కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు గురువారం జారీ చేసిన ఉత్తర్వుతో గొప్ప ఊరట లభించింది. 2019నాటి పరువునష్టం దావాలో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ళ జైలు శిక్ష విధించింది. ఫలితంగా పార్లమెంటు సభ్యుడిగా కొనసాగే అర్హతను రాహుల్ కోల్పోయారు. కొంతకాలంగా ఆయన పార్లమెంటుకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు సూరత్ కోర్టుతీర్పుపైన సుప్రీంకోర్టు స్టే మంజూరు చేసిన కారణంగా రాహుల్ కి పార్లమెంట్ సభ్యత్వం తిరిగి లభిస్తుంది. 2024 ఎన్నికలలో ఆయన పోటీ చేయవచ్చు.
‘రాహుల్ మాట్లాడిన తీరు బాగోలేదు. బహిరంగ సభలలో మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి‘ అంటూ న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, పీఎస్ నరసింహ,సంజయ్ కుమార్ లతో కూడిన ముగ్గురు సభ్యుల బెంచ్ వ్యాఖ్యానించింది. అయితే, చట్టం ప్రకారం ఎంతకాలం శిక్ష వేయడానికి అవకాశం ఉన్నదో అంతకాలం శిక్షను ట్రయల్ కోర్టు విధించిందనీ, రెండేళ్ళకు ఒక్కరోజు తక్కువైనా పార్లమెంటు సభ్యుడిగా కొనసాగే అర్హత కొనసాగేదనీ, అంత పెద్ద శిక్ష వేయడానికి కారణం ఏమిటో ట్రయల్ కోర్టు చెప్పలేదని బెంచ్ అన్నది. 2019 సార్వత్రిక ఎన్నికలలో కర్ణాటకలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ రాహుల్ ‘దొంగలందరికీ ఇంటిపేరు మోదీ అని ఉంటుంది అదేమి విచిత్రమో’ అంటూ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్య మోదీ ఇంటిపేరు కలిగినవారందరికీ పరువు నష్టం కలుగుతుందని గుజరాత్ కు చెందిన శాసనసభ్యుడు సూరత్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సూరత్ కోర్టు తీర్పుపైన స్టే మంజూరు చేయడానికి గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. అప్పుడు రాహుల్ సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ద్వేషంపైన ప్రేమ సాధించిన విజయమని కాంగ్రెస్ పార్టీ ఒక ట్వీట్ ద్వారా వ్యాఖ్యానించింది. కోర్టులో ఏమైనా తన కర్తవ్యం మారదని రాహుల్ వ్యాఖ్యానించారు.