Saturday, December 21, 2024

గంగానదిని దాటిన భరతశత్రుఘ్నులు, పరివారం

రామాయణమ్49

రామలక్ష్మణులను తాను కలిసినది మొదలు వారితో కలిసి గడిపిన సమయాన్ని, లక్ష్మణుడి మనో వేదనను, ఆరాత్రి తాను,లక్ష్మణుడు ముచ్చటించుకున్నసంగతులన్నీ పూసగుచ్చినట్లు చెప్పి,చివరగా వారిని తాను గంగదాటించిన విషయాన్ని కూడా ఎరుకపరచాడు గుహుడు.

ఈ సంగతులన్నీ విన్న భరతుని హృదయంలో శోకం పెల్లుబికి కట్టలు తెంచుకొని ప్రవహించింది. కొరడాలతో కొట్టినప్పుడు ఒక్కసారే కూలబడే ఏనుగులాగ కూలపడి పోయినాడాయన. భరతుడి స్థితి చూస్తున్న శత్రుఘ్నుడుకూడా శోకముతో పట్టుదప్పినిలువలలేక నేలపైబడిన భరతుని కౌగలించుకొని బిగ్గరగా ఏడ్చాడు.

Also read: భరతుడినీ, సైన్యాన్నీ చూసి గుహుడికి గుబులు

ఈ శోకములు విన్న తల్లులు మువ్వురూ భరతుని వద్దకు వచ్చిచేరగా కౌసల్యామాత తన దుఃఖము ఆపుకోలేక తానూ నేలపైపడి భరతుని కౌగలించుకొని ఏడ్వసాగింది.

ఆవిడ తీవ్రమైన బాధతో భరతుని ఉద్దేశించి ‘‘నాయనా ఇంకనీవు ఏడువకురా. మొత్తము రాజవంశము అంతా నీ మీదనే ఆధారపడి ఉన్నది. నీకేమయినా అయితే మేమెవ్వరమూ తట్టుకోలేము. దశరధమహారాజులేడు, రామలక్ష్మణులు చెంతలేరు, నిన్నుచూసుకొని బ్రతుకుతున్నామురా తండ్రీ.  నాయనా ఎందుకీ దుఃఖము? సీతారామలక్ష్మణులగూర్చి ఏ విధమైన అప్రియమైన వార్త నీవు వినలేదు కదా!’’ అని పలుకుతూ తనను ఓదారుస్తున్న పెద్దతల్లి మాటలకు కాస్త తెప్పరిల్లి ఏడుస్తూనే గుహుడితో మరల మరల సీతారామలక్ష్మణుల గూర్చి ప్రశ్నించాడు. ‘‘వారు ఎక్కడ ఉన్నారు? ఏమి తిన్నారు? ఎక్కడ నిదురించారు?’’ ఇలాంటి విషయాలు పదేపదే అడిగితెలుసుకుంటున్నాడు భరతుడు.

Also read: రాముణ్ణి వనవాసం మాన్పించి అయోధ్యకు తీసుకురావాలని భరతుడి నిర్ణయం

అప్పుడు రాముడు నిదురించిన చెట్టు వద్దకు తీసుకెళ్ళాడు గుహుడు. రాముడు అక్కడనే దర్భలమీద శయనించాడన్న సంగతితెలుసుకొని మరల ఆయనలో దుఃఖము పొంగిపొర్లింది. దశరధ కుమారుడైన రాముడే నేలపై పడుకోవలసి వచ్చిందంటే కాలము కంటే బలమైన వాడెవడూ లేడని తెలుస్తున్నది.

న నూనం దైవతం కించిత్ కాలేన బలవత్తరమ్

యత్ర దాశరధీ రామో భూమావేవ శయీత సః

‘‘ఇదిగో ఇది నా అన్నగారు పరుండిన చోటు, ఇదిగో ఈ గడ్డి అంతా ఆయన శరీరపు రాపిడికి నలిగి పోయింది. ఇదిగో ఈ దర్భలమీద ఇంకా బంగారపు  పొడులు అంటుకొనే ఉన్నాయి. మా వదినగారు అలంకారాలేవీ తీయకుండగనే శయనించినట్లున్నది. ఆవిడ ఏమాత్రము దుఃఖించకుండగనే నా అన్నవెంట వెళ్ళినది. అత్యంత సుకుమారి, పతివ్రతా శిరోమణి ఆవిడ! ఈ కష్టాలు ఏవి లెక్కపెట్టినట్లులేదు, భర్త ఉన్న చోటే తనకూ సుఖకరమైనది అనుకొంటున్నది. అయ్యో ఎంత కష్టము వచ్చినది. నేనెంత క్రూరుడను. నావలన భార్యాసహితుడై రాముడు అనాధవలే ఇట్లాంటి పడకలపై నిదురించవలసి వచ్చినదికదా!’’ అని మరల ఏడ్వసాగాడు భరతుడు.

Also read: భరతుడి వ్యథ, కౌశల్య సమక్షంలో ప్రమాణాలు

‘‘ఇందీవరశ్యాముడు! సార్వభౌమకుల సంజాతుడు, సర్వలోకప్రియుడు, ప్రియదర్శనుడు, అసలు దుఃఖమునకు అర్హుడే కాని రాఘవుడు అన్నిసుఖాలు పరిత్యజించి నేలపైపడుకొన్నాడు కదా! లక్ష్మణుడు ధన్యుడు. ఈ సమయంలో ఆయన వెంట ఉన్నాడు. రాముడు అరణ్యములో ఉన్నా ఆయన బాహుబలమే అయోధ్యకు రక్ష! అందుచేతనే ఎవ్వరికీ దీనిని ఆక్రమించాలనే ఆలోచన రాదు. ఈనాడు అయోధ్యా ప్రాకారమునకు రక్షణలేదు. చతురంగబలాలలో యుద్ధసన్నద్ధతలేదు. పట్టణద్వారాలన్నీ తెరచే ఉన్నాయి. అయినా ఒక్కడికికూడా అయోధ్యను కన్నెత్తి చూసే ధైర్యం లేదు. అంటే అది రాముడి శౌర్యప్రతాపాలవల్లకాక మరిదేనివల్లనూ కాదు.

‘‘రాముడు నారచీరలు ధరించి అరణ్యములో ఉంటే నాకు ఈ పట్టువస్త్రము లెందుకు నేను కూడా జటలు, నార చీరలు ధరించి, కందమూలములు తింటూ, నేలపై నేటినుండి శయనింతును గాక’’ అని తీర్మానించుకొన్నాడు  భరతుడు.

ఆ రాత్రి గంగా తీరమందే నివసించి మరునాడు తెలవారుతుండగనే శత్రుఘ్నుని లేపి ‘‘ఇంకా నిదురపోతున్నావేమి త్వరగా గుహుని పిలుచుకొని రా’’ అని తొందరచేశాడు.

Also read: తండ్రి, సోదరుల గురించి తల్లిని ప్రశ్నించిన భరతుడు

.

అప్పుడు శత్రుఘ్నుడు భరతునితో ‘‘అన్నా, అన్న రామన్న అడవులలో ఉంటే నాకు నిదుర ఎలా పడుతుంది? నా మనస్సునిండా రామన్న ఆలోచనలే నేను మేల్కొనే ఉన్నాను! నీ ఆజ్ఞకోసమే ఎదురు చూస్తున్నాను.’’

అదే సమయానికి గుహుడు వచ్చి భరతుడి ఎదురుగా నిలుచొని వారిని కుశల ప్రశ్నలు వేశాడు.

భరతుడికి  సమయం గడుస్తున్నకొద్దీ తొందరహెచ్చవుతున్నది. గుహుడిని త్వరగా నది దాటించమని కోరాడు.

భరతుడి తొందర గమనించాడు గుహుడు. వెంటనే తన నగరులోకి వెళ్ళి వందలకొద్దీ పడవలను నౌకలను సన్నద్ధం చేశాడు.

బయలు దేరటానికి భరతుని ఆజ్ఞ అయ్యిందని తెలుసుకొన్న కొందరు నదిలో దూకి ఈత కొడుతూ బయలుదేరారు. కొందరు అప్పటికే తయారుచేసుకొన్న తెప్పలు నదిలో దించారు. కొందరు కడవల సహాయంతో నీటిలో తేలుకుంటూ వెళ్ళారు.

.

గుహుడు తెప్పించిన నావలన్నీ శ్రేష్టమైనవి. వాటిపేర్లు స్వస్తికములు! అత్యంత దృఢమైన నావలవి.

అందరూ నావలెక్కారు. కొన్నింటి యందు రధ, గజ, తురగాలు ఎక్కించారు. కొన్ని నావలలో జనమంతా ఎక్కి నిల్చున్నారు. కొన్నిటి యందు దశరధాంతఃపురవాసులు ఎక్కారు.

‘హైలెస్సా హైలో హైలెస్సా’ అంటూ గంగలో ప్రయాణము చేస్తున్నాయి ఆ నావలన్నీ. కొంతమంది నావలను నడిపే వారు వాటిని చిత్రవిచిత్రరీతులో నడుపుతున్నారు.

నది అంతా నావలు ఆక్రమించి జలముమీద ఒక మహానగరము నిర్మింపబడెనా అన్నట్లున్నది. భరతుడి నావ   మైత్రీముహూర్తమందు ఆవలిఒడ్డును చేరుకుంది. గుహుడుకూడా వారి వెంట ఉన్నాడు.

..

(మైత్రీ ముహూర్తమంటే ఉదయం 7.04 ని నుండి 8.36 ని.

రోజును పదిహేను భాగాలు చేయగా అందులో మొదటి మూడవ భాగము మైత్రీ ముహూర్తము అనబడుతుంది. అనగా రెండు గడియలు).

అల్లంత దూరాన భరద్వాజ మహర్షి ఆశ్రమము కనపడుతున్నది.

సైన్యాన్ని అక్కడే ఉంచి మహర్షి వశిష్ఠుల వారితో కలిసి భరతుడు ఆశ్రమము వైపుగా అడుగులు వేశాడు.

Also read: భరతుడి పీడకల

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles