Sunday, December 22, 2024

రాముడి పాదుకలతో చిత్రకూటం నుంచి అయోధ్యకు బయలుదేరిన భరతుడు

రామాయణమ్56

ఎవరి మాట వారిదే. ఎవరి పట్టుదల వారిదే.

ఈ రాజ్యము నాది కాదు నీవే ఏలుకో అని భరతుడు! తండ్రి కిచ్చిన మాట మీద నుండి రవ్వంతైనా జరగను అని రాముడు! ఎవరి పట్టు వారిదే. ఈ ధర్మమూర్తులను చూసి అక్కడ చేరిన ఋషిగణమంతా ప్రశంసించింది.

కానీ వారికి తెలుసు రావణ సంహారం జరగాలంటే రాముడు అడవిలో ఉండాల్సిందే. లోక కళ్యాణం కోసం వనవాసిగా రాముడు జీవించాల్సిందే.

Also read: తండ్రి ఆజ్ఞ అమలు కావలసిందేనన్నరాముడు

అందుకే వారంతా ముక్తకంఠంతో ‘‘భరతా, నీవు ఉత్తమ కులసంజాతుడవు. గొప్ప బుద్ధిమంతుడవు. మంచి ఆచారము తెలిసిన వాడవు. గొప్ప కీర్తికలవాడవు. నీకు నీ తండ్రిపై గౌరవ భావమున్నచో రాముడు చెప్పినట్లుగా చేయి. దశరథుడు కైక ఋణము తీర్చుకున్నందువలననే స్వర్గమునకు వెళ్ళగలిగినాడు. ఇప్పుడు రాముడు వెనుకకు మరలెనా దశరథునకు అనృతదోషం కలిగి, స్వర్గంనుండి నెట్టివేయబడతాడు….’’అని స్పష్టంగా చెప్పగా…

అవి విన్న భరతుడు గజగజవణికిపోతూ మాటలు తొట్రుపడుతుండగా ‘‘రామా, రాజ్యము పాలించే సమర్ధత నాకు లేదయ్యా!’’ అని అన్నాడు

‘‘అందరూ నీ కోసమే ఎదురు చూస్తున్నారు. నీవు రావలసినదే’’ అని ప్రార్ధిస్తూ రాముడి కాళ్ళమీద పడ్డాడు.

Also read: జాబాలిని చీవాట్లు పెట్టిన రాముడు, వశిష్టుడి సాంత్వన వచనాలు

భరతుడిని దగ్గరకు తీసుకొని, ‘‘భరతా, నీవు సమర్ధుడవు కావని ఎవరన్నారు? నీకు గురు శిక్షణ, ఉత్తమమైన బుద్ధి వున్నాయి. బుద్ధిమంతులైన అమాత్యులతో కలిసి ఎంత గొప్ప కార్యాన్నైనా చేయగల సమర్ధుడవు నీవు. నీ తల్లి కైక   కోరిక వల్లనో, ఆశవల్లనో  నీ కొరకు ఇంత చేసినది. నీవు దానిని మనసులో ఉంచుకొనక ఆవిడను గౌరవించు.’’

రాముడి దృఢసంకల్పానికి భరతుడు తలవొగ్గక తప్పలేదు.

‘‘బంగరు పాదుకలు రెండు రామునికిచ్చి ఇవి నీవు నీ కాళ్ళతో తాకి నాకు ఇవ్వు! ఈ పాదుకలే ఇక నుండీ రాజ్యమేలుతాయి.’’

అంత రాముడు ఆ పాదుకలను ఒకసారి తొడుగుకొని విడిచి భరతునకు ఇచ్చాడు.

……

చిత్రకూటపర్వతము మీద జరిగిన సమావేశము బహుచిత్రమైనది. ఎవరికి వారు వారి ప్రాణాలను అక్కడ వదలి కేవలం శరీరాలతో మాత్రమే అయోధ్యకు పయనమయ్యారు.

శ్రీ రాముడు అనే అయస్కాంతము వారి ప్రాణాలను తనతోనే ఉంచుకుంది.

Also read: తండ్రి ఆజ్ఞను శిరసావహించవలసిందే: భరతుడితో రాముడు

అయోధ్యలో మునుపటి అందములేదు

జనుల ముఖాలలో ఆనందము లేదు

ఎంతో ఉత్సాహంగా వుండే వారు వారంతా!

జీవితపు ప్రతిక్షణము ఉత్సవమే వారికి  రాముడున్న రోజులలో.

ఇప్పుడు అవేవీ లేవు. బ్రతుకు ఈడుస్తున్నారు, అంతే!

శ్మశాన నిశ్శబ్దాన్ని సంతరించుకొని బావురుమంటున్న అయోధ్యలో ఉండబుద్ధికాలేదు భరతుడికి. వచ్చీరావడంతోనే అన్నపాదుకలు నెత్తిన పెట్టుకొని నందీగ్రామం బయలు దేరాడు.

మంత్రిగణమంతా ఆయన వెంట బయలుదేరింది.

ప్రతి చిన్నవిషయాన్ని భక్తితో పాదుకలకు నివేదించి మాత్రమే రాచకార్యాలు చక్కబెడుతున్నాడు  భరతుడు.

అక్కడ చిత్రకూటం మీద మునులందరూ రాముడిని చిత్రంగా చూడటం మొదలు పెట్టారు. వారి చూపులు అదోరకంగా ఉంటున్నాయి.

Also read: భరతుడి యోగక్షేమాలు అడిగిన రాముడు

రాముడికి అనుమానం కలిగింది విషయం ఎమై ఉంటుందా అని .

కులపతి అయిన ఒక వృద్ధతాపసిని అడిగాడు.

ఆయన   ‘‘రామా! మేమంతా వలస వెడుతున్నాము. నీవు వచ్చిన దగ్గర నుండీ నీ మీద కక్షకట్టిన రాక్షసమూక మమ్ములను ప్రశాంతంగా ఉండనీయటం లేదు. తాపసులను చంపుతున్నారు. యజ్ఞవిధ్వంసం కావిస్తున్నారు. బ్రతుకు భారమయ్యింది రామా ఇక్కడ’’ అని వాపోయాడు.

అందుకు రాముడు ‘‘మీకేమీ భయం లేదు నేనున్నాను’’ అని చెపుతున్నా వినిపించుకోకుండా అందరూ బయలు దేరి వెళ్ళిపోయారు.

రాక్షస మాయ నుండి సీతాదేవికి భయం కలుగకుండా ఆవిడను అంటిపెట్టుకొని రాముడు కొన్ని రోజులు ఆశ్రమంలోనే ఉండిపోయాడు. ఆయనకు ఇంకా ఎక్కవరోజులు అక్కడే ఉండటానికి మనస్కరించలేదు. పైగా ఆ ప్రాంతమంతా సైన్యము విడిది చేసినందువల్ల చిత్తడిగా తయారయి శోభావిహీనంగా మారిపోయింది.

Also read: రాముడి పాదాల చెంతకు చేరిన భరతుడు

బయలు దేరాడు రాఘవుడు సతీ సోదర సమేతంగా.

బాటలు నడచినడచి అత్రి మహర్షి ఆశ్రమం చేరుకున్నాడు.

(అత్రి మహర్షి సప్తర్షులలో ఒకరు. ఆయన సామాన్యుడు కాడు.

తాపత్రయములుమూడు. అవి ..ఆధ్యాత్మిక ,అధిభౌతిక, అధిదైవికములు..

ఈ మూడు తాపాలు కూడా లేని మహాజ్ఞాని .అ త్రి..అనగా మూడు లేని వాడు అని అర్ధం! ఏ మూడు అంటే పైన చెప్పబడిన తాప త్రయములు.)

Also read: భరద్వాజ మహర్షి ఆతిథ్యంలో సేద తీరిన భరతుడి సేన

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles