భూమా భార్గవరాం, భూమా అఖిల ప్రియ
- హైదరాబాద్ లో అరెస్టు
- బోయినపల్లి కిడ్నాప్ ఉదంతంతో సంబంధం ఉందని అనుమానం
- మరి కొన్ని కేసులూ, ఆరోపణలు కూడా
- బీవీ సుబ్బారెడ్డి ఫిర్యాదు
హైదరాబాద్ : భూమా అఖిలప్రియను తెలంగాణ పోలీసులు బుధవారం ఉదయం కూకట్ పల్లిలో అరెస్టు చేశారు. ఆమెను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆమె భర్త ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. భూమా అఖిలప్రియ ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు ఆమె. ఆమె తండ్రి భూమా నాగిరెడ్డి కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ నాయకుడు, మాజీ ఎంఎల్ఏ. అఖిలప్రియ భర్త భార్గవరాం పరారీలో ఉన్నారు. బొయినపల్లిలో కిడ్నాప్ కు సంబంధించి భార్గవరాం కోసం పోలీసులు వెతుకుతున్నారు. దుండగుల కార్లు ప్రయాణం చేసిన రూట్ ను పోలీసులు గుర్తించారు. వాటిలో ప్రయాణం చేసిన ఎనిమిదిమందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సమీప బంధువులను మంగళవారంనాడు గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన విషయం విదితమే. ఈ ఘటన బోయినపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి 11 గంటలకు జరిగింది. బొయినపల్లిలో బీఎస్ఎన్ కార్యాలయం సమీపంలో నివాసం ఉంటున్న ముఖ్యమంత్రి బంధువులు ప్రవీణ్ రావు(ప్రముఖ హాకీ ఆటగాడు), సునీల్ రావు, నవీన్ రావు అనే సోదరులను సీఎం కేసీఆర్ పీఏ వేణుగోపాలరావుకు బావమరుదులు. రాత్రి పొద్దుపోయిన తర్వాత గుర్తుతెలియని కొందరు ఆదాయంపన్ను శాఖ అధికారులమని చెప్పుకుంటూ ఐటీ దాడులు నిర్వహిస్తున్నామని వారి ఇంటిలో ప్రవేశించారు. మాస్కులు ధరించిన ఆగంతుకులు వాచ్ మన్ పైన దాడి చేశారు. ముగ్గురు సోదరులనూ మూడు కార్లలో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళారు. అంతకు ముందు వారిని తాళ్ళతో కట్టివేసి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. వారితో పాటు లాప్ టాప్ లూ, సెల్ ఫోన్లు కూడా తీసుకొని వెళ్ళారు.
ఇక్కడి హఫీజ్ పేటలో వందల కోట్ల రూపాయల విలువైన 50 ఎకరాల భూమి వివాదం కారణంగానే ఈ కిడ్నాప్ జరిగినట్టు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మీడియా ప్రతినిధులను ఇంటి దగ్గరికి అనుమతించకుండా ఇంటి గేటు దగ్గర డేరా వేసి పోలీసులు పహరా కాస్తున్నారు. ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికి మంత్రి శ్రీనివాసయాదవ్, మహబూబ్ నగర్ ఎంపీ మాలోతు కవిత అక్కడికి చేరుకున్నారు.
ఇది ఇలా ఉండగా కర్నూలుకు చెందిన రాజకీయ నాయకుడు ఎవీ సుబ్బారెడ్డి అఖిలప్రియ తనను చంపించడానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపిస్తూ ఆమెను అరెస్టు చేయవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తాను దీనికి దీటైన సమాధానం ఇస్తాననీ, తనను కుట్రలలో ఇరికించి వేధించడానికి ప్రయత్నం జరుగుతోందనీ అఖిలప్రియ అన్నారు. ఆంధ్రప్రదేశ్ విత్తనాల కార్పొరేషన్ చైర్మన్ గా పని చేసిన సుబ్బారెడ్డి ఒకప్పుడు భూమా నాగిరెడ్డి అనుచరుడు. బొయినపల్లి కిడ్నాప్ ల వ్యవహారంలో కూడా అఖిలప్రియ భర్త ప్రమేయం ఉన్నదనే అరోపణలు వినిపించాయి. ‘‘మూడు నెలల కిందట అఖిల ప్రియ కుట్ర నుంచి నన్ను కడప పోలీసులు రక్షించారు’’ అని సుబ్బారెడ్డి చెప్పారు. అఖిలప్రియ భర్త భార్గవ్ రాం ని, వారి పీఏ మధసీనునూ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్ పైన విడుదలై పరారీలో ఉన్నారు. అఖిల ప్రియ సొంతకారులో హైదరాబాద్ వచ్చిన సందర్భంలో బొయినపల్లి పోలీసులు అరెస్టు చశారు.