భగవద్గీత–94
పదివేల రూపాయలకు పరమాత్మ దర్శనం. ఆలయ హుండీలో ఎవరు ఎక్కువ ధనం సమర్పిస్తే వారు గొప్ప. వారికి రాచమర్యాదలు, ప్రత్యేక దర్శనాలు. సమర్పించలేనివాడు నిస్సహాయంగా చూస్తూ నిలబడిపోయి ఆ దేవుడి అనుగ్రహం నాకు లేదు అని భావించే రోజులివి.
ఫలానా గ్రహం అనుకూలించడానికి ఫలానా గుడిలో ఫలానా పూజచెయ్యని పండితుడు చెప్పాడు. ఆ గుడికి వెళితే ఆ పూజకు 5000 రూపాయల టిక్కట్టు. ఇద్దరికి చేయించుకోవాలంటే పదివేలు సమర్పించుకోవాల్సిందే. అది లేనివాడు అప్పోసొప్పోచేసి చేయించుకుంటాడు. అప్పుపుట్టనివాడు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవలసినదేనా?
Also read: జీవితం ఎట్లా వస్తే అట్లా స్వీకరించాలి
మన ధర్మాన్నుండి వేరే మతాన్ని స్వీకరించడానికి ఇవికూడా ఒక కారణమేమో అని నాకు అనిపిస్తుంది. భగవద్దర్శనాన్ని సామాన్యుడికి దూరం చేశాం. దుర్లభం చేశాం.
నిజానికి పరమాత్మ ఏమి చెప్పాడు…
నీ డాబు దర్పం నా వద్దచూపితే నేను అనుగ్రహిస్తాననుకున్నావా? ఆ డాబుకు దర్పానికి నీకు కనపడేది గొప్పగా అలంకరింపబడిన, నా మూర్తి అని నీవు పిలుచుకుంటున్న ఒక విగ్రహము మాత్రమే. Museumలో టిక్కట్టు కొనుక్కొని చూసే పురాతన వస్తువు మాత్రమే. మరి నేను ఎలా సంతోషంపొంది నీ మనసులోదూరి నిన్ను అనుగ్రహిస్తానో తెలుసా?
Also read: జ్ఞానంతో ఆలోచించి ఇష్టం వచ్చినట్టు చేయమని అర్జనుడికి కృష్ణుడి ఉద్బోధ
పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి
తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః
కన్నప్ప కాలునెత్తినపెట్టి కన్నుకు వైద్యంచేశాడు. ఆనందంగా పులకించి తన సన్నిధికి చేర్చుకున్నాడాయన. రాళ్ళురప్పలుతెచ్చి ఆయనకిచ్చి అదేపూజ అనుకున్నది పాము. దానిని తన మెడలో ఏమిటి వళ్ళంతాపాకనిచ్చాడు.
ఆకులు అలములిచ్చి శంకరా అభయంకరా అని ఏనుగు పూజిస్తే దానిచర్మాన్నే వంటికి చుట్టుకున్నాడు. భక్తితో పత్రమైనా, పుష్పమైనా, ఫలమైనా ఆయనకి సమర్పించు స్వీకరిస్తాడు.
అవీ లేవా!
నీవు ఏ పని చేస్తే ఆ పని శ్రద్ధగా కృష్ణార్పణం అని చేయి లేదా పరమేశ్వరార్పణం అని చేయి. ఆయన అనుగ్రహిస్తాడు.
యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసియత్
యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమ్ !
నువ్వు ఏపని చేస్తున్నావో, ఏమి తింటున్నావో, ఏ హోమము చేస్తున్నావో, అసలు ఏమిచేస్తున్నావో అవి అన్నీ నాకు అర్పించు స్వీకరిస్తాను.
ఇంత స్పష్టంగా భగవానుడు చెప్పిన తరువాత కూడా పదివేల రూపాయల టిక్కట్టుతో పరమాత్మ దర్శనం నిజంగా అవుతుందని నమ్ముతున్నావా?
ఆ క్యూలైనులో, ఆ ఒత్తిడిని కూడా పరమేశ్వరార్పణం అంటూ ముందుకు కదిలితే నిన్ను అనుక్షణం అంటిపెట్టుకొని ఉండి నీ బాధలు ఆయనే భరిస్తాడు. అసలెక్కడికీ వెళ్ళనక్కరలేదు నువ్వున్నచోటనే ఉండి నువ్వుచేసే ప్రతి పని పరమేశ్వరార్పణం అని చెయ్యి. నీ భారము ఆయనే మోస్తాడు.
నిన్ను యజమానిని చేసి తాను సేవకుడవుతాడు. అంత భక్తసులభుడు ఆ భోళాశంకరుడు, ఆ కైలాసవాసుడు, ఆ వైకుంఠవాసుడు.
Also read: ఆత్మజ్ఞానంతో పరబ్రహ్మస్వరూపం సాక్షాత్కారం