సోమవారం ఉదయం గం. 6 నుంచి మధ్యాహ్నం గం. 4 వరకూ భారత్ బంద్ నిర్వహించాలని కిసాన్ ముక్తి మోర్చా పిలుపునిచ్చింది. వివాదాస్పదమైన మూడు వ్యవసాయ బిల్లులకూ రాష్ట్రపతి ఆమోదం తెలిపి చట్టాల ప్రతిపత్తి కల్పించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా భారత్ బంద్ కు కిసాన్ ముక్తి మోర్చా పిలుపునిచ్చింది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఈ బంద్ ను సమర్థించడమే కాకుండా నిరసన కార్యక్రమాలలో పాలుపంచుకుంటానని ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ బంద్ ను సమర్థిస్తున్నదనీ, ఏపీఎస్ఆర్ టీసీ బస్సులు
ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకూ కదలవనీ సమాచార మంత్రి పేర్ని వెంకటరామయ్య (నాని) శనివారంనాడు ప్రకటించారు. తమిళనాడు, కేరళ, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బంద్ పిలుపుకు సానుకూలంగా స్పందించాయి. బీహార్ ప్రతిపక్ష నాయకుడు, జేఆర్ డీ నేత తేజస్వియాదవ్ కూడా బంద్ ను బలపరిచారు.
వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని కోరుతూ దిల్లీలో వ్యవసాయదారులు దాదాపు పదకొండు మాసాలుగా నిరసన దీక్ష చేస్తున్న సంగతి విదితమే. సంవత్సరంలోని అన్ని రుతువులలో వారు దీక్ష కొనసాగించారు. చలికి తట్టుకోలేక, కోవిద్ వ్యాధిసోకి కొంతమంది మరణించారు. అయినప్పటీకీ రైతు ఉద్యమం పట్టు సడలించలేదు. పైగా సమాజంలోని ఇతర వర్గాల మద్దతును కూడా గట్టుతున్నారు.
సోమవారంనాడు ప్రభుత్వ సంస్థలూ, ప్రైవేటు సంస్థలూ, విద్యాసంస్థలూ, బ్యాంకులూ, షాపులూ, పరిశ్రమలూ, వాణిజ్యసముదాయాలూ అన్నీ మూతబడి ఉంటాయి. ఆస్పత్రులు, మెడికల్ షాపులూ, తుఫాన్ వచ్చిన ప్రాంతాలలో రక్షణ, సహాయక చర్యలు, తదితర నిత్యావసర సేవలకు మినహాయింపు ఇచ్చారు.