- రైతులకు సంఘీభావం తెలిపిన విపక్షాలు
- దేశవ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు
- ఢిల్లీ సీఎం హౌజ్ అరెస్ట్
- పలు రాష్ట్రాల్లో రైల్ రోకోలో పాల్గొన్న మద్దతుదారులు
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఇటీవల ప్రభుత్వానికి, రైతు సంఘాల నేతలకు మధ్య జరిగిన ఐదో విడత చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనడంతో రైతు సంఘాలు దేశ వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చాయి. బంద్ కు ప్రతిపక్ష పార్టీలు ట్రేడ్ యూనియన్లతో పాటు పలు ఉద్యోగసంఘాలు రైతులకు బాసటగా నిలిచాయి. సామాన్యులు ఇబ్బందులు పడకుండా నాలుగు గంటలపాటు మాత్రమే బంద్ పాటించాయి. బంద్ కు మద్దతుగా దేశవ్యాప్తంగా రహదారులపై రైతులు బైఠాయించారు. ధర్నాలు, రాస్తారోకోలతో తమ నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. బంద్ నేపథ్యంలో పలు రాష్ట్రాలలో జనజీవనం నిలిచిపోయింది. రైతుల ఆందోళనకు మద్దతుగా సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ఒక రోజు నిరాహారదీక్ష చేపట్టారు.
కేజ్రీవాల్ గృహనిర్బంధం
భారత్ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను పోలీసులు గృహనిర్భంధంలో ఉంచినట్లు ఆప్ పార్టీ ప్రతినిధులు ఆరోపించారు. సింఘు ప్రాంతంలో ఆందోళన జరుపుతున్న రైతులను పరామర్శించినప్పటి నుండి కేజ్రీవాల్ నివాసం వద్ద భారీ స్తాయిలో పోలీసులను మోహరించారు. అన్నదాతలకు మద్దతు ప్రకటించిన పలు రాజకీయ పార్టీలు, ఉద్యోగ, కార్మిక సంఘాలు బంద్ లో పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపాయి. సింఘు, టిక్రీ సరిహద్దుల్లో భారీగా సాయుధ బలగాలను మోహరించి భద్రతను పటిష్టం చేశారు. రైతుల ఆందోళనలకు మద్దతుగా ఢిల్లీలోని తీస్ హజారీ జిల్లా కోర్టు వద్ద అఖిలభారత న్యాయవాదుల సంఘం ఆందోళన చేపట్టింది. వ్యాపారసంస్థలను మూసివేసి యజమానులు నల్లరిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు.
రైల్ రోకోలతో అట్టుడికిన ఉత్తర భారతం
పంజాబ్ లో బంద్ కు మద్దతుగా వ్యాపార సంస్థలు, దుకాణాలను మూసివేశారు. జనజీవనం స్థంభించింది. కాంగ్రెస్ శ్రేణులతో పాటు రైతు, కార్మిక సంఘాల ప్రతినిధులు నిరసన ప్రదర్శనలు ర్యాలీలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత్ బంద్ గుజరాత్ లో ఉద్రిక్తంగా మారింది. హైవేలపై ఆందోళన కారులు టైర్లను దహనం చేసి నిరసన తెలిపారు. బంద్ కు మద్దతుగా మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో రైతు సంఘాల నేతలు రైల్ రోకో చేపట్టారు. చెన్నై అహ్మదాబాద్ నవజీవన్ ఎక్స్ ప్రెస్ ను ఆపి పట్టాలపై ఆందోళనకు దిగారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని ప్రయగారాజ్ లో సమాజ్ వాదీ పార్టీ నేతలు పట్టాలపై ఆందోళనకు దిగడంతో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. బంద్ దృష్ట్యా యూపీలోని పలు ప్రాంతాలలో 14 సెక్షన్ విధించారు. పశ్చిమ బెంగాల్ లో వామపక్ష నేతలు భారత్ బంద్ కు మద్దతిస్తూ పలు రైళ్లను అడ్డుకున్నారు. పట్టాలపై బైఠాయించి నిరసనలకు దిగారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారత్ బంద్ కు మద్దతుగా ఒడిశాలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆందోళన కారులు జాతీయ రహదారులపై బైఠాయించి నిరసన తెలిపారు. భువనేశ్వర్ రైల్వే స్టేషన్ లో వామపక్షాలు, రైతు సంఘాల నేతలు సంయుక్తంగా రైల్ రోకో చేపట్టారు. బంద్ నేపథ్యంలో గౌహతిలో రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
బంద్ లో పాల్గొన్న తెలుగు రాష్ట్రాలు
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన బంద్ కు టీఆర్ఎస్ మద్దతు పలికింది. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. షాద్ నగర్ బూర్గుల గేట్ దగ్గర భారీగా చేరుకున్న టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మంత్రి కేటీఆర్ ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బడా పారిశ్రామిక వేత్తలకు కొమ్ముకాస్తున్న కొత్త వ్యవసాయ చట్టాలను టీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని కేటీఆర్ అన్నారు. టేక్రియాల్ లో బంద్ కు మద్దతుగా పార్టీ శ్రేణులతో పాటు ఎమ్మెల్సీ కవిత ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.
ఏపీలో వామపక్షాల ధర్నా
వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా రైతు సంఘాలు బంద్ కు మద్దతుగా నిలుస్తూ తూర్పుగోదావరి జిల్లాలో వామపక్షాలు బంద్ నిర్వహించాయి. కాకినాడ బస్ స్టాండ్ సమీపంలో వామపక్షాలు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులకు తమ మద్దతు తెలిపాయి. అటు ఆర్టీసీ కూడా బంద్ నేపథ్యంలో బస్సు సర్వీసులను పూర్తిగా రద్దుచేసి రైతుల బంద్ కు మద్దతు తెలిపింది.
బంద్ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వాలు
భారత్ బంద్ దృష్ట్యా అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఆందోళనళ్లో కొవిడ్ నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రైల్వే సిబ్బంది కూడా జాగరూకతతో వ్యవహరించాలని హెచ్చరించింది. బంద్ దృష్ట్యా బీహార్ లో భద్రతను పెంచారు.