వోలేటి దివాకర్
ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా వెలువడక ముందే రాజమహేంద్రవరం సిటీలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. యువనాయకులైన వైసిపి అభ్యర్థి మార్గాని భరత్‌రామ్, టిడిపి అభ్యర్థి ఆదిరెడ్డి వాసులకు రాజమహేంద్రవరంలో గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం చారిత్రాత్మకమైన సుబ్రహ్మణమైదానంలో భరత్ సిద్ధం సభను నిర్వహించారు. ఈ సభలో వైసిపి ఫైర్ బ్రాండ్లు కొడాలి నాని, పేర్ని నాని, వైసిపి ఎంపి అభ్యర్థి డాక్డర్ గూడూరి శ్రీనివాస్ పాల్గొని ప్రసంగించారు. ఈ సభలో భరత్ వాసు తండ్రి, మాజీ పమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును ఉద్దేశించి చెప్పు చూపించడం సంచలనం సృష్టించింది. సభకు రాకుండా వలంటీర్‌ను అప్పారావు బెదిరించిన ఆడియోను సభలో వినిపించిన భరత్ చెప్పు దెబ్బలు తప్పవంటూ చెప్పు చూపించి, హెచ్చరించారు.
దీనికి ప్రతిగా మంగళవారం ఆదిరెడ్డి అప్పారావు, జనసేన సిటీ ఇన్‌చార్జి అత్తి సత్యనారాయణ విలేఖర్ల సమావేశంలో ఘాటుగా స్పందించారు. ఏడు నియోజకవర్గాలకు ఎంపిగా పనిచేయాల్సిన భరత్ రాజమహేంద్రవరానికి పరిమితమయ్యారని, మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో ఆయనకు చెప్పుదెబ్బలు తప్పవని ఆదిరెడ్డి హెచ్చరించారు. అత్తి సత్యనారాయణ రౌడీయిజం చేస్తే బెల్టు దెబ్బలు తప్పవంటూ తన బెల్టును ప్రదర్శించడం గమనార్హం.
ప్రస్తుతానికి చెప్పులు, బెల్టులకే పరిమితమైనా రానున్న రోజుల్లో ప్రశాంతమైన రాజమహేంద్రవరంలో ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇద్దరు యువ నాయకులు ఎన్నికల ప్రచారంలో పోటాపోటీగా మాటల యుద్ధానికి దిగితే వారి అనుచరులు బాహాబాహీకి దిగే అవకాశాలు ఉన్నాయి.
కొడాలి నాని కూడా ఆదిరెడ్డి తీరుపై ఆడపిల్లకు ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వటం మగతనమా అంటూ వ్యాఖ్యానించి, ఆజ్యం పోశారు.
టిడిపి అధినేత చంద్రబాబునాయుడు 20 శాతం ఓట్లున్న కాపు సామాజిక వర్గానికి చెందిన జనసేన పార్టీకి 24 సీట్లు, 3శాతం ఉన్న కమ్మ సామాజిక వర్గానికి 30 సీట్లు ఇచ్చాడని ధ్వజమెత్తారు. సిగ్గు లేకుండా ఇచ్చిన సీట్లు తీసుకున్న పవన్ కళ్యాణ్ ను కాపులే ఓడిస్తారని, జన సైనికులే చంద్రబాబునాయుడిని పాతాళానికి తొక్కేస్తారని హెచ్చరించారు. టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిన నాదెండ్ల భాస్కరరావు కుమారుడు మనోహర్ తో కలిసి మరో వెన్నుపోటుదారుడు చంద్రబాబునాయుడు పవన్ కల్యాణ్ కు వెన్నుపోటు పొడుస్తారని జోస్యం చెప్పారు.