేస్తున్న సమయంలో (2011లో) నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ భూతం గురించి ఎలుగెత్తి చాటేందుకు ఒక బృహత్తర ఉద్యమ కార్యక్రమం నిర్వహించాం. పదిహేను రోజుల పాటు నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలలో ‘ఫ్లోరైడ్ విముక్తి పోరాట యాత్ర’ పేరుతో పాదయాత్ర చేసి, ప్రజలకు ధైర్యం చెప్పి, పోరాటం దిశగా మరలించే కార్యక్రమం నిర్వహించాం. నేనూ, నాతోపాటు నా సహచరులూ రోజంతా ప్రజలలో అవగాహన కల్పిస్తూ, సాయంత్రానికల్లా ఒక గ్రామంలో బహిరంగసభ నిర్వహించేవాళ్ళం. విరాహత్ అలీ, నల్లగొండ జిల్లా విలేఖరి అశోక్, తదితరుల సహకారంతో ఈ యాత్ర జయప్రదంగా సాగింది. దుశర్ల సత్యనారాయణ, ఫ్లోరైడ్ బాధితుడు అంశులస్వామి పదిహేను రోజులూ యాత్రలోనే ఉన్నారు.  తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం, జర్నలిస్టుల సంఘం నాయకుడ కె. శ్రీనివాసరెడ్డి ఫ్లోరైడ్ యాత్రను దేవరకొండ నియోజకవర్గంలోని డిండి దగ్గర 27 మే 2011 నాడు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. గద్దర్ ప్రసంగించారు. ముగింపు సమావేశానికి ప్రముఖ సినిమా నటడూ, దర్శకుడూ, నిర్మాత, పాటల రచయిత, గాయకుడూ, నృత్యకారుడూ, బహుముఖ ప్రజ్ఞాశాలి ఆర్. నారాయణమూర్తి ముఖ్య అతిధిగా హాజరై అద్భుతంగా, ఆవేశపూరితంగా ప్రసంగించారు. ఈ యాత్రలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ రాజారెడ్డిగారు పర్యటించారు. ఆయన ఫ్లోరైడ్ సమస్యను శాస్త్రీయంగా అధ్యయనం చేసిన మేధావి. అనేక జాతీయ, అంతర్జాతీయ సమావేశాలలో ఫ్లోరైడ్ సమస్యపైన ఉపన్యాసాలు ఇచ్చారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు ఫ్లోరైడ్ సమస్య పరిష్కారంలో ఆయన సేవలను వినియోగించుకున్నాయి. ఆయన నల్లగొండ జిల్లా ప్రజలకు అరటిపండు వొలిచి చేతిలోపెట్టినట్టు ఫ్లోరైడ్ సమస్యనూ, దాన్ని ఎదుర్కోవలసిన విధానాన్ని వివరించారు. చుక్కారామయ్య, మల్లెపల్లి లక్ష్మయ్య, విమలక్క, దేశపతిశ్రీనివాస్, డాక్టర్ బూరనరసయ్యగౌడ్ (అప్పుడు భువనగిరి లోక్ సభ సభ్యుడు), తదితర ప్రముఖులు సాయంకాల సమావేశాలలో ప్రసంగించారు.

నాదెండ్ల మనోహర్ చొరవ

ఈ కార్యక్రమంపైన ఆంధ్రప్రదేశ్ శాశససభలో చర్చజరిగింది. అప్పటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ పర్యావరణ పరిరక్షణ కమిటీని నియమించారు. కమిటీ సభ్యులు నాగార్జునసాగర్, నల్లగొండ, దేవరకొండ, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఫ్లోరైడ్ బాధిత గ్రామాలలో రెండు రోజులపాటు పర్యటించారు. నాగార్జునసాగర్ లో స్పీకర్ మనోహర్, జానారెడ్డి, మరికొందరు మంత్రులు, ఇరవైమంది ఎంఎల్ ఏలు సమావేశమైనారు. వీరిలో కేసీఆర్ కూడా ఉన్నారు.  అందులో మేము చేసిన కార్యక్రమాలను చూపించాము. స్పీకర్ చొరవతో ఫ్లోరైడ్ బాధిత గ్రామాలలో మంచినీరు సరఫరాకూ, పౌష్టికాహారం పంపిణీకీ ఏర్పాట్లు జరిగాయి. నీటిశుద్ధి యంత్రాలను కూడా ఏర్పాటు చేయాలని స్పీకర్ ఆదేశించారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాం. హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. స్కూళ్ళకు అప్పటికీ ఫ్లోరైడ్ నీరే సరఫరా కావడాన్ని హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు అదేశాల మేరకు ప్రభుత్వం ఫ్లోరైడ్ నుంచి బాలబాలికలను రక్షించేందుకు రూ. 350 కోట్లు విడుదల చేసింది. మొత్తం 18 ఫ్లోరైడ్ ప్రభావిత మండలాలలో విద్యార్థులకు మద్యాహ్నభోజనంతో కోడిగుడ్లు, నువ్వుండలు, పాలు ఇచ్చేవారు. నీటిశుద్ధి యంత్రాలను నెలకొల్పారు. జర్నలిస్టుల నాయకుడు శ్రీనివాసరెడ్డి తన గ్రామంలో నీటిశుద్ధి యంత్రాన్ని ఏర్పాటు చేశారు. స్పీకర్ నాయకత్వంలోని కమిటీ అరకుకు వెళ్ళి అక్కడ ఆదివాసీల జీవన పరిస్థితులను అధ్యయనం చేసింది. గవర్నర్ కూడా ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలలో పర్యటించారు. ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలపైనా, బాధితులపైనా, వారు ఎదుర్కొనే సమస్యలపైనా పాలకుల దృష్టిని ప్రసరింపజేయడానికి ఫ్లోరైడ్ యాత్ర విమోచన పోరాట దోహదం చేసింది. హెచ్ఎంటీవీ నిర్వహించిన గొప్ప కార్యక్రమాలలో ఇది ఒకటి.

అంజయ్య ఆలోచన

నిజానికి 1980-81లోనే అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య ఫ్లోరైడ్ నుంచి నల్లగొండ ప్రజలకు శాశ్వత విముక్తి కల్పించేందుకు మహాసంకల్పం చేశారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నుంచి సొరంగమార్గంలో నీళ్ళు తరలించి డిండి జలాశయాన్ని నింపి అక్కడి నుంచి మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలలోని ఫ్లోరైడ్ బాధితులకు మంచినీరు సరఫరా చేయాలన్న సంకల్పించారు. శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర ఏలపెంట దగ్గర ప్రారంభమై నక్కలగండి వరకూ 40 కిలోమీటర్ల సొరంగమార్గం ఏర్పాటు చేయవలసి ఉంది.  నక్కలగండిలో జలాశయం నిర్మాణంలో ఉంది. ఇప్పటి వరకూ 15 కిలోమీటర్లకు పైగా సొరంగమార్గం తవ్వారు. ఇందుకు సమయం చాలా పడుతుందనీ, నిధులు కూడా ఎక్కువ అవసరం అవుతాయనీ ఇంజనీర్లు చెప్పారు. ఇంకా 20-25 కిలోమీటర్ల సొరంగమార్గం నిర్మించవలసి ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సొరంగమార్గం కష్టభూయిష్టమైనదని భావించి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి డిండి రిజర్వాయర్ కు నీళ్ళు తీసుకొని వచ్చారు. దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలలోని ఫ్లోరైడ్ గ్రామాలకు శాశ్వతంగా విముక్తి ప్రసాదించవచ్చు. మొత్తంమీద నల్లగొండ ప్రజలను పట్టిపీడించిన ఫ్లోరైడ్ రక్కసిని తెలంగాణ ప్రభుత్వం పారదోలింది. ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ బాధితులకు కూడా శాశ్వత పరిష్కారం సాధించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు త్వరగా ఫలిస్తాయని ఆశిద్దాం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles