Wednesday, December 25, 2024

భరతుడి పీడకల

రామాయణమ్44

భానుడి కిరణాలు పుడమిని స్పృశిస్తున్నా రాజు ఇంకా కనులు తెరవలేదు. వందిమాగధులు స్తోత్రపాఠాలు మొదలు పెట్టారు. అయినా మహారాజు బయటకు రాలేదు.

దశరథుడి భార్యలు ఆయనను నిద్ర లేపటానికి ప్రయత్నం చేశారు. శాశ్వతనిద్రలోకి జారుకున్న ఆయన ఎలా నిద్దుర లేస్తాడు?

రాణులకు అర్ధమయ్యింది ఇక తమ రాజు లేవడని! ఒక్కసారిగా రాణివాసమంతా గొల్లుమంది. ఈ వార్త కైకకు చేరింది. ఆవిడ కౌసల్యా మందిరానికి వచ్చి విలపింపజొచ్చింది.

Also read: దశరథ మహారాజు అస్తమయం

ఆవిడను చూడగనే అందరి మనస్సులోఒక రకమైన ఏహ్యభావము ప్రవేశించింది. భర్త తల ఒడిలోపెట్టుకుని కూర్చున్న కౌసల్య కైకను చూడగనే ‘‘పాపాత్మురాలా నీ కళ్ళు చల్లబడ్డాయా! నీ కోరిక తీరిందిగదా! అడ్డేలేకుండా ఇక నీవు రాజ్యాన్ని ఏలుకో. నా కొడుకును నానుంచి దూరం చేశావు. ఇప్పుడు మగడు కూడా శాశ్వతంగా దూరమయ్యాడు.’’

ఈ విధంగా ఏడుస్తున్న ఆడువారినందరినీ మంత్రులు ఆయన శరీరం వద్ద నుండి దూరంగా తీసుకొని పోయారు. కొడుకులెవ్వరూ దగ్గరలేని కారణం చేత ఆయన అంతిమ సంస్కారములు ఎలా చేయాలో వారికి అర్ధం కాలేదు.

వశిష్ట మహాముని ఆజ్ఞమేరకు భరతుడు వచ్చేవరకు రాజు శరీరాన్ని తైలద్రోణిలో(నూనెతో నిండిన పెద్ద పాత్ర) ఆయన అంతకు ముందు పడుకున్న శయనము మీదనే ఉంచాలని నిశ్చయించి ఆ ప్రకారం చేశారు.

మంత్రులంతా వశిష్ఠ మహర్షితో కూడి సమావేశమయి రాజులేని రాజ్యంలో అరాచకం ప్రబలుతుంది కాబట్టి ఏం చేయాలా అని ఆలోచించి సిద్దార్ధుడు, జయంతుడు, అశోకుడు, విజయుడు, నందనుడు అనే దూతలను పిలిచి ‘‘మీరు అతిశీఘ్రముగా కేకయ రాజ్యానికి వెళ్ళి భరతుడిని వెంటనే తీసుకొని రండి. కానీ …ఇక్కడ జరిగిన విషయాలేవీ అక్కడ ప్రస్తావించవద్దు. వెళ్ళేటప్పుడు మామూలుగా ఏవిధమైన బహుమతులు ఎప్పుడూ కేకెయరాజుకు తీసుకు వెడతారో అవికూడా వెంట తీసుకొని వెళ్ళండి. ఎవరికీ ఏ విధమైన అనుమానం కలుగకుండా ప్రవర్తించండి’’ అని ఆదేశించారు.

Also read: దశరథుడిపై కౌసల్య హృదయవేదనాభరిత వాగ్బాణాలు

వశిష్ఠమహర్షి ఆజ్ఞననుసరించి వారు  వెంటనే అతిశీఘ్రముగా ప్రయాణించగల అశ్వాలను అధిరోహించి కేకెయ రాజ్యం వైపుగా సాగిపోయారు.

భరతుడిని తీసుకురావటానికి బయలుదేరిన ఆ దూతలు అతి వేగంగా ప్రయాణం చేస్తున్నారు.

వారు ముందుగా అపరతాల పర్వత దక్షిణభాగం దాటారు.

ఆ తరువాత అపరతాల, ప్రలంబ పర్వతాల మధ్య ప్రవహించే మాలినీ నది వెంట ఉత్తరంగా ప్రయాణం చేసి మరల పడమరవైపు తిరిగారు.

Also read: వాల్మీకి మహర్షి ఆశ్రమంలో పర్ణశాల నిర్మాణం

వారు అలా హస్తినాపురం చేరి అక్కడ గంగ దాటి మరల పడమరగా ప్రయాణం చేసి కురుజాంగల మధ్యదేశము మీదుగా పాంచాలము చేరి అక్కడ నుండి ప్రయాణం చేసి శరదండా నదిని దాటి ఇంకా వేగంగా ప్రయాణం చేశారు.

ఆ నదీ తీరం మీదున్న సత్యొపయాచన అనే దివ్యవృక్షానికి ప్రదక్షిణము చేసి కులింగా నది దాటారు.

ఎక్కడా ఆగటంలేదు. అలసట లక్ష్యపెట్టకుండా  అక్కడనుండి అభికాల అనే గ్రామం చేరి అక్కడ ఇక్షుమతీ నదిని దాటి, అక్కడ నుండి బాహ్లికదేశం మీదుగా సుదామ పర్వతం చేరారు.

అక్కడ నుండి ఇంకా వేగంగా ప్రయాణించి నాల్గవ రోజు రాత్రికి కేకెయ రాజధాని గిరివ్రజపురం చేరారు.

ఆ రాత్రి నిదురించిన భరతుడికి తెల్లవారుఝామున ఒక పీడకల వచ్చింది. వెంటనే లేచి కూర్చున్న ఆయన మనసులో చాలా దుఃఖించి పరితపించసాగాడు.

Also read: భరద్వాజ మహర్షి ఆతిథ్యం, మార్గదర్శనం

ఆయన పరితాపము గ్రహించిన స్నేహితులు ఆయనకు రకరకాల కధలు చెపుతూ మనసులో కలిగిన ఆ ఖేదాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఆయన మనస్సెందుకో కుదుటపడటంలేదు. అప్పుడు ఉండబట్టలేక కొందరు మిత్రులు కారణమడిగారు. అందుకు ఆయన తనకు వచ్చిన కల ఎట్లాంటిదో చెప్పాడు.

‘‘నా తండ్రి మట్టికొట్టుకుపోయిన శరీరంతో జుట్టు విరబోసుకుని పర్వతశిఖరము మీదనుండి ఆవుపేడ తో నిండిన గోతిలో పడిపోయినట్లు అందులోనే మునిగితేలుతూ  మాటిమాటికీ పిచ్చివాని వలే నవ్వుతూ దోసిళ్ళతో నూనె తాగుతున్నట్లగా ఉండి నువ్వులు కలిపిన అన్నం తింటూ మాటిమాటికీ తల వాలుస్తూ నూనెలో మునిగిపోయినాడు.

‘‘నా తండ్రి ఎర్రటి మాలలు ధరించినట్లుగా ఎర్రటి గంధము వంటికి పూసుకొన్నట్లుగా  గాడిద నెక్కి దక్షిణదిక్కుగా ఒక రాక్షసి లాక్కొని పోతున్నట్లుగా కనపడినాడు.

‘‘ఇంకా సంద్రము ఎండిపోయినట్లు, చంద్రుడు ఆకాశంనుండి రాలి పడిపోయినట్లు, భద్రగజముల దంతములు విరిగిపోయినట్లు, మండే మండే అగ్ని హఠాత్తుగా ఆరిపోయినట్లు, భూమి బ్రద్దలైనట్లు భూమి అంతా పొగ ఆవరించి చెట్లు ఎండిపోయినట్లు కనపడ్డది.

Also read: కల్లోల సాగరమై, తేరుకొని, దృఢమైన రాముడి మనస్సు

‘‘ఏమో మా అయిదుగురిలో ఎవరో ఒకరికి మరణము సంభవించవచ్చునేమో! నా గొంతు ఎండిపోతున్నది. ఏదో తెలియని భయం మనస్సును పట్టి పీడిస్తున్నది’’ అని భరతుడు తన స్నేహితులతో పలుకుతూ ఉండగనే అయోధ్య నుండి వచ్చిన దూతలు సభలో ప్రవేశించారు.

Also read: గుహుడిని గుండెకు హత్తుకున్న రాముడు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles