Friday, December 27, 2024

తండ్రి, సోదరుల గురించి తల్లిని ప్రశ్నించిన భరతుడు

రామాయణమ్45

అయోధ్య నుండి వచ్చిన దూతలు కేకయ రాజు అశ్వపతికి, యువరాజు యుధాజిత్తునకు నమస్కరించి నిలుచొని, భరతుని వంక చూసి ‘‘మన రాజపురోహితులు, మంత్రులు నిన్ను శీఘ్రముగా తిరిగి రమ్మని కోరినారు. నీతో చాలా తొందరపని ఉన్నదట!’’ అని పలికి వారు తెచ్చిన విలువైన కానుకలను భరతుడి ద్వారా కేకెయ రాజుకు అందించారు.

అప్పటికే తనకు వచ్చిన కలతో దిగులుగా ఉన్న భరతుడు వారి నుద్దేశించి, ‘‘మా తండ్రిగారు క్షేమమేనా? మా రాముడు, మహాత్ముడైన లక్ష్మణుడు వీరికి కుశలమే కదా? పూజ్యురాలు ధర్మమునందే ఆసక్తిగలదీ, ధర్మము నెరిగినదీ, ధర్మమునే చూచేటటువంటిది ధీమంతుడైన రాముని తల్లి కౌసల్యామాత క్షేమమే కదా! ధర్మములు తెలిసినది,లక్ష్మణ,శత్రుఘ్నుల కన్నతల్లి, మా మధ్యమాంబ సుమిత్రామాత కుశలమే కదా!

Also read: భరతుడి పీడకల

తన సుఖమునే కోరుకునేది (ఆత్మ కామా), ఎల్లప్పుడూ తీవ్రముగా ప్రవర్తించేదీ( సదా చణ్డీ), కోపస్వభావము కలదీ (క్రోధనా), తానే బుద్ధిమంతురాలు అనే గర్వము కలది(ప్రాజ్ఞమానినీ), అయిన నా తల్లి కైక ఏ రోగము లేకుండా ఉన్నది కదా? ఆవిడకు కుశలమే కదా?

భరతుడు పలికిన మాటలు విన్న దూతలు! ‘‘ఓ నరశ్రేష్ఢా, నీవు ఎవరి క్షేమము కోరుచున్నావో వారందరూ క్షేమమే. నిన్ను ఐశ్వర్యము, లక్ష్మి వరించుచున్నవి. శీఘ్రముగా రధముపై కూర్చొని ప్రయాణించవయ్యా!’’ …..అని తొందరపెట్టారు.

Also read: దశరథ మహారాజు అస్తమయం

వీరి మాటలు విన్న భరతుడు తాతగారి వైపు తిరిగి ‘‘నన్ను దూతలు తొందరపెడుతున్నారు. మరల మీరెప్పుడు రమ్మనమనిన అప్పుడు వస్తాను’’ అని సెలవు తీసుకొని ఆయన ఇచ్చిన కానుకలు స్వీకరించి వాటిని నెమ్మదిగా వెనుక తీసుకు రమ్మని సేవకులకు చెప్పి తాను శత్రుఘ్నునితో కలిసి బయలుదేరి ఏడవ నాటికి అయోధ్యా నగర పొలిమేరలకు చేరుకున్నాడు.

ఎప్పుడూ సందడిగా కావ్యగోష్ఠులు, గీత వాయిద్యాలు, భేరీ మృదంగ, వీణాధ్వనులు, నృత్యప్రదర్శనలతో కోలాహలంగా ఉండే అయోధ్య ఏ విధమైన జన సంచారములేకుండా బోసిపోయిన వీధులతో, శ్మశాన నిశ్శబ్దంతో అడుగుపెట్టగానే వళ్ళు గగుర్పొడిచే వాతావరణంతో కనపడింది ఆయనకు.

ఆనందశూన్యమైన  అయోధ్య  గోచరమయ్యింది.

ఆయన మనసు ఈ వారం రోజులూ కీడు శంకిస్తూనే ఉన్నది. ఈ వాతావరణం చూడగనే అది మరింతగా బలపడింది.

Also read: దశరథుడిపై కౌసల్య హృదయవేదనాభరిత వాగ్బాణాలు

తన రధ సారధితో…”సారధీ రాజు మరణించినప్పుడు ఏ వాతావరణం ఉంటుందో అది నాకు కనపడుతున్నది. అయోధ్యలోని భవనములన్నీ కళావిహీనము, శోభావిహీనమై కనపడుతున్నాయి. దేవాలయాలలో నిత్యపూజలు జరుగుతున్నట్లుగా లేదు. మాలికల శోభలేదు. అయోధ్య అంతా ఒక నిశ్శబ్దం ఆవరించి ఉన్నది. ఇది నేనెరిగిన అయోధ్యకాదు!’’ అని అంటూ సంతోష హీనుడై తండ్రి గృహంలో ప్రవేశించాడు.

తనను చూడగనే ఎదురు వచ్చి దుమ్మకొట్టుకు పోయిఉన్నాసరే తన శరీరాన్ని ప్రేమతో నిమిరి తన శిరస్సు వాసన చూసి గాఢంగా కౌగలించుకొనే ప్రేమమూర్తి తన తండ్రి అచటలేడు!

తన తల్లి ఇంట్లో ఉన్నాడేమో అని కైక ఇంట అడుగు పెట్టాడు.

కొడుకును చూడగనే ఎగిరి గంతేసి ఆసనమునుండి లేచింది కైక.

(మహర్షి వాల్మీకి కైక గురించి వాడిన విశేషణాలు గమనించండి!

ఆత్మ కామా : తన సుఖాన్నే కోరుకునేది

సదా చణ్డీ : ఎల్లప్పుడూ తీవ్రంగా ప్రవర్తించేది

క్రోధనా : ఎప్పుడూ కోపంగా ఉండేది

ప్రాజ్ఞమానినీ : తానే బుద్ధిమంతురాలిని అనే గర్వము  కలిగినటువంటిది.

మనుషుల స్వభావం గూర్చి మహర్షి వాడే విశేషణాలు రామాయణంలో కోకొల్లలు! వాటిని విశ్లేషిస్తే చాలు! అపారమైన మానవ మనస్తత్వ శాస్త్రం మనకు కరతలామలకమవుతుంది.)

Also read: వాల్మీకి మహర్షి ఆశ్రమంలో పర్ణశాల నిర్మాణం

భరతుని దగ్గరకు తీసుకొని నాయనా ప్రయాణమై ఎన్ని రోజులైనది? అలసట ఏమీ కలుగలేదుకదా? అక్కడ అందరూ కుశలమేకదా?  అని ప్రశ్నల వర్షం కురిపించింది కైక.

అన్నింటికీ వినయముగా సమాధానము చెప్పి, ‘‘అమ్మా! నా తండ్రిగారు ఎక్కడ? ముందు ఆయనను చూడాలి. ఆయనకు పాదాభివందనము చేయాలి. ఎక్కువగా ఆయన నీ గృహములోనే కదా ఉండేది, నేడేమి ఆయన కానరావటంలేదు.

‘‘నీ ఇల్లు అంతా శోభావిహీనముగా ఉన్నది ఎందుకు? అందరి ముఖాలలో దైన్యము కనపడుతున్నది. కారణమేమిటి?’’ అని ప్రశ్నించాడు.

నాయనా!! ప్రాణులన్నింటికి ఏది చివరి గతియో నీ తండ్రి ఆ గతిని పొందినాడు’’ అని చాలా మామూలుగా, అతితేలికగా ఏదో ప్రియమైన విషయం పలుకుతున్నట్లుగా పలికింది కైక!

Also read: భరద్వాజ మహర్షి ఆతిథ్యం, మార్గదర్శనం

ఆ వార్త చెవిన పడీ పడటం తోటే ‘‘అయ్యో చచ్చితి’’నంటూ నేలమీద దబ్బున పడిపోయాడు భరతుడు.

మొదలు నరికిన చెట్టులా పడిపోయి తీవ్రమైన వేదనతో దుఃఖిస్తున్న కుమారుడిని లేవ నెత్తింది కైక.

‘‘అమ్మా! నా అన్న రామునికి పట్టాభిషేకమో మరి ఏ ఇతరమైన యజ్ఞమో చేయుచూ నన్ను రమ్మన్నాడనుకొని ఎంతో సంతోషంతో వచ్చాను. తండ్రికి అంతిమ సంస్కారములు చేసిన రామలక్ష్మణులు ధన్యులు.

అమ్మా త్వరగా రామునికి కబురుపంపు నేను వచ్చానని.

ఏ కార్యమునైనా అవలీలగా సాధించే ఆ రాముడే నా సోదరుడు, తండ్రి, బంధువు, ఆయనకు నేను దాసుడను. తండ్రి పాదములు పట్టుకొనడానికి నోచకుంటిని  ఇక అన్నగారే నా తండ్రి, ఆయన పాదములు పట్టుకోవాలి! ఇప్పుడిక ఆయనే నా గతి. అమ్మా చనిపోతూ చనిపోతూ నా తండ్రి ఏమి పలికినాడు?’’ అని అడిగిన భరతుడిని చూసి, “సీతాసమేతుడై తిరిగి వచ్చిన రాముని మహాబాహువైన లక్ష్మణుని చూడగలిగిన వారు ధన్యులు అంటూ ‘హా రామా హా సీతా హా లక్ష్మణా’ అంటూ ప్రాణాలు విడిచాడు నీ తండ్రి’’ అంటూ నిస్సిగ్గుగా పలికింది కైక.

ఇది ఇంకొక అప్రియవార్త భరతునకు.

‘‘ఎక్కడికెళ్ళాడు రాముడు?  ఇపుడిక్కడలేడా?’’ అని అడిగిన భరతునికి ఏదో ప్రియమైన విషయం చెపుతున్నట్లుగా ‘‘రాముడు దండకారణ్యమునకు పంపబడినాడు” అని అన్నది కైక.

‘‘రాముడు దేశం నుండి ఎందుకు వెళ్ళ గొట్టబట్టాడు? అధర్మకార్యము ఏమైనా చేశాడా? ఏ బ్రాహ్మణుని ధనాన్ని అపహరించలేదు కదా? ఏ వ్యక్తిని అకారణముగా హింసించ లేదు కదా? పరుల భార్యలపై కోరిక చూపలేదు కదా? పసిపిల్లలను చంపేవాడిని వెడలకొట్టినట్లు రాముని దండకారణ్యమునకు ఎందుకు పంపినారు?’’  ఆవేదనతో తల్లిని ప్రశ్నిస్తున్నాడు భరతుడు!

Also read: కల్లోల సాగరమై, తేరుకొని, దృఢమైన రాముడి మనస్సు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles