Thursday, December 26, 2024

పూర్తిగా రాజకీయమే కథావస్తువుగా ‘భారత్ బంద్’

5వ భాగం

భార‌త్‌బంద్‌: ఇలాంటి రాజ‌కీయ నేప‌థ్యం గ‌ల క‌థ‌, క‌థ‌నాల‌తో వ‌చ్చిన మ‌రో చిత్రం ‘‘భార‌త్‌బంద్‌.’’ ఇది పూర్తిగా రాజ‌కీయ‌మే క‌థా వ‌స్తువుగా గ‌ల చిత్రం. ఒక ప్రాంతం, ఒక రాష్ట్రం అని కాకుండా ప్ర‌జాక్షేమం కోరుతూ స‌మాజ అభివృద్ధిని కాంక్షిస్తూ ఉండ‌వ‌ల‌సిన రాజ‌కీయ నాయ‌కులు ఏవిధ‌మైన నైతిక విలువ‌లు లేకుండా కేవ‌లం ధ‌న‌బ‌లం, ప‌లుకుబ‌డితో ఎలా ఎన్నికై ‘‘పాల‌కులు’’ అవుతున్నారో తేట‌తెల్లంగా తెలియ‌చెప్పిన చిత్రం భార‌త్‌బంద్‌“!

Watch Bharat Bandh | Prime Video
దర్శకుడు కోడి రామకృష్ణ

క‌నీస విద్య‌, స‌మాజ ప‌రిస్ధితుల ప‌ట్ల ఏమాత్రం అవ‌గాహ‌న లేకుండా కేవ‌లం వారి వారి ఆర్ధిక పురోభివృద్ధికి, అధికార వ్యామోహానికి, రాజ‌కీయ నాయ‌కుల రూపంలో ప్ర‌జ‌ల ముందుకొచ్చి నిల‌బ‌డి ప‌ద‌వులు చేజిక్కించుకుని, ఆ త‌రువాత నాలుగు చేతుల‌తో రాష్ట్రాన్ని, దేశాన్ని దోచుకునే దుర్మార్గ‌పు రాజ‌కీయ నాయ‌కుల ఊస‌ర‌వెల్లి రంగుల‌ను నిర్భయంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చిన అరుదైన రాజ‌కీయ చిత్రం “భార‌త్‌బంద్‌“!

Also read: రాజకీయ కుతంత్రాలపైన శరసంధానం

ప్ర‌జాస్వామ్యం పేరుతో, ప్ర‌జ‌లే పాల‌కులు అంటూ ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌యి ఓట్ల కోసం ప్రాధేయ‌ప‌డి, ఆ ఓటుతో గ‌ద్దెనెక్కిన పాల‌కులు చేస్తున్న వికృత రాజ‌కీయాలు, వాటి విషప‌రిణామాల‌ను క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్టు చూపిన చిత్ర‌మే భార‌త్‌బంద్‌“!

వ‌ర్త‌మాన రాజ‌కీయాల ప‌ట్ల ప్ర‌స్తుత స‌మాజ ప‌రిస్ధితుల ప‌ట్ల‌, సామాన్యుని జీవ‌న విధానం మీద‌, స‌మ‌గ్ర‌మైన అవ‌గాహ‌న‌, ద‌ర్శ‌క‌, ర‌చ‌యిత‌ల‌కు లేక‌పోతే ఇలా జాతిని జాగృతం చేస్తూ స‌మాజాన్ని చైత‌న్యం చేసే భార‌త్‌బంద్ లాంటి చిత్రాలు రావు.

ఆశ్చ‌ర్యంగా ఘ‌న విజ‌యం పొందిన “అంకుశం“, “భార‌త్‌బంద్‌“ చిత్రాల ద‌ర్శ‌కుడు శ్రీ కోడి రామ‌కృష్ణ కావ‌డం విశేషం! స‌మాజం ప‌ట్ల ఓ నిబ‌ద్ధ‌త‌, అభ్యుద‌య మార్గంలో స‌మాజాన్ని న‌డిపించాల‌నే ఆలోచ‌న‌, దృఢ‌మైన అభిప్రాయం గ‌ల ద‌ర్శ‌కులు, నిస్సందేహంగా ప్ర‌గ‌తి భావ ప్రేమికులు!

Also read: రైతులకూ, సేద్యానికీ పట్టం కట్టిన ‘రోజులు మారాయి’

ముందడుగు

నాటి “ముంద‌డుగు“: స‌మాజంలో ఎన్నో వృత్తుల వారుంటారు. వారిలో క‌ర్ష‌కులు, కార్మికులు, ఇత‌ర వృత్తుల వారుండ‌టం స‌హ‌జం! వారిలో కార్మికుల గురించి విశ్వ‌వ్యాప్తంగా ఎన్నో ఉద్య‌మాలు, పోరాటాలు జ‌రిగాయి. పెట్టుబ‌డిదారీ వ‌ర్గం వారి నుంచి ప్ర‌పంచ వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు, నిజంగా చెప్పాలంటే శ‌తాబ్దాల నాటివి! వాటి వివ‌రాల‌లోకి వెళితే నాటి స‌మాజంలో కార్మికుల‌కు ఇన్ని గంట‌లు ప‌నిచేయాల‌నీ ప‌నిగంట‌లు ఉండేవి కావు. రోజంతా శ్ర‌మ చేయాల్సిందే. వారి శ్ర‌మ‌ను దోపిడీ చేసే య‌జ‌మానుల‌కు, మాన‌వ‌త్వం, స‌మాన‌త్వం అనే ప‌దాలు తెలియ‌వు! అలాంటి దుర్భ‌ర ప‌రిస్ధితుల‌లో నాటి కార్మికులు కేవ‌లం అతి త‌క్కువ వేత‌నాల‌తో, కుటుంబాన్ని సైతం పోషించుకోలేని చాలీచాల‌ని ఆదాయంతో ప‌నిచేయాల్సి వ‌చ్చేది.అయితే నిర్దుష్ట‌మైన ప‌నిగంట‌లు, ప‌నికి త‌గిన వేత‌నం, కార్మికుల‌కు సంక్షేమ సౌక‌ర్యాలు, ఇవ‌న్నీ సాధించ‌డానికి ప్ర‌పంచంలోని కార్మిక వ‌ర్గం ఏళ్ల త‌ర‌బ‌డి యాజ‌మాన్య వ‌ర్గంతో నిత్య పోరాటం చేయ‌వ‌ల‌సి వ‌చ్చింది.

ముందడుగు (1958 సినిమా) - వికీపీడియా

‘‘పోరాడితే పోయేదేముంది, సంకెళ్ళు త‌ప్ప’’ అన్న నినాదం అప్పుడే ఊపిరి పోసుకుంది! అది ప్ర‌పంచం న‌లుమూల‌లా ప్ర‌తిధ్వ‌నించింది. యాజ‌మాన్య‌పు దౌష్ట్యానికి, ప్ర‌తిఘ‌ట‌న సంకేతంలా, సందేశంలా రూపుదాల్చింది. ‘‘సంప‌ద సృష్టించేది కార్మికులే’’ అన్న‌ది మ‌హాక‌వి శ్రీ‌శ్రీ వాక్కు. అయితే, ఆ సంప‌ద‌కు మూల కార‌కులైన కార్మికుల ప‌రిస్ధితి శ‌తాబ్దాలుగా బాధాస‌ర్ప‌ద్ర‌ష్టులుగానే ఉండ‌టం జ‌రిగింది. కార్మిక స‌మ‌స్య‌లు ఆనాటి నుంచి వ‌ర్త‌మాన స‌మాజం వ‌ర‌కూ అలాగే ఉండ‌టం న‌గ్న‌స‌త్యం. స్వాతంత్ర్యానంత‌రం కూడా ప్ర‌ధాన కార్మిక స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఎన్ని చ‌ట్టాలు చేసినా వాటి అమ‌లులో విఫ‌లం కావ‌డంతో ఇవాళ్టికీ దేశంలో చాలాచోట్ల కార్మిక స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కార్మిక సంఘాలు కృషి చేస్తున్నాయి. మారుతున్న కాల మాన ప‌రిస్ధితుల‌ను దృష్టిలో పెట్టుకుని కార్మికుల సంక్షేమం కోసం యాజ‌మాన్యం (అది ప్రైవేటు రంగ‌మైనా, ప‌బ్లిక్ రంగ‌మైనా) ఆలోచించ‌న‌ప్పుడు, కార్మికుల స‌మ‌స్య‌ల‌కు స‌మాధానం దొర‌క‌దు. నిజానికి ఇది ప‌రిష్క‌రించ‌లేని స‌మ‌స్య కాదు అనే చెప్పాలి. చిత్త‌శుద్ధితో నిజాయితీగా కార్మికుల స‌మ‌స్య‌ల‌ను చూసిన‌ప్పుడు నిజ‌మైన ప‌రిష్కారం దొరుకుతుంది. అది కార్మిక ప్ర‌గ‌తికి ప్ర‌తిబింబంలా నిలుస్తుంది.

Also read: మళ్ళీపెళ్ళి, మాలపిల్ల, రైతుబిడ్డ తొలితరం అభ్యుదయ చిత్రాలు

ఇదంతా ఎందుకు చెప్ప‌వ‌ల‌సి వ‌స్తోందంటే 1950వ ద‌శ‌కంలో విడుద‌లైన “ముంద‌డుగు“ చిత్ర క‌థావ‌స్తువు కార్మిక స‌మ‌స్య‌ల‌తో ముడిప‌డిన‌దే. అప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా ఇప్పుడున్న‌న్ని ప‌రిశ్ర‌మ‌లు, కార్ఖానాలు లేవు. కానీ కార్మిక స‌మ‌స్య‌లుండ‌టం మాత్రం నిజం. అప్ప‌టి వాతావ‌ర‌ణంలో కూడా యాజ‌మాన్య‌పు అహంకారానికి బ‌లి ప‌శువుల‌వుతున్న కార్మికులు తాము సంఘ‌టిత శ‌క్తిగా ఏర్ప‌డితేనే త‌మ బ‌తుకులు బాగుప‌డ‌తాయ‌న్న నిర్ణ‌యానికి రావ‌డం జ‌రిగింది! అది స‌హ‌జం!

చిత్ర క‌థ ప్ర‌కారం విద్యా, విజ్ఞాన‌వంతుడైన క‌థానాయ‌కుడు త‌మ ఫ్యాక్ట‌రీలోనే మారుపేరుతో కార్మికుడుగా చేరి, కార్మికుల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటాడు. యాజ‌మాన్యం పేరుతో ఫ్యాక్ట‌రీలోని పై ఉద్యోగులు ఏవిధంగా కార్మికుల శ్ర‌మ‌ను దోపిడీ చేస్తున్నారో, కార్మికుల సంక్షేమ‌మే కాదు వాళ్ళ‌కి రావ‌ల‌సిన వేత‌నాల‌లో కూడా ఎలా కోత పెడుతున్నారో, ఓ కార్మికునిగా ప‌నిచేస్తూ తెలుసుకుంటాడు. అప్పుడు తానే ఆ కార్మికుల‌ను సంఘ‌టిత‌ప‌ర‌చి, వారిని చైత‌న్య‌ప‌రుస్తూ వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ముందుకు న‌డిపిస్తాడు. స్థూలంగా చిత్ర క‌థ ఇది.

అయితే సంద‌ర్భానుసారంగా చిత్రంలో వ‌చ్చే స‌న్నివేశాల‌లో స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే కార్మికుల జీవితాల‌ను, ఎప్ప‌టికైనా త‌మ ప‌రిస్ధితి మంచి దిశ‌గా మార్పు చెందుతాయ‌న్న ఆశాభావంతో, స‌హ‌నంతో ఎదురుచూసే పాత్ర‌లు, ఎంతో వాస్త‌వికంగా రూపుదిద్దుకున్నాయి.

నిజానికి “కార్మిక స‌మ‌స్య‌ల‌“ మీద క‌థాప‌రంగా ఎక్కువ భాగం స్పృశించిన తొలి చిత్రంగా ముంద‌డుగు చిత్రాన్ని చెప్పుకోవ‌చ్చు. ఈ చిత్రంలో అభ్యుద‌య భావాలు గ‌ల గీతాల‌తో ప్ర‌గ‌తిశీల సిద్ధాంతాలు, కార్మిక పోరాటాల గురించి చ‌ర్చించ‌డం జ‌రిగింది. ఈ త‌ర‌హా చిత్రాల‌కు అంటే కార్మిక వ‌ర్గ క‌థా వ‌స్తువుతో త‌రువాతి రోజుల్లో నిర్మాణ‌మైన చిత్రాల‌కు తొలి అడుగు ముంద‌డుగు“!

ఈ చిత్రం త‌రువాత పెద్ద‌గా కార్మిక స‌మ‌స్య‌లున్న ఇతివృత్తాలు గ‌ల చిత్రాలు కొన్ని వ‌చ్చినా (?) వాటి ప్ర‌భావం క‌నిపించ‌లేదు! ప్రేక్ష‌క దృష్టిని ఆక‌ర్షించ‌లేక‌పోయాయి అని చెప్ప‌వ‌చ్చు! కానీ.. మ‌ళ్ళీ..

Also read: తెలుగు చ‌ల‌న‌చిత్రాల‌లో ప్ర‌గ‌తి కిర‌ణాలు!

మనుషులు మారాలి

1969వ సంవ‌త్స‌రం: ద‌క్షిణ భార‌త చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఒక పెను సంచ‌ల‌నం క‌లిగించిన చిత్రం ‘‘మ‌నుషులు మారాలి.’’ ఈ చిత్రం గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే అవుతుంది. సాంఘిక చిత్రాలు అంటే ముఖ్యంగా కుటుంబ క‌థాచిత్రాలు వెల్లువ‌గా వ‌స్తూ, మంచి క‌థా క‌థ‌నాలున్న చిత్రాలు విజ‌యం సాధిస్తున్న స‌మ‌యంలో పూర్తిగా కార్మికుల ఇతివృత్తంతో తొలిసారి మ‌ల‌యాళంలో (తులాభారం) విడుద‌లై అక్క‌డ ఘ‌న విజ‌యం సాధించింది. ఆ చిత్రంలో క‌థానాయిక పాత్ర‌లో న‌టించిన ప్ర‌ముఖ తెలుగు క‌థానాయిక శార‌ద‌ను కేంద్ర ప్ర‌భుత్వం ‘‘ఊర్వ‌శి’’ బిరుదుతో స‌త్క‌రించ‌డం తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు గ‌ర్వ‌కార‌ణం. త‌రువాత అదే చిత్రం తెలుగులో నిర్మించిన‌ప్పుడు కూడా శార‌ద ప్ర‌ధాన పాత్ర ధ‌రించ‌డం విశేషం.

Manushulu Maaraali Songs Free Download 1969 Telugu

ఆత్మాభిమానం గ‌ల యువ‌తిగా, ఓ కార్మిక నాయ‌కుని భార్య‌గా క‌థానుసారంగా న‌లుగురు పిల్ల‌ల త‌ల్లిగా – భ‌ర్త మ‌ర‌ణం త‌రువాత ఒంట‌రి త‌ల్లిగా, ఓప‌క్క పిల్ల‌ల పోష‌ణ కోసం తాప‌త్ర‌య ప‌డుతూ రోజుకూలీగా ప‌నిచేసే కార్మికురాలిగా – ఇలా వివిధ ద‌శ‌ల‌లోని భావోద్వేగాలు నిండిన పాత్ర‌లో శార‌ద అత్యంత స‌హ‌జంగా న‌టించ‌డంతో పాత్ర క‌నిపించింది గానీ న‌టి శార‌ద క‌నిపించ‌లేదు ప్రేక్ష‌కుల‌కు. అది శార‌ద న‌ట‌నా ప్ర‌తిభ‌గా చెప్పుకోవాలి. అందుకే ‘‘ఊర్వ‌శి’’ పుర‌స్కారం! ఇక క‌థ‌, క‌థ‌నాల విష‌యానికొస్తే పెట్టుబ‌డిదారీ వ‌ర్గం వారి అన్యాయాలు, హ‌క్కుల కోసం పోరాటం చేస్తున్న కార్మికుల‌ను అణ‌చి వేయ‌డానికి అవ‌లంభించిన మార్గాలు, ఆఖ‌రికి కార్మిక నాయ‌కుడినే అంతం చేయించిన విష ప‌న్నాగం, ఇవ‌న్నీ స‌హ‌జంగా ఉండే స‌న్నివేశాల‌లో దృశ్య‌మానం చేయ‌డం జ‌రిగింది.

ఇప్ప‌టికీ: కార్మికుల‌లోని బ‌ల‌హీన‌త‌ల‌ను త‌మ స్వార్ధానికి తెలివిగా వాడుకున్న యాజ‌మాన్య‌పు దుర్మార్గ‌పుటెత్తులు, ప్ర‌పంచం న‌లుమూల‌లా ఇప్ప‌టికీ ఏదో రూపంలో సాగుతూనే ఉన్నాయి. వాటి ఫ‌లితంగా కార్మిక కుటుంబాలు ఏ ర‌కంగా న‌ష్ట‌పోతున్నాయో, ప‌రిష్కారం కాని స‌మ‌స్య‌ల వ‌ల్ల కార్మికుల కాపురాలు ఎలా కూలిపోతున్నాయో ఈ చిత్రంలో స‌జీవ పాత్ర‌ల చిత్ర‌ణ‌తో ఆవిష్క‌రించ‌డం జ‌రిగింది. ప‌రిష్కారం కాని స‌మ‌స్య‌లు ఎప్ప‌టిక‌ప్పుడు విష వ‌ల‌యం సృష్టించే యాజ‌మాన్య‌పు ప‌థ‌కాలు ఈ సుడిగుండాల నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి కార్మికులు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఇంకా నిరంత‌రం సాగుతూనే ఉన్నాయంటే ఆశ్చ‌ర్యంతో పాటు ఆవేద‌న కూడా క‌లుగుతుంది.

Also read: యడవల్లి రచన: తెలుగు సినిమాలలో ప్రగతి కిరణాలు

వెలుగుబాట

కార్మిక సంఘాలు ఎదుర్కొంటున్న వివిధ‌ర‌కాల స‌మ‌స్య‌ల‌ను, అన్యాయాల‌ను రూపుమాప‌డానికి వారికి వెలుగుబాట క్రాంతిప‌థం, చూప‌డానికి అభ్యుద‌య భావాలు గ‌ల కార్మిక నాయ‌కుల కృషి, కార్మిక జీవితాల‌లో ప్ర‌గ‌తి కోరుకునే నిస్వార్ధ నాయ‌కుల ప్ర‌య‌త్నాలు జ‌రుగుతూనే ఉన్నా ఇంకా సంపూర్ణంగా, కార్మికుల జీవ‌నం, మెరుగుప‌డ‌లేద‌నే అనిపిస్తుంది. ఇందుకు ముఖ్య కార‌ణం ప్ర‌లోభాల‌కు, స్వ‌ప్ర‌యోజ‌నాల‌కు ఆశ‌ప‌డే కొంద‌రుండ‌టం వ‌ల‌న అని చెప్పుకోవ‌చ్చు!

అయితే ఏ కొద్దిమంది వ‌ల్లో లేదా కొంద‌రి వ‌ల‌నో ఆశించిన ప్ర‌గ‌తి ఆగిపోద‌న్న‌ది నిజం. ‘‘అర‌చేతిని అడ్డుపెట్టి సూర్యోద‌యాన్ని ఆప‌గ‌ల‌వా?’’ అన్న‌ట్టు ఏ స‌మాజ పురోగ‌తి అయినా ప్ర‌గ‌తి మీదే ఆధార‌ప‌డి ఉంటుంది! ఆ ప్ర‌గ‌తి త‌మ జీవితాల‌కు నిత్య‌కాంతి అని గుర్తించ‌డం, గుర్తింపు చేయ‌డ‌మే, అస‌లైన ల‌క్ష్యంగా భావించిన నాడు అది సిద్ధిస్తుంది. స‌హ‌స్ర‌ద‌ళ అరుణారుణ క‌మ‌ల‌మై విక‌సిస్తుంది. అప్పుడు కార్మిక జీవితాల‌లోనే కాదు, ‘‘మ‌హాక‌వి’’ అన్న‌ట్టు స‌మ‌స్త వృత్తుల వారి జీవితాల‌లో ప్ర‌గ‌తి కిర‌ణాలు వెల్లివిరుస్తాయి.

ఇక్క‌డొక విష‌యం చెప్పుకోవ‌డం అప్ర‌స్తుతం కాదు. ప్ర‌గ‌తి అనేది ఆర్ధిక మూలాలున్న చోటే కాదు మాన‌వ సంబంధాల‌లోనూ అది కావాల్సిందే. అప్పుడే మాన‌వ మ‌నుగ‌డ‌లో ఆత్మీయ‌తాబంధాలు, మ‌మ‌కార‌పు అనుబంధాలు చోటు చేసుకుంటాయి అంటే కొంత ఆశ్చ‌ర్యంగా ఉన్నా అది వాస్త‌వం. క‌ల‌త‌లు, క‌ల‌హాలు లేని కుటుంబాల‌లోని ప్ర‌శాంత‌త మాన‌వ మేధ‌ను నూత‌న మార్గాల వైపు ముఖ్యంగా స‌మాజ శ్రేయ‌స్సు కోరే రీతిలో న‌డిపిస్తుంది. అప్పుడు న‌వ స‌మాజం, స‌మ స‌మాజం ప్ర‌గ‌తి బాట‌లో న‌డుస్తుంది. అయితే ఇది కేవ‌లం నినాదం కాకూడ‌దు. జీవ‌న విధానం కావాలి. అది నిజ‌మైన ప్ర‌గ‌తికి ప్ర‌తీక అవుతుంది!

Also read: అక్షర ‘సిరి వెన్నెల’

Yadavalli
Yadavalli
Yadavalli is a versatile writer in Telugu. He has been writing lyrics, script, screenplay for South Indian films and also directed a few of them.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles