Thursday, November 21, 2024

రాముడికి పాదుకలు తొడిగిన భరతుడు

రామాయణమ్ 224

‘‘ఆనందమానందమాయెగదా! మా సోదరుడు శ్రీరాముడు మరల అయోధ్యకు రానున్నాడన్న వార్తకన్నా నాకు జీవితములో ఆనందము కలిగించు వార్త మరియేదియూ ఉండదు సుమా! నరుడు జీవించియున్న నూరు వత్సరములకైన ఆనందమును పొందగలడు అని చెప్పుదురు కదా!

‘‘ఏది ఆ కధ? ఏది? ఎటుల కలిగెను నరశార్దూలమునకు వానర వీరులకు ఆ సమాగమము?  ఎటుల జరిగినది ఆయన వనవాసము? ఏమి కధలవి? ఎటువంటి గాధ అది? వివరింపుమయ్యా వానరవీరా!’’  అని కడు ఉత్సుకతతో భరతుడు అడుగగా సవిస్తరముగా జరిగినదంతయూ మారుతి ఆయనకు తెలియజేసెను.

Also read: భరతునితో హనుమ సంభాషణ

సీతాపహరణము,

జటాయుమరణము,

సుగ్రీవసంభాషణము ,

వాలివధ,

సీతాదేవికొరకై వెదుకబోయిన వైనము,

సముద్రలంఘనము,

రావణసంహారము,

విభీషణపట్టాభిషేకము!

ఇత్యాది విషయములన్నియు పూసగుచ్చినట్లు చెప్పినాడు వాయునందనుడు.

Also read: భారద్వాజ ముని ఆశ్రమంలో రామదండు విడిది

చెప్పి, మరల..

‘‘మహానుభావా! రాముడిప్పుడు భరద్వాజాశ్రమములో ఉన్నాడు! రేపు పుష్యమీ నక్షత్రము ఆయన ఇచటికేతెంచగలడు’’ అని పలికిన హనుమ వైపు ఆనందాశృవులు నిండిన కనులతో చూసి శతృఘ్నునివైపు తిరిగి శ్రీరాముని స్వాగతమునకై వలయు ఏర్పాట్లు చేయవలసినదిగా ఆజ్ఞాపించినాడు.

‘‘పూల బాటలు పరవండి. కోటలను అలంకరించండి. రాజముఖ్యులందరినీ రప్పించండి. నట, గాయక వైతాళికులను సిద్ధముగా యుండమనండి!’’

 అనుచూ ఆజ్ఞలు వెలువడెను.

Also read: పుష్కక విమానంలో సీతారామలక్ష్మణులూ, ఇతరులూ అయోధ్య ప్రయాణం

క్షణములలో అంతా సిద్ధం.

అందరూ సిద్ధం.

రాముడొస్తున్నాడట! సీతారాముడొస్తున్నాడట! 

సౌమిత్రిసమేతుడై భార్యతోకూడి మన అందాలరాముడు వస్తున్నాడట!

 అందరినోట ఒకటే మాట

 రామ!రామ!రామ!

మంత్రి, సామంత, దండనాధులందరూ, కులగురువులూ, రామమాతలు, దశరధపత్నులూ అందరూ నందిగ్రామము చేరినారు.

భరతుడికి ఒకటే ఆత్రం!

Also read: దివ్యవిమానములో దశరథ దర్శనం

 ఇంకా అన్న జాడ కనబడుట లేదు,

ఆయన హనుమతో, ‘‘ఆంజనేయా, కొంపదీసి నీ కోతిబుద్ధి ప్రదర్శించలేదుగదా! ఏడి మా అన్న? ఏడి నా రాముడు? ఇంకా రావటంలేదేమి? అని అడుగుచున్న భరతుని చూసి ఆంజనేయుడు ….

‘‘ప్రభూ! ఒకటి గమనించినావా? నీ ఇంటి ముందు నిన్నటివరకు ఆకురాల్చి కేవలము మోడువలెనున్న ఈ చెట్టు నేడు ఫలపుష్పములబరువుతో నేలకు వంగియున్నది. ఎందువలన?

ఎందువలనా? అంటే రామునికి భరద్వాజుడు, ఇంద్రుడు ఇచ్చిన వరము వలన.

రామదండు ఇటకు రానున్నది అనుటకు అది సూచన.

అదుగో కపి సైన్యపు కోలాహలము!

….

అదుగదుగో విమానము!

అదే పుష్పకము!

విశ్వకర్మ తన మనస్సుచేత దానిని నిర్మించినాడు!

ప్రస్తుతమది రాముని వాహనము!

అదుగో! అల్లదిగో ఒక కోమల నీలమేఘము విమానగ్రమున కన్పట్టుచున్నది!

ఎవరది ?

 ఇంకెవరిది? ఆ నీలమేఘచ్ఛాయ రామచంద్రుని దేహకాంతియే.

ఆ నీలమేఘము క్రమక్రమముగా రాముని ఆకారము దాల్చినది.

అడుగో రాముడు. రాజీవలోచనుడు.

రఘు కుల శ్రేష్ఠుడు. మన రాముడు.

ఆకాశము లోని రామచంద్రుని చూచు అయోధ్యాపురవాసుల ముఖములు కలువలవలె సొగసుగా విచ్చుకొనినవి.

భరతుడు దోసిలికట్టి రామునికి ఎదురుగా ముఖము పైకెత్తి స్వాగతవచనములతో పూజించెను.

విమానము మెల్లగా నేలకు దిగినది

రాముడు తన సోదరుడైన భరతుని గాఢాలింగనములో బంధించెను.

భరతుడు పిమ్మట వొదినగారైన సీతమ్మకు నమస్కరించెను. ఆ తరువాత భరతుడు తన సోదరుడు లక్ష్మణుని ప్రియమార కౌగిలించుకొనెను. సుగ్రీవుని, విభీషణుని తక్కిన వానరవీరులను కుశలప్రశ్నలు వేసెను.

శత్రుఘ్నుడు కూడా భరతుని అనుసరించెను

అంత రామచంద్రుడు,శోకముచేత కృంగిపోయి, శరీరఛాయమారి బలహీనముగా ఉన్న తన తల్లి కౌసల్య వద్దకు వెళ్ళి వినయముగా పాదాభివందనము చేసెను.

అటులనే తక్కిన తల్లులకు, గురువులకు పాదాభివందనములు గావించెను.

కౌసల్యానందవర్ధనా

మహాబాహూ

రఘువంశోద్భవా

రామచంద్రా !

స్వాగతం సుస్వాగతం

అనుచూ పలికిన అయోధ్యాపురవాసుల స్వాగత వచనములతో దిక్కులు మార్మ్రోగినవి!

అంత భరతుడు తాను స్వయముగా శ్రీరామునకు పాదుకలు  తొడిగెను.

Also read: అగ్నిదేవుడి చేతుల మీదుగా సీతను స్వీకరించిన శ్రీరామచంద్రుడు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles