హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి భారత రత్న పురస్కారం ఇవ్వాలనీ, భారత రత్నకు అవసరమైన సకల అర్హతలూ ఆయనకు ఉన్నాయనీ ఎంఎల్ సీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టి. జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వైఎస్ ఆర్ 72వ జయంతి సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ జీవన్ రెడ్డి, పాలమూరు-చేవెళ్ళ ప్రాజెక్టుకే కొత్తపేరు పెట్టి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు (కేసీఆర్) నిర్మించారనీ జీవన్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న ప్రాజెక్టులు కానీ తెలంగాణలో కేసీఆర్ నిర్మిస్తున్న ప్రాజెక్టుకు కానీ అంకురార్పణ చేసింది వైఎస్ఆర్ మాత్రమేనని ఆయన పునరుద్ఘాటించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక సంక్షేమ కార్యక్రమాలకు వైఎస్ కారకుడని, ఆయన చిత్రపటం తెలంగాణలో ప్రతి ఇంట్లో ఉంటుందని జీవన్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రజలను వైఎస్ అమితంగా ప్రేమించారని, ఆయన అన్ని సంక్షేమ పథకాలనూ రాజకీయాలకూ, కులాలకూ, ప్రాంతాలకూ, మతాలకూ అతీతంగా అమలు పరిచారని వివరించారు.
వైఎస్ జయంతి సందర్భంగా ఆయన కుమార్తె వైఎస్ షర్మిల గురువారం ఉదయం బెంగళూరు నుంచి కారులో బయలుదేరి ఇడుపులపాయ వెళ్ళారు. అక్కడ తండ్రి సమాధివద్దప్రార్థనంలు చేసి మధ్యామ్నం ఒంటి గంటకల్లా ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంలో దిగారు. పంజగుట్టలో వైఎస్ విగ్రహానికి పూలదండ వేసి నమస్కారం చేసి జేఆర్ సీ ఫంక్షన్ హాలులో సమావేశానికి హాజరై వైఎస్ఆర్ టీపీని స్థాపిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇడుపులపాయ వెళ్ళి తండ్రి సమాధి దగ్గర ప్రార్థనలు చేశారు.