Sunday, December 22, 2024

భరతుడి వ్యథ, కౌశల్య సమక్షంలో ప్రమాణాలు

రామాయణమ్46

మూర్ఖురాలూ తానే బుద్ధిమంతురాలు అనే గర్వము కల కైక భరతుని మాట విని ఇలా అన్నది.

‘‘రాముడు పరుల భార్యలను కంటితో చూడటమా!

పరుల ధనము అపహరించటమా?

పరులను హింసించడమా? అలాంటివి కలలో కూడ చేయడు.

Also read: తండ్రి, సోదరుల గురించి తల్లిని ప్రశ్నించిన భరతుడు

‘‘నేనే నీ తండ్రిని కోరాను రాముని అరణ్యమునకు పంపి నీకు రాజ్యము ఇమ్మని. నీ తండ్రి నా కిచ్చిన వరమునకు అనుగుణముగా నేనడిగినట్లే చేసినాడు. రాముడు కనపడక అతని మీద గల ప్రేమ తో నీ తండ్రి క్రుంగిపోయి మరణించాడు. భరతా నిష్కంటకమైన రాజ్యమును ఇక స్వీకరించు!’’

అమితమైన దుఃఖము మనస్సును ఆవరించింది భరతునకు పుండుమీద కారం చల్లినట్లు తండ్రి మరణానికి తోడు తల్లి చేసిన బుద్ధిమాలిన పని ఆయనలో అంతులేని వేదన రగిల్చింది.

అనంతమైన ఆవేదన, ఎదురుగా ధర్మాధర్మములు పాటించని కన్నతల్లి. ఇక ఉండ బట్టలేక, ‘‘ఓసీ! నీవు కాలరాత్రి వలే నా కులమునకు దాపురించావు. నా తండ్రి భగభగమండే కొరివిని కౌగలించుకొంటున్నానని తెలుసుకొనలేక పోయాడు. నా తండ్రిని ఎందుకు చంపావు? ధర్మాత్ముడైన  నా అన్నని ఎందుకు అడవికి పంపావు?

Also read: భరతుడి పీడకల

‘‘రాముడు తనకు తన కన్నతల్లి ఎలాగో నిన్ను కూడా అలాగే చూసుకున్నాడు కదా! కౌసల్యామాత నిన్ను తోడబుట్టినదాని వలే ఆదరించింది కదా! రాముడి దర్శనమే పుణ్యము కలిగిస్తుంది. అలాంటి రాముడికి నారచీరలు కట్టి అడవులకు పంపటానికి నీకు మనసెలా ఒప్పింది?

‘‘రాముడి పట్ల నాకు గల భక్తి నీకు తెలవదు! రామలక్ష్మణులు దగ్గరలేకుండా ఏ విధంగా పాలించగలననుకొన్నావు? అయినా రాముడిలాంటి పెద్ద వృషభము మోయగల కాడిని నాలాంటి దూడ మోయగలుగుతుందా?

ఇక్ష్వాకుల వంశంలో ఎప్పటికీ జ్యేష్టుడే రాజు!  క్రూరురాలా నీవు కోరిన రాజ్యము ఎప్పటికీ నీకు లభించదు! నాకు నీవీలోకములో గొప్ప అపకీర్తి తెచ్చిపెట్టావు!

Also read: దశరథ మహారాజు అస్తమయం

నీ తండ్రి అశ్వపతి గొప్ప ధర్మాత్ముడు. ఆయనకు తీరని కళంకము తెచ్చావు. అటు పుట్టినింటికీ, ఇటు మెట్టినింటికీ తీరని ద్రోహము చేశావు. రాముని అరణ్యమునుండి తిరిగి రప్పించెదను. నా అన్న రామన్న నా తోటి శాశ్వతముగా మాట్లాడడని నిన్ను చంపకుండా వదిలి పెడుతున్నాను. ఇక ఎంతమాత్రము నీ పాప భారము నేను మోయజాలను.’’

అని భరతుడు పెట్టే కేకలు రాజాంతఃపురమంతా మారుమ్రోగుతున్నాయి.

భరతుడి అరుపులు, కేకలు, పెడబొబ్బలతో అంతఃపురం మారుమ్రోగిపోతున్నది.

భరతుడి గొంతు గుర్తుపట్టిన కౌసల్య సుమిత్రతో ‘‘అదిగో భరతుడు వచ్చినట్లున్నాడు. ఆ గొంతు అతనిదే కదా’’ అని ఆవిడ అంటూ ఉండగనే భరతశత్రుఘ్నులు పెత్తల్లి చెంతకు చేరారు.

ఆవిడ అప్పటికే భర్తృవియోగం, పుత్రుడు దూరమవ్వటం అనే రెండు పదునైన దుఃఖాలు మనస్సును కోస్తూ ఉంటే మాటిమాటికీ సంజ్ఞతప్పి ఏడుస్తూ నేల మీదపడి దొర్లుతూ అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్నది.

 అటువంటి కౌసల్యామాతను చూడగనే భరతుడి హృదయంలో అంతులేని వేదన పుట్టింది.

నేలమీద పడి ఉన్నది మహారాణి కౌసల్య!

.. మహాధానుష్కుడు, జగదేకవీరుడైన రాముడి కన్నతల్లిని అలా చూడలేక పోయాడు భరతుడు.

వెంటనే జలజలకన్నీరు కారుస్తూ కౌసల్యామాతను లేవనెత్తి ఆవిడను కౌగలించుకొన్నారు భరతశత్రుఘ్నులిరువురూ.

Also read: దశరథుడిపై కౌసల్య హృదయవేదనాభరిత వాగ్బాణాలు

భరతుని చూడగనే కౌసల్య ‘‘నాయనా ఏ శత్రుబాధలేని రాజ్యము నీకు లభించినదికదా! ఏమి ఆశించి నా కొడుకుకు నారచీరలు కట్టబెట్టి నీ తల్లి వాడిని అడవులకు పంపింది? నా కొడుకున్నచోటికే నన్ను కూడ పంపివేయి. ఈ రాజ్యము హాయిగా నీవు ఏలుకోవచ్చు.’’

పుండును కెలికి సూదితో గుచ్చినట్లున్నాయి కౌసల్యామాత మాటలు. భరతుడి వేదన అంతకంతకూ హెచ్చింది. దానికి అంతం లేకుండా పోయింది…

పెద్దతల్లికి చేతులు జోడించి నమస్కరిస్తూ, ‘‘అమ్మా! ఏ పాపము తెలియని నన్నెందుకు నిందిస్తావు? అన్నమీద నాకు గల ప్రేమ, భక్తి నీవెరుగనివా? అమ్మా, అన్నగారి అరణ్యవాసానికి నా సమ్మతి ఉన్నట్లయితే.. సూర్యభగవానుడి ఎదురుగా మలమూత్ర విసర్జన చేసేవాడికి ఏ పాపం చుట్టుకుంటుందో అది నాకు చుట్టుకుంటుంది. జీతము ఇవ్వకుండా పని చేయించుకొన్న యజమానికి ఏ పాపము చుట్టుకుంటుందో అది నాకు కలుగుతుంది. మాట ఇచ్చి తప్పినవాడికి, ప్రజల రక్షణ మరచిన రాజుకు ఏ పాపము చుట్టుకుంటుందో అది నాకు చుట్టుకుంటుంది. రణరంగంలో పోరాడి మరణించక వెన్నుచూపి పారిపోయినవాడికి ఏ పాపం చుట్టుకుంటుందో అది నాకు చుట్టుకుంటుంది. ఆవులను కాలితో తన్నినవాడికి, పెద్దలను దూషించినవాడికి, మిత్రద్రోహము చేసిన వాడికి ఏ పాపం చుట్టుకుంటుందో అది నాకు చుట్టుకుంటుంది.

‘‘ఎదుటివాడు విశ్వాసముంచి చెప్పిన రహస్యాన్ని బహిర్గతపరచినవాడికి ఏ పాపం చుట్టుకుంటుందో అది నాకు చుట్టుకుంటుంది. ఇంటిలోని భార్యాపిల్లలకు, అతిధులకు, బంధువులకు ఎవ్వరికీ పెట్టకుండా తానొక్కడే మృష్టాన్న భోజన మారగించే వాడికి ఏ పాపం చుట్టుకుంటుందో అది నాకు చుట్టుకొను గాక. అమ్మకూడని వస్తువులు లక్క, మధువు, లోహము, విషము, మాంసము అమ్మేవాడికి ఏ పాపము చుట్టుకుంటుందో అది చుట్టుకొను గాక. నాకు ఆ ఉద్దేశ్యమే ఉండి నట్లయితే కుండ పెంకు చేతబట్టి చినిగిన గుడ్డలు కట్టి భిక్షమెత్తుకొంటూ, పిచ్చివాడివలే భూమి మీద తిరుగుదును గాక..సంధ్యా సమయాలలో నిదురించే వాడికి కలిగే పాపము నాకు కలుగు గాక. పరభార్యా సంగమము చేసిన వానికి ఎట్టిపాపము కలుగునో అట్టిపాపము నాకూ కలుగు గాక.’’

‌Also read: వాల్మీకి మహర్షి ఆశ్రమంలో పర్ణశాల నిర్మాణం

ఈ విధంగా కౌసల్యను ఓదార్చటానికి ప్రయత్నం చేస్తూ దుఃఖ భారంతో తానుకూడ నేలమీద పడిపోయాడు భరతుడు.

..

గమనిక:

భరతుడి మాటలలో….ఏమేమి చేస్తే పాపము చుట్టుకుంటుందో చాలా స్పష్టంగా చెప్పారు.

….

Also read: భరద్వాజ మహర్షి ఆతిథ్యం, మార్గదర్శనం

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles