Thursday, November 7, 2024

భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును బారత రాష్ట్ర సమితిగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో జరిగిన ఒక మహాసభ తీర్మానం జయజయధ్వానాల, మిన్నంటిన చప్పట్ల మధ్య ఆమోదించింది. కేసీఆర్ వెంటనే దిల్లీకి వెడతారు. ఎన్నికల కమిషన్ కు నివేదన సమర్పిస్తారు. కారు గుర్తూ, జెండా, గులాబీ రంగు తమతోనే ఉండాలని ఎన్నికల కమిషన్  కు ఆయన విజ్ఞప్తి చేయబోతున్నారు. బుధవారంనాడు టీఆర్ఎస్ భవన్ లో జరిగిన కార్యక్రమం దేదీప్యమానంగా సాగింది.

భారత రాష్ట్ర సమితి తీర్మానం

 ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ పేరును ‘భారత రాష్ట్ర సమితి ’ గా మార్చుతూ  కెసిఆర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని జయ జయ ధ్వానాల మధ్య సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.

ఈ సందర్భంగా టిఆర్ఎస్ అధినేత సిఎం కెసిఆర్ ఇంగ్లీషులో చదివిన తీర్మానం :

Telangana Rastra Samithi  party has conducted its General Body meeting  on 5-10-2022 at its party headquarters in  Hyderabad. The party General Body meeting unanimously resolved to change the name of the party from Telangana Rastra Samithi to Bharat Rashtra Samithi,  with a view to expand its activities nationwide, accordingly the constitution of the party is also amended.

ఏ పని చేసినా అర్థవంతంగా చేయాలి

ఏ పని చేసినా అర్థవంతంగా, ప్రకాశవంతంగా చేయాలి. సరిగ్గా 21 సంవత్సరాల క్రితం కొండా లక్ష్మణ్ బాపూజీ గారి నివాసం జలదృశ్యంలో ప్రారంభమైన మనం., నాటి సమైక్య పాలనలో కృంగి కృశించి పోయిన తెలంగాణ ప్రజానీకాన్ని కడుపుల పెట్టుకోని ముందుకు సాగినం. రాష్ట్రాన్ని సాధించుకుని అనతికాలంలోనే వ్యవసాయం, విద్యుత్తు, సాగునీరు, తాగునీరు సమస్త రంగాలలో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసుకుంటూ పోతున్నం. ఇవన్నీ ఎట్లా సాధ్యమైతున్నవి అని పక్కరాష్ట్రాల వాళ్ళు ఆశ్చర్య పడుతున్నరు. ఎంచుకున్న కార్యాన్ని యజ్జం లాగా దీక్షగా చేసుకుంటూ వచ్చినం కాబట్టే ఇదంతా సాధ్యమైతున్నది.

అధికార పార్టీలు దేశానికి చేసింది శూన్యం

75 ఏండ్ల స్వతంత్ర భారతంలో దేశాన్నేలిన పార్టీలు గద్దెనెక్కడం గద్దెను దిగడం తప్ప దేశానికి చేసిందేమిలేదు. ‘జై తెలంగాణ’ నినాదంతో మనమే ఉద్యమించినం, మన నెత్తిన భారం పెట్టుకున్నం, అనుకున్నది సాధించినం. ఇతర రాజకీయ పార్టీలకు రాజకీయాలు ఒక ఆట వంటిది. కానీ టిఆర్ఎస్ పార్టీ కి అదో టాస్క్ వంటిది. తెలంగాణ అభివృద్ధికోసం కార్యకర్తల్లాగా మనం కమిట్మెంట్ తో పనిచేసినం. అంతగా కష్టపడ్డం కాబట్టే గొప్ప గొప్ప విజయాలు సాధించినం.  రాష్ట్రం వచ్చిన నాడు తెలంగాణ తలసరి ఆదాయం ఒక లక్ష రూపాయలు మాత్రమే ఉండే…కానీ నేడు 2 లక్షల 78 వేల రూపాయలకు పెరిగింది. తెలంగాణ జిఎస్డీపీ 2014 లో 5 లక్షల 6 వేలుంటే నేడు 11 లక్షల 50 వేలకు చేరుకున్నది.

 ఇంతటి అభివృద్ధిని సాధించడానికి మనం తెలంగాణలో కష్టపడి పనిచేసినట్టే.. దేశం కోసం కూడా మనం కష్టపడి పనిచేసి సాధించి చూపెడుదాం. జాతీయ పార్టీ పెట్టాలని ఆషామాషీగా తీసుకుంటున్ననిర్ణయం కాదు…అన్నీ చేసి చూయించి బలమైన పునాదులమీదినించే నిర్ణయం తీసుకుంటున్నం. భారత దేశం రాష్ట్రాల సమాఖ్య.  రాష్ట్రాలు దేశం  రెండు కలిసి అభివృద్ధి చెందితేనే సమగ్రాభివృద్ధి సాధ్యం. మన తెలంగాణ జీఎస్డీపీ వాస్తవానికి 14.5 లక్షల కోట్ల రూపాయలుండాల్సింది. కానీ హ్రస్వదృష్టితో కేంద్రం అనుసరిస్తున్న అసంబద్ధ విధానాల వల్ల ఇంకా కూడా అందుకోవాల్సినంత అభివృద్దిని విజయాలను తెలంగాణ అందుకోలేక పోతున్నది. ఈ దేశ స్వాతంత్ర్యం కోసం సాగిన నాటి  త్యాగాలు చాలా వరకు నెరవేరకుండానే పోయినాయి.

రెండు వివక్షలు

రెండు ముఖ్యమైన వివక్షలు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఒకటి లింగ వివక్ష రెండోది కుల వివక్ష. లింగ వివక్ష వల్ల దేశ జనాభాలోని సగం జనాభా  అయిన మహిళలు అభివృద్ధిలో భాగస్వాములు కాకపోవడం వల్ల నష్టం జరుగుతున్నది. అదే సందర్భంలో దేశ జనాభాలో 20శాతం దళితులు కూడా కుల వివక్ష వల్ల దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోలేకపోతున్నరు.  అటు మహిళా శక్తి, ఇటు దళిత శక్తి నిర్వీర్యం కావడ్డ వల్ల అభివృద్ధి జరగట్లేదు.

అదే సందర్భంలో పేదరికం పేరుతో అగ్రవర్ణాలని చెప్పబడే వారిలో కూడా ఎందరో అవకాశాలను కోల్పోతున్నరు. ఇవన్నీ మారకుండా దేశంలో సమూల మార్పు జరగదు. స్థూలమైన విషయాల్లో మౌలిక మైన మార్పు రాకుండా సమాజిక పరిస్థితుల్లో మార్పు రావడం సాధ్యం కాదు. ఏ దేశాలైతే.. ఏ సమూహాలైతే.. తాము నిత్యం అనుసరిస్తున్న సాధారణ పని విధానం నుంచి బయటపడతాయో.., ఆ సమాజాన్ని వినూత్న పంథాలో నడిపిస్తాయో, అటువంటి దేశాలే గుణాత్మకంగా మారినయి. మార్పుకోరుకోని సమాజాలు మారలేదు. ఆ దిశగా ప్రజలను చైతన్యపరిచిన సమాజాలే ఫలితాలు సాధించాయి.

1980 వరకు చైనా జిడిపి మన దేశం కన్నాతక్కువగా ఉండేది. 16 ట్రిలియన్ డాలర్ల ఎకనామితో చైనా నేడు ప్రపంచంలోనే ప్రబలమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. సౌత్ కొరియా, జపాన్, మలేసియా వంటి దేశాల్లో అద్భుతాలు జరిగాయి.

నేడు దళిత బంధు అనేది ప్రత్యేకంగా దళిత జనోద్దరణకోసం అమలు చేస్తున్న కార్యక్రమం. సమాజంలోని ఇతరులకు అందే అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి పథకాలు దళితులకు కూడా అందుతున్నాయి. వాటితో పాటు దళిత బంధు పథకం వారికి అధికం. ఇది వారి అభివృద్ధి కోసమే అమలు చేస్తున్న ప్రత్యేక పథకం. రాష్ట్రంలోని 8 లక్షల 40 వేల కుటుంబాలకు దళిత బంధు, రైతుబంధు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది.

వ్యవసాయరంగం నిర్లక్ష్యం

ఇదే విషయాన్ని, ఇక్కడకు వచ్చిన ప్రముఖ దళిత నాయకులు ఎంపీ తిరువలన్ కు చెప్తే ఆయన ఆశ్చర్యానికి గురయ్యారు. రాష్ట్రంలో  17 లక్షల 50 వేల దళిత కుటుంబాలున్నాయి. వారందరికీ దశల వారీగా దళిత బంధును అందిస్తూ బాగుచేసుకుంటూ ముందుకు సాగుతాం. తెలంగాణ లో అమలవుతున్న ఇటువంటి ఆవిష్కరణలు దేశ స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ళలోనే అమలు చేసి వుంటే బాగుండేది. మనం ‘అవుటాఫ్ బాక్స్’ ఆలోచన చేసి వినూత్న కార్యక్రమాలను ఆవిష్కరించినం కావట్టే ఇంతటి అభివృద్ధి సాధ్యమైంది.

దేశంలో నిర్లక్ష్యానికి గురైన మరో రంగం వ్యవసాయ రంగం. దేశంలోని రైతులు తమ హక్కుల సాధన కోసం 13 నెలల కాలం పాటు రోడ్ల మీద ధర్నాలు చేసే పరిస్థితి తలెత్తడం దారుణం.

ఈ నేపథ్యంలో …భారత దేశ రాజకీయ రంగాన్ని ప్రభావితం చేసేందుకే మనం జాతీయ పార్టీతో ముందడుగు వేస్తున్నం. దేశ ప్రజల సమస్యలనే ఎజెండాగా చేసుకుని మనం జాతీయ పార్టీ జండాను పట్టుకోని పోతున్నం.

అఖిలేష్, తేజస్వీలను నేనే రావద్దన్నా

మనం తలపెట్టిన చారిత్రక కార్యక్రమానికి యుపి మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ లు వస్తామన్నారు. కానీ వారి వారి పరిస్థితులను అర్థం చేసుకుని నీనే వద్దన్నాను. ఇది కేవలం పార్టీ పేరు మార్పిడి కోసం జరిగే అంతర్గత సమావేశం మాత్రమే. తర్వాత  జరిగే లాంచింగ్ కార్య్రమానికి పిలుచుకుంటానని చెప్పాను. మనతో కలిసి ముందుకు సాగడానికి దేశవ్యాప్తంగా అనేక పార్టీల నేతలు ముందుకు వస్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి మాజీ భారత ప్రధాని దేవగౌడ గట్టి మద్దతునిచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇటీవల నీను కలిసి చర్చించినప్పుడు తమ జెడిఎస్ సంపూర్ణ మద్దతుంటుందని వారు స్పష్టం చేశారు.  ఇప్పటికే పలువురు ఆర్థిక శాస్త్రవేత్తలు, పలు రంగాల నిపుణలతో అనేక చర్చలు చేసినం. జాతీయ పార్టీ ఏర్పాటు లో వారి సలహాలు తీసుకున్నం.

పాత పద్ధతులు మనమే మార్చాలి

వనరులుండీ కూడా వాటిని సద్వినియోగం చేసుకోలేక దేశ ప్రజలు వంచించబడుతున్నారు. ఇది శోచనీయం. ఈ పద్దతి మారాలే. మనమే మార్చాలె. మన తెలంగాణ ను ఎట్లయితే మనం బాగుచేసుకున్నమో…మన దేశాన్ని కూడా మనం బాగుచేసుకోవాలె. ఈ దేశంలో సారవంతమైన వ్యవసాయ యోగ్యమైన సాగు భూమి వున్నది. పుష్కలంగా నీరువున్నది. కష్టపడి పనిచేసే ప్రజలున్నరు,.ఇన్నీ వున్న తర్వాత మన దేశం ప్రపంచానికే అన్నం పెట్టాలె. పలు రకాలనై పంటలను పండించి ప్రపంచానికి అవసరమైన ఆహార ఉత్పత్తులను అందించాలె. అది వదిలి మనమే పిజ్జాలు బర్గర్లు తినడం అంటే అవమానకరం.

మనం ఛాలెంజ్ గా తీసుకుని మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలతోని నీరు ఇచ్చినట్టు భారత దేశమంతా ఇవ్వలేమా? దేశమంతా ఇవ్వొచ్చు. మనం అదే కమిట్ మెంట్ తో దేశవ్యాప్తంగా ఇంటింటికి నల్లా నీరును అందించాలె. ఇందుకు చైనాతో పాకిస్తాన్ తోనో అమెరికా తోనో యుద్దం చేయాల్సిన అవసరం లేదు. కేవలం చిత్తశుద్ది ఉంటే చాలు…శుద్ది చేసిన మంచినీరును దేశమంతా అందించగలం. ఈ సమావేశంలో కూర్చున్న వాల్లంతా  తెలంగాణ సాదించిన యోధులు…వీరు అదే స్పూర్తితో దేశ సేవ చేయడానికి సిద్దంగా వున్నారు (అతిథులనుద్దేశించి హిందీలో చెప్పిన సిఎం గారు).

సీఎంగా ఉంటూనే దేశంలో పర్యటిస్తా

 నీను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా వుంటూనే దేశమంతా పర్యటిస్తా. కార్యక్షేత్రం వదలం. ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానం అక్కరలేదు. ఉజ్వల భారతం తయారు కావాల్సిన అవసరమున్నది. మన దేశంలోని వనరులు మన దేశంలోనే వాడితే అమెరికా కంటే గొప్పగా అభివృద్ధి చెందుతాం,. మనకు ఇంకా మంచి సమయం ఉన్నది. మనం దేశవ్యాప్తంగా విస్తరిస్తం.

మహారాష్ట్రతో మొదలు

మొట్టమొదటి కార్యక్షేత్రంగా మహారాష్ట్రను ఎంచుకుంటం. మన జాతీయ పార్టీ కి అనుబంధ రైతు సంఘటన ను మొదట మహారాష్ట్ర నుంచే ప్రారంభిస్తం. తెలంగాణ వల్ల దేశానికి మంచి జరిగితే అది దేశ చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోతది. దళిత ఉద్యమం, రైతు ఉద్యమం, గిరిజన ఉద్యమం ద్వారా వీటిని ప్రధాన ఎజెండాగా తీసుకోని ముందుకు సాగుతాం. దేశవ్యాప్తంగా వున్న అనేక సామాజిక రాజకీయ రుగ్మతలను తొలగిస్తాం. ఇప్పటికే తెలంగాణ ఆచరించి దేశానికి చూపించింది. తలెత్తుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ముందుకు సాగుతాం. తెలంగాణ ఉద్యమాన్ని విజయతీరాలకు తీసుకపోయినట్టుగానే, దేశాన్ని ముందుకు తీసుకపోవాలె. తెలంగాణ లో ప్రతి వర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేసి సాధించినం. పల్లెలు పట్టణాలను అభివృద్ధి పరుచుకున్నం. కేంద్రం ప్రకటించిన అవార్డులే అందుకు సాక్ష్యం. ఒక అద్భుతమైన తాత్విక పునాదితో ముందుకు సాగుతాం. దేశవ్యాప్తంగా సాగే క్రమంలో అందరి సహకారం అవసరం. ఎట్లయితే పట్టుదలతో తెలంగాణ ప్రజలను గెలిపించినమో..అదే పద్దతిలో దేశ ప్రజలను కూడా లక్ష్య సాధనలో మనం గెలిపిస్తాం.’’ అని కెసిఆర్ అన్నారు.

కుమారస్వామి, తమిళ సోదరులు హాజరు

టిఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జాతీయ పార్టీ భారతీయ రాష్ట్ర సమితిని ప్రారంభించిన  సందర్భంగా, సిఎం కెసిఆర్ గారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా  హాజరయ్యేందుకు కర్నాటక నుంచి ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ జనతాదళ్ (ఎస్) ముఖ్యనేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి  వారితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, తదితర ప్రజా ప్రతినిధుల బృందం బెంగుళూరు నుంచి వచ్చారు.  

అదే సందర్భంగా, తమిళ నాడు నుంచి  ‘విదుతాలై చిరుతైగల్ కట్చె’ (విసికె)పార్టీ అధినేత ‘చిదంబరం పార్లమెంట్ సభ్యుడు’, ప్రముఖ దళిత నేత  తిరుమావళవన్., వారితో పాటు వచ్చిన ప్రతినిధుల బృందం, బుధవారం ఉదయం ప్రగతి భవన్ కు చేరుకున్నది.

ప్రగతి భవన్ వచ్చిన కుమారస్వామి బృందాన్ని, తిరుమావళవన్ బృందాన్ని., టిఆర్ఎస్ అధినేత కెసిఆర్, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ లు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన అల్పాహార విందులో పాల్గొని వారికి ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్., టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితర ప్రజాప్రతినిధులు ఉన్నారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles