Sunday, December 22, 2024

మహారాష్ట్రలో మహానాటకం

మహారాష్ట్రలో మళ్ళీ రాజకీయ క్రీడ మొదలైంది. మూడు పార్టీల సంకీర్ణంతో నడుస్తున్న శివసేన ప్రభుత్వం ఉంటుందా? కూలుతుందా? అనే సందేహాలు బయలుదేరాయి. అసలు ఇన్ని రోజులు ఉండడమే గొప్ప అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. శివసేన – ఎన్ సీ పి మధ్య మొదలైన వివాదాలు ముదిరేట్టు కనిపిస్తున్నాయి. ఎన్ సీ పి కి చెందిన హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై శివసేన నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు అగ్గి రగిలిస్తున్నాయి.అనిల్ దేశ్ ముఖ్ ను కేవలం  ‘యాక్సిడెంటల్ మినిస్టర్’ అంటూ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.

అనిల్ దేశ్ ముఖ్ పై అవినీతి ఆరోపణ

అనిల్ దేశ్ ముఖ్ పై ముంబయి మాజీ పోలీస్ కమీషనర్ పరమ్ వీర్ సింగ్ “నెలకు 100కోట్ల వసూళ్లు లక్ష్యం” అంటూ ఇటీవల చేసిన తీవ్రమైన ఆరోపణలు ఇంకొక పక్క కలకలం సృష్టిస్తున్నాయి. శివసేనకు చెందిన అధికార పత్రిక “సామ్నా” లో రాసిన వ్యాసంలో  హోం మంత్రిని అసమర్ధుడిగా సంజయ్ రౌత్ అభివర్ణించారు. జయంత్ పాఠిల్, దిలీప్ వాల్సే వంటివారు హోం శాఖను స్వీకరించకపోవడం వల్లనే అనిల్ దేశ్ ముఖ్ కు ఆ పదవి దక్కిందని, కొంతమంది సీనియర్ అధికారులను అవగాహన లేకుండా ఆయన బదిలీ చేశారని.. ఎన్ సి పీ హోం మంత్రిపై వస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం పరువు కూడా రోడ్డున పడింది. ఇదే అంశంలో ఎన్ సీ పి నేత, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ కూడా మండిపడుతున్నారు. ఇది ఇలా ఉండగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా – ఎన్ సీ పి అధినేత శరద్ పవార్ మధ్య అహ్మదాబాద్ లో రహస్య భేటీ జరిగిందని ప్రచారం జరుగుతోంది.

Also Read : మయన్మార్ మారణహోమం

కీలకమైన స్థితిలో ఎన్ సీపీ

ఎన్ సీ పి ప్రస్తుతం ఉన్న సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి, బిజెపితో కలిసిపోతే, ప్రభుత్వం పడిపోతుందనీ, బిజెపి – ఎన్ సీ పి కూటమి మహారాష్ట్రలో అధికారాన్ని చేపడుతుందని రాజకీయ వర్గాల్లో వినపడుతోంది. నిజంగా శరద్ పవార్ – అమిత్ షా భేటీలో  అంతరార్ధం అదే అయితే శివసేన ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్ధకమే. వ్యూహ రచనలో ఈ ఇద్దరు నాయకులు చేయితిరిగినవారే. శరద్ పవార్ అసలు సిసలైన 100% రాజకీయ నాయకుడు. కాంగ్రెస్ తో కలవడం లేదా విడిపోవడం లేదా గొడవపడడం పవార్ కు కొత్త విషయం ఏమీ కాదు. బిజెపితో కలవకూడదనే పెద్ద రూల్స్, సిద్ధాంతాలు అయనకేమీ లేవు.

ధృతరాష్ట్రుడి కౌగిలి

మహారాష్ట్రలో ఆ మూడు పార్టీల సంకీర్ణమే ధృతరాష్ట్రుడి కౌగిలింత. మొదటి నుంచీ శివసేనకు కాంగ్రెస్, ఎన్ సీ పిలు వ్యతిరేక పార్టీలు. కాంగ్రెస్ – శివసేన లేదా, ఎన్ సీ పి – శివసేన ఇంతవరకూ ఎప్పుడూ కలిసిపోటీ చేయలేదు, కలిసి సాగలేదు. మొట్టమొదటగా మొన్న 2019 ఎన్నికల తర్వాత మాత్రమే కలిశాయి. భిన్న ధృవాల వంటి ఈ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ఎవ్వరూ ఊహించలేదు. బిజెపి – శివసేన మధ్య ఎప్పటి నుంచో మిత్రశతృత్వం నడిచింది. బిజెపితో శివసేన కలవడం లేదా విడిపోవడం లేదా బెదిరించడం … ఇలాగే ఈ రెండు పార్టీల మధ్య బంధం కొనసాగింది. 2019లో బిజెపి -శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని అందరూ అనుకున్నారు. కానీ, అలా సాగలేదు. ముఖ్యమంత్రి పదవిపై రెండు పార్టీలు పట్టుబట్టాయి. రెండవసారి కూడా మళ్ళీ ఫడ్నవీస్ నే ముఖ్యమంత్రిని చెయ్యాలని బిజెపి బలంగా భావించింది.

Also Read : బంగ్లాదేశ్ తో బలపడుతున్న బాంధవ్యం

మాట తప్పిన బీజేపీ

శివసేన నేత ఉద్ధవ్ ఠాకరేను ముఖ్యమంత్రిని చేస్తామని ఎన్నికల ముందు బిజెపి మాట ఇచ్చి తప్పిందని శివసేన వాదన. ఆ సమయంలో ఎన్ సీ పి అధినేత శరద్ పవార్ ను కూడా బిజెపి సంప్రదించిందనీ, అయినప్పటికీ  ఆయన సుముఖత వ్యక్తం చేయలేదనీ అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. మొత్తంమీద  బిజెపికి ఏ పార్టీతోనూ సయోధ్య కుదరక మహారాష్ట్రలో అధికారాన్ని చేజార్చుకుంది. ఆనాటి నుంచి శివసేనపై బిజెపి కత్తులు నూరుతూనే వుంది. బాలీవుడ్ హీరో, బీహారీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం మిస్టరీ, కంగనా రనౌత్ విషయాలు, రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్ణబ్ గోస్వామిపై కేసులు, అరెస్టు అంశాలు మొదలైనవి మహారాష్ట్ర శివసేన ప్రభుత్వం – కేంద్ర బిజెపి ప్రభుత్వం మధ్య అగాధాన్ని పెంచేశాయి. ఆ వేడి ఇంకా చల్లారలేదు.

ముఖేష్ అంబానీ ఇంటి ముందు కారు

ఈలోపు,రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటిదగ్గర పేలుడు పదార్థాలతో నిండిన కారును పార్క్ చేసిన సంఘటనలో పోలీస్ అధికారి సచిన్ వాజే హస్తం ఉందనే వార్త దావానలమైంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ ఐ ఏ ) అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తోంది. శివసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జరుగుతున్న ఈ వరుస సంఘటనలలో రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ – కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల మధ్య పోరు కూడా సాగుతోంది. తమ ప్రభుత్వం ప్రతి విషయంలో వైఫల్యం చెందిందని నిరూపించడం కోసమే బిజెపి పెద్దలు పన్నాగాలు పన్నుతున్నారని శివసేన నేతలు మొదటి నుంచీ ఆరోపిస్తున్నారు. బిజెపిపై శివసేన కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని బిజెపి శ్రేణులు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోడానికి శివసేన శత విధాలా ప్రయత్నం చేస్తూనే వుంది.

Also Read : భారత్ – పాక్ సంబంధాలలో సామరస్యమే ప్రధానం

ఏ క్షణంలోనైనా ప్రభుత్వం మారవచ్చు

బిజెపి ఏ క్షణంలోనైనా  అధికారాన్ని హస్తగతం చేసుకున్నా ఆశ్చర్యపడక్కరలేదని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో  మహారాష్ట్రలోని వివిధ పార్టీల బలాబలాలను ఒకసారి పరిశీలిద్దాం. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అధికారంలోకి రావాలంటే 145 స్థానాల బలం కావాలి. ప్రస్తుతం బిజెపికి 105 సీట్ల బలం వుంది. ఆ రాష్ట్రంలో అత్యధికమైన సీట్లు ఆ పార్టీకే వచ్చాయి. 56సీట్లతో శివసేన తర్వాత స్థానంలో ఉంది. శరద్ పవార్ కు చెందిన నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్ సీ పి ) 54 స్థానాల బలంతో మూడవ స్థానంలో ఉంది. 44సీట్లతో నాల్గవ స్థానంలో కాంగ్రెస్ వుంది. ఒకవేళ బిజెపి – ఎన్ సీ పి కలిస్తే, ఆ రెండు పార్టీల సంకీర్ణ బలం 159 కి చేరుతుంది. బిజెపి అధికారాన్ని చేపట్టడానికి సరిపడా మెజారిటీ లభిస్తుంది. శివసేన – కాంగ్రెస్ పార్టీల బలం కేవలం 100మాత్రమే. ఈ తరుణంలో శరద్ పవార్ బిజెపి పెద్దల మధ్య ఏదైనా అంగీకారం కుదిరితే… శివసేన ప్రభుత్వం కూలిపోయినట్లే. మొత్తంమీద, మహారాష్ట్రలో మొదలైన ముసలం ఎటుతీసుకెళ్తుందో.. వేచి చూద్దాం.

Also Read : తెలుగు సినిమా వెలుగు కనుమా..!

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles