ఫుట్ బాల్ ఆటలోలాగానే రాజకీయ క్రీడలోకూడా జరుగుతుంది. బంతి ఎవరి చేతిలో ఉన్నదనేదే అన్నింటికంటే ప్రధానం. అందుకే రాజస్థాన్ సంక్షోభం సైతం భారత్ జోడో యాత్రను పట్టాలు తప్పించలేకపోయింది.
భారత్ జోడో యాత్ర ఎటువంటి మథనాన్ని అంతర్లీనంగా సృష్టించిందో తెలుసుకోవడానికి ఒక ఫోటోగ్రాఫ్ సరిపోతుంది. (కర్ణాటకలో) కుంభవృష్టిలో రాహుల్ గాంధీ ఆపకుండా చేసిన ప్రసంగాన్ని వేలాదిమంది సభికులు ప్లాస్టిక్ కుర్చీలు నెత్తిమీద గొడుగులా పెట్టుకొని అక్కడే నిలబడి ఏకాగ్రచిత్తతంతో వినడం విశేషం. ఈ చిత్రం ప్రభావం వేలాది వార్తావ్యాఖ్యల కన్నా ఎక్కువ. యాత్రకు ఎక్కువ ప్రాచుర్యం రాకపోయి ఉండవచ్చును కానీ ఈ చిత్రానికి మాత్రం చాలా ప్రచారం వచ్చింది. వైరల్ అయింది.
యాత్ర పట్ల ప్రజల స్పందనలో కొంచెం తేడా వచ్చినట్టు ఈ పరిణామంసూచిస్తున్నది. భారత్ జోడో యాత్ర ప్రారంభం అంత ఉత్తేజభరితంగా లేదు. సెప్టెంబర్ 7న మేము కన్యాకుమారి నుంచి యాత్రలో బయలుదేరినప్పుడు మాకు అపనమ్మకం, అజ్ఞానం, అనుమానం ఎదురయ్యాయి. ‘‘ఇది నిజంగా పాదయాత్రేనా?’’ అంటూ ఒక సీనియర్ జర్నలిస్టు ప్రశ్నించడం నాకు గుర్తున్నది. ఈ యాత్ర ఎందుకు తలపెట్టారో, దీని ఉద్దేశం ఏమిటో తెలిసినవారు ఎవ్వరూ లేరు. ‘‘కాంగ్రెస్ నాయకులు నిజంగా నడుస్తారా? కాంగ్రెస్ యాత్రలో రాహుల్ గాంధీ అప్పుడప్పుడు పాల్గొంటారా? కాంగ్రెస్ యాత్ర ఒక వీధి బాగోతంగానో, తమాషాగానో, అంతకంటే చిన్నదిగానో ప్రజలకు అర్థం కాదుకదా?’’ పాదయాత్రకు బయలు దేరడానికి ఒక రోజు ముందు నేను కొంతమంది సమీప కుటుంబ స్నేహితులను కలుసుకున్నాను. వారిలో ఆదుర్దా కనిపించింది. ‘యోగేంద్రజీ, మీకున్న మంచి పేరును ప్రమాదంలో పడవేస్తున్నారు. రిస్కు తీసుకుంటున్నారు.మీరు కాంగ్రెస్ లో చేరడం లేదని మాకు తెలుసును. కానీ ఆ పార్టీతో పరోక్షంగా సంబంధం పెట్టుకున్నా సరే అది మృత్యువును ముద్దాడినట్టే కదా?’’ అని మిత్రులు ఆందోళనగా అడిగారు.
భారత జోడో యాత్రలో మొదటి మాసంలోనే ఏదో మార్పు వచ్చింది. జాతీయ దృక్పథంలో మార్పు వచ్చిందనడం తొందరపాటు అవుతుంది. కానీ ఈ యాత్ర ఏదో సకారాత్మక పరిణామంగా పరిణమించిందనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. ఈ అభిప్రాయం సహచరుల నోటి నుంచి నాకు తరచుగా వినిపించింది. బారత జోడో యాత్ర మామూలు రాజకీయ తమాషా కాకుండా భిన్నంగా ఉన్నదని చెప్పడానికి ఆరు కారణాలు కనిపిస్తున్నాయి.
1. ప్రతిస్పందన యాత్ర కాదు
మొదటి కారణం, ఇది ఎవరో ఏదో చేస్తేనో, అంటేనో దానికి స్పందనగా ప్రారంభమైన యాత్ర కాదు. రియాక్టివ్ కేంపెయిన్ కాదు. ప్రోయాక్టివ్ కేంపెయిన్.ఇది సకారాత్మకమైనది. కాంగ్రెస్ పార్టీ చొరవ కారణంగా క్షేత్రంలో జరుగుతున్నది. ఈ దేశంలో ఒక ప్రధానమైన జాతీయ ప్రతిపక్షం చొరవ తీసుకొని ఉద్యమం చేసి ఒక సకారాత్మకమైన ప్రాధాన్యక్రమాన్ని, అజెండాను నిర్దేశించే ప్రయత్నం చాలాకాలం తర్వాత ఇప్పుడు జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ నిర్దేశిస్తున్న అజెండాకు ప్రతిస్పందిస్తోంది. యాత్ర మొదలై నెల రోజులు కాకుండానే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పనికట్టుకొని ముస్లిం మేధావులతో సమాలోచనలు జరపడం కాకతాళీయం కాకపోవచ్చు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, దారిద్ర్యం, అసమానతల గురించి ఆర్ఎస్ఎస్ ఆందోళన వెలిబుచ్చడం కూడా గమనార్హం. ఇవే అంశాలను కాంగ్రెస్ యాత్రలో రాహుల్ గాంధీ అదేపనిగా ప్రస్తావిస్తున్నారు. ఫుట్ బాల్ ఆటలో లాగానే బంతి ఎవరి చేతిలో ఉన్నదనే విషయం ముఖ్యం. అందుకే రాజస్థాన్ పరిణామాలు కూడా భారత్ జోడో యాత్రను రెండు రోజులకు మించి ప్రభావితం చేయలేదు.
2. ఇది నేలపైన నడుస్తూ చేస్తున్న పాదయాత్ర
రెండోది, ఇది ఏదో ఒక యాత్ర కాదు. ఇది పాదయాత్ర. నేలపైన నడవడం అనేది చాలా సాంస్కృతిక ప్రభావం వేసే రాజకీయ ప్రక్రియ. పాదయాత్రలో ప్రయాస ఉంటుంది. యాత్రికుడి విశ్వాసాలను చాటే వ్యాకరణం ఉంటుంది. అది కాన్వార్ యాత్ర కావచ్చు. అమర్నాథ్ యాత్ర కావచ్చు. నర్మదా యాత్ర కావచ్చు. భారతదేశంలో వందలాదిగా జరిగే సామాజిక, రాజకీయ యాత్రల వంటిది కావచ్చు. నడిచే వ్యక్తికీ, నడకను చూస్తున్న వ్యక్తికీ మధ్య అంతరాన్ని తగ్గిస్తుంది. తెరమీద కనిపించే ప్రజలు ప్రభావానికి గురైన భాగస్వాములు అవుతారు. పాదయాత్ర కనిపించని, వినిపించని సంభాషణ. ఆచరణ ద్వారా మాట్లాడుతుంది.
Also read: బీహార్ మోదీ కొంప ముంచుతుందా?
3. సంఘీభావం ప్రకటించే బలప్రదర్శన
మూడో కారణం, ఇది కేవలం ప్రతిఘటన మాత్రమే కాదు. ఇది నేలపైన పాదాలు మోపడం. శక్తిని భౌతికంగా ప్రదర్శించడం. ప్రజల ఆశీస్సులు తమకు ఉన్నాయని చెప్పుకోబట్టే బీజేపీ-ఆర్ఎస్ఎస్ కు ఉనికి కనిపిస్తున్నది కనుక ఎటువంటి ప్రతిఘటన అయినా క్షేత్రంలో బలప్రదర్శన కావాలి. ప్రతి విమర్శకుడినీ ఒంటరివాడిని చేసే ప్రయత్నం జరుగుతోంది కనుక సంఘీభావం చెప్పాలంటే జనం గుమిగూడాలి. వేలాది మంది ప్రజలు కదంకదం కలిపి వీధులలో నడవడం అంటే అది అధికారవాదానికి ప్రతివాదమే అవుతుంది. చట్టసభలో (సన్సద్)మాట్లాడే అవకాశం లేనప్పుడు రోడ్డుపైన (సడక్) గొడవ చేయవలసిందే.
4. కిరాయి జనం కాదు, ఐచ్ఛికంగా వచ్చిన ప్రజలు
నాలుగు, పాదయాత్రలో పాల్గొన్నవారంతా కిరాయి జనం కాదు. నిజంగా ప్రజలు తమంతట తాము ఐచ్ఛికంగా స్పందించి రాహుల్ తో కదం కలిపారు. పాదయాత్రలో పాల్గొన్న ప్రజలలో ఎక్కువమందిని కాంగ్రెస్ పార్టీ సమీకరించదనడంలో సందేహం లేదు. వారిలో ఎన్నికలలో పోటీ చేయడానికి కాంగ్రెస్ టిక్కెట్టు ఆశిస్తున్నవారు కూడా ఉంటారు. కానీ భారత్ జోడో యాత్రలో మూడు రాష్ట్రాలలో పాల్గొన్న వ్యక్తిగా నేను చిరునవ్వులు చిందించే మొహాలలో ఇంద్రధనస్సులోని రంగులనూ, భావాలనూ గమనించాను. ప్రతి నవ్వు వెనుకా ఆ మనిషి మనస్తత్వాన్ని పసిగట్టడం కష్టం. కానీ ఈ యాత్ర వల్ల ప్రజలలో ఒక ఆశాభావం జనించిందని నాకు అనిపిస్తోంది. అందుకు యాత్రను వైఫల్యంగా చూపించేందుకు బీజేపీ ఐటీ సెల్ (సమాచార సాంకేతిక విభాగం)వారు చేసిన ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించక పోవడమే నిదర్శనం.
5. లౌకికవాదం ప్రధానాంశం కాదు
అయిదో కారణం ఏమంటే, ఇది కేవలం మతసామరస్యం, లౌకికవాదం గురించి నినాదాలు, ఉపన్యాసాలు ఇవ్వడానికి ఉద్దేశించిన పాదయాత్ర కాదు. ఈ రోజు అవసరమైన బహుముఖీనమైన సమైక్య సందేశాన్ని ప్రచారం చేసింది భారత్ జోడా యాత్ర. అన్నిటికంటే ప్రధానమైన విషయమైన ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సమస్యలను ప్రముఖంగా ప్రస్తావించడంలో సఫలమైంది. కులాలు, భాషలు, మతాలకు అతీతంగా సమైక్యంగా ఉండాలన్నది రాహుల్ గాంధీ ప్రతిరోజూ చేసే ప్రసంగంలో ప్రధానాంశం. నరేంద్రమోదీ ప్రభుత్వంపైన ఆయన చేసే విమర్శలు కేవలం ముస్లింల పట్ల ద్వేషపూరిత రాజకీయాలకు పరిమితం కావు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, పెద్దనోట్ల రద్దు నిర్ణయం. గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్ టీ), పరిపాలనలో లోపాలు వంటి అంశాలను సైతం అంతే ప్రముఖంగా, అంతే ప్రభావవంతంగా ప్రస్తావిస్తున్నారు. విధేయమైన పెట్టుబడి (క్రోనీ కేపటిలిజం)గురించి మాట్లాడుతున్న ప్రధాన స్రవంతి చెందిన ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ. ప్రత్యర్థులు పన్నిన వలలో పడకుండా యాత్ర తనదైన సందేశాన్ని రూపొందించుకోవడం విశేషం.
6. కాంగ్రెస్ తో సంబంధం లేని అనేక సంస్థలు
చివరిగా, ఇది కేవలం కాంగ్రెస్ వ్యవహారం కాదు. భారత్ జోడో యాత్రను గతంలో కాంగ్రెస్ తో ఎటువంటి సంబంధం లేని చాలా ప్రజాఉద్యమాలు, ప్రజాసంస్థలు, ప్రజామేధావులు, పౌరప్రముఖులు సమర్థిస్తున్నారు. (ఈ సంస్థల ప్రతినిధుల సమన్వయంలో ఈ రచయిత నిమగ్నమై ఉన్నారు.) సాధారణంగా రాజకీయ వైఖరి వెల్లడించనివారూ, కాంగ్రెస్ పార్టీని బలపరచిన దాఖలా లేనివారూ ఈ సారి బహిరంగంగా కాంగ్రెస్ నాయకులతో కలసి నడవడానికి ముందుకొచ్చారు. దీనిని కాంగ్రెస్ తో అంటకాగడంగానో, కాంగ్రెస్ నాయకత్వానికి విధేయంగా ఉండటంగానో అపార్థం చేసుకోకూడదు. ఇది భారత్ జోడో యాత్ర స్ఫూర్తిని సూచిస్తుంది. దాని నైతిక స్థయిర్యాన్ని ధ్రువీకరిస్తుంది.
ఈ వ్యాసం ప్రారంభంలో ప్రస్తావించిన కుటుంబ స్నేహితులనే మంగళవారంనాడు కలుసుకున్నాను. ఈ సారి వారిలో మునుపటి ఆందోళన లేదు. ‘కుఛ్ తో హోరహా హై’’ అంటూ వారు చిందించిన చిరునవ్వులలోనే నాకు వారి సందేశం విస్పష్టంగా వినిపించింది. ‘అవును’ అంటూ నేను వారితో ఏకీభవించాను. ‘‘మనం కనిపించిన సద్భావాన్ని ఒక సానుకూల కెరటంగా అపార్థం చేసుకోకూడదు. చిత్రం ఇంకా పూర్తిగా వెల్లడి కావలసి ఉంది (పిక్చర్ అభీ బాకీ హై)’’ అన్నాను.
Also read: ‘ఉచితాలు’ ఒక వ్యాధి వంటివా? సుప్రీంకోర్టు నిరుపేదల తర్కానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందా?