- సీఐడీ విచారణపై స్టే విధించిన హైకోర్టు
- ఆధారాలుంటే చూపించాలన్న న్యాయస్థానం
రాజధాని అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై సీఐడీ విచారణపై హైకోర్టు స్టే విధించింది. సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఏపీ హైకోర్టులో చంద్రబాబు, నారాయణలు క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూద్రా, నారాయణ తరపున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. సీఐడీ తరపున ప్రభుత్వం తరపున అడిషనల్ ఏజీ జాస్తి నాగభూషణం వాదనలు వినిపించారు.
Also Read: తాడిపత్రి మున్సిపాలిటీ టీడీపీ కైవసం
కోర్టులో ఇరు పక్షాల వాదనలు:
ఉదయం నుంచి చంద్రబాబు పిటిషన్ పై వాదనలు జరిగాయి. అసైన్డ్ భూముల వ్యవహారంలో స్పష్టమైన ఆధారాలు ఉంటే చూపాలని సీఐడీని న్యాయమూర్తి కోరారు. ప్రాథమిక విచారణలో ఏం గుర్తించారని సీఐడీ అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. అయితే విచారణ తొలిదశలో ఉన్నందున వివరాలు ఇపుడే చెప్పలేమని సీఐడీ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. పూర్తిస్థాయి విచారణకు అనుమతి ఇస్తే అన్ని విషయాలు బయటకొస్తాయని తెలిపారు. వాదనలు ముగిసిన అనంతరం సీఐడీ విచారణతో ఏకీభవించని హైకోర్టు ఈ కేసుపై స్టే విధించింది. దీంతో ఈనెల 22న నారాయణ, 23న చంద్రబాబు సీఐడీ విచారణకు హాజారుకావాల్సిన పనిలేదు.
అమరావతిలో దళితుల నుంచి భూములను బలవంతంగా లాక్కొని తమ బినామీలకు లబ్ధి చేకూర్చారని చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ చంద్రబాబుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీచేసింది. ఈ మేరకు న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
Also Read: చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు